Monday, April 12, 2010

మామిడి రైతుకు కష్టం

భారీగా తగ్గనున్న దిగుబడి
గుజ్జు పరిశ్రమలపై ప్రభావం
చిత్తూరు, న్యూస్‌టుడే: మామిడి కాయ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. అందుకే వీటిని పండ్లలో రారాజు అన్నారు. ఈ ఏడాది మామిడి ప్రియులు అధిక ధరలకు కొనాల్సిందే. ఎందుకంటే కాయలు మరింత ప్రియం కానున్నాయి. గత ఏడాది లాభాలు చవిచూసిన రైతుకు, ఈసారి ఒడిదొడుకులు తప్పేలా లేవు. విస్తీర్ణం పెరిగినా.. దిగుబడి బాగా తగ్గనుండడమే ఇందుకు కారణం. అకాల వర్షాలు, వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా ఈ దఫా మామిడి రైతుకు కష్టకాలమే. ఇక వినియోగదారులూ మార్కెట్లో అధిక ధర పెట్టి కొనుగోలు చేయాల్సిందే. ఎక్కువ డిమాండ్‌ ఉండే బంగినపల్లి, బేనీషా రకాల దిగుబడి మరీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయానికి కాయలు రావాల్సింది, ఇంకా ఎక్కువ భాగం పూత దశలోనే ఉంది. దీని ప్రభావం చిత్తూరు జిల్లాలోని పండ్ల శుద్ధి పరిశ్రమలపై పడనుంది.

* రాష్ట్రంలో కృష్ణా, చిత్తూరు జిల్లాలు మామిడికి పెట్టింది పేరు. ఆంధ్రలో 5 లక్షల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. విస్తీర్ణంలో 25 శాతం ఈ రెండు జిల్లాల్లోనే ఉంది. చిత్తూరులో గత నాలుగు సంవత్సరాలలో మామిడి దిగుబడి పరిశీలిస్తే.. 2005-06, 2006-07లో ఓ మోస్తరుగా కాపు వచ్చింది. 2007-08లో కాపు వచ్చినా.. మార్చి, ఏప్రిల్‌లో వచ్చిన అకాల వర్షాలకు పిందెలు రాలాయి. ధరలు ఎక్కువ పలకడంతో రైతులు కొంతవరకు గట్టెక్కగలిగారు. 2008-09లో 65 వేల హెక్టార్లకు గాను 5 లక్షల టన్నుల కాయలు వచ్చాయి. దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వచ్చింది. సుమారు 60 శాతం వరకు వచ్చింది. రైతులు భారీగా లాభపడ్డారు.

* ప్రకృతి ఈ ఏడాది అన్నదాతకు శాపంగా మారింది. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో నవంబరులో అకాల వర్షాలు పడ్డాయి. పైగా వాతావరణంలో వచ్చిన మార్పులు దిగుబడిపై ప్రభావం చూపాయి. అధిక మంచు, ఆపై ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిత్తూరులో డిసెంబరులోనే పూత రావాల్సి ఉంది. ఏప్రిల్‌లో కూడా ఇంకా చిగురు కనిపిస్తోంది. వచ్చిన కొద్దిపాటి పిందెలు కూడా ఎండలకు రాలుతున్నాయి. దీనికి తోడు తేనెమంచు పురుగు, బూడిద తెగుళ్లు ఆశించాయి. నీటి కొరత కారణంగా చెట్లు బెట్టకు వస్తున్నాయి. ఈ లెక్కన 15 నుంచి 20 శాతం లోపే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం నూజివీడు ప్రాంతంలోనే మామిడి కాయలు ముందు వస్తాయి. ఇప్పటికే ఇక్కడ సీజన్‌ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాలో ఏప్రిల్‌ మధ్య నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. నూజివీడులో ప్రస్తుతం టన్ను మామిడి ఎప్పుడు లేనంతగా.. రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. తోతాపురి రూ.20 వేల వరకు అమ్ముడవుతోంది. చిత్తూరు నుంచి బేనీషా, నూజివీడు నుంచి బంగినపల్లి, రసాలకు ఎక్కువ డిమాండ్‌. చిత్తూరు మామిడి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు రవాణా చేస్తారు. జపాన్‌, సింగపూర్‌, మలేషియా వంటి దేశాలకు ఏటా 500 టన్నుల మేర ఎగుమతి అవుతాయి.

* చిత్తూరు జిల్లాలో పండ్ల శుద్ధి పరిశ్రమలు సుమారు 67 ఉన్నాయి. వీటిలో మామిడి పండ్లపైనే ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. ఏటా సుమారు రూ.7.5 కోట్ల వరకు ఉంటుంది. జిల్లాలోని పరిశ్రమలకు ఎక్కువగా ఇక్కడి కాయలనే తరలిస్తుంటారు. ఏటా చిత్తూరు జిల్లాలో రూ. 19 కోట్ల మామిడి వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ 35 వేల హెక్టార్లలో తోతాపురి రకం సాగవుతుంది. బేనీషా 12 వేల హెక్టార్లు, నీలం 10 వేల హెక్టార్లు, ఇతర రకాలు 2,500 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. పండ్ల పరిశ్రమల్లో తోతాపురి రకాన్నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాయలు ఆలస్యంగా రావడం, దిగుబడి తగ్గడం వల్ల గుజ్జు పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.