కిలో రూ.70 చేరిన మినపప్పు
నిల్వలు నల్లబజారుకు తరలిన ఫలితమే
దాడులు చేయని అధికారులు

మినపప్పు ధర కూడా పెరిగింది. శనివారం హోల్‌సేల్ మార్కెట్లో కిలో మినపప్పు రూ.63గా ఉంది. రిటైల్ మార్కెట్లో ధర రూ.70కు చేరింది. పక్షం రోజుల క్రితం మినపప్పు ధర కిలోకు రూ.60 ఉండేది. కొద్ది నెలల కిందట కందిపప్పు కేజీ ధర రూ.100 చేరింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో వ్యాపారులు కందులను కొనుగోలు చేసి నల్లబజారుకు తరలించారు. దీంతో అప్పట్లో కందిపప్పు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం పెసరపప్పుదీ అదే పరిస్థితి.
రాష్ట్రంలో పెసర్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ మార్చి నెలాఖరు వరకు 1.59 లక్షల మెట్రిక్ టన్నుల పెసర్లు ఉత్పత్తి కావాల్సి ఉంది. అయితే దిగుబడి 72 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. పంట దెబ్బతినడం, విస్తీర్ణం తగ్గడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మినుములు 2.66 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి అవుతాయని అంచనా వేయగా 2.92 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గోదావరి, కృష్ణా జిల్లాల్లో అపరాల సాగు దెబ్బతింది. గోదావరి జిల్లాల్లో నకిలీ విత్తనాల వల్ల పంటకు నష్టం వాటిల్లింది. రాజస్థాన్, చెన్నై నుంచి రావాల్సిన పెసర నిల్వలు రాకపోవడంతో సమస్య తీవ్రమైంది.
బోగస్ కార్డుల ఏరివేతలో యంత్రాంగం: పౌరసరఫరాల శాఖ గత కొద్దినెలలుగా బోగస్ కార్డుల ఏరివేతలో నిమగ్నమైంది. దీంతో అక్రమ నిల్వలపై దృష్టిసారించలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు పరిస్థితిని ముందుగా అంచనా వేసి పెద్దఎత్తున మినుములు, పెసర్లను రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి నల్లబజారుకు తరలించారు. నిల్వలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయడం లేదు. పెసర్లను విడుదల చేయకపోవడంతో ధర భారీగా పెరిగింది. కొందరు వ్యాపారులు తమ దగ్గర ఉన్న నిల్వలను మిల్లింగ్ చేసి మార్కెట్లోకి విడుదల చేద్దామంటే విద్యుత్తు కోతవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొంతకాలం ఇంతే: కొద్ది నెలల వరకు పెసరపప్పు విషయంలో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ధర కేజీకి మరో పది రూపాయలు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు అంటున్నారు. మినపప్పు రేట్లు పెరిగే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రభుత్వం అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. కొన్ని జిల్లాల్లో అపరాలను రైతుల పేరుతో కొందరు వ్యాపారులు గోదాముల్లో నిల్వ చేశారని చెబుతున్నారు. దీనిపై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.