Monday, April 19, 2010

లాభాలు పెంచుకుంటాం

అందుకే విద్యుత్తు ఉత్పత్తి, కాంట్రాక్టు మైనింగ్‌లలోకి..
ఆధునిక పరిజ్ఞానంతో వ్యయాల తగ్గింపు
న్యూస్‌టుడే ఇంటర్వ్యూ
సింగరేణి కాలరీస్‌ సీఎండీ ఎస్‌.నర్సింగ్‌రావు
బొగ్గు ఉత్పత్తిలో రాష్ట్రానికే తలమానికమైన సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) లాభాలు పెంచుకోవడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. విద్యుదుత్పాదన, కాంట్రాక్టు మైనింగ్‌ తదితర విభాగాల్లోకి విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఎస్‌సీసీఎల్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.నర్సింగ్‌ రావు తెలిపారు. తాము రూపొందిస్తున్న ప్రణాళికలు అనుకున్న విధంగా కార్యరూపం దాల్చినట్లయతే 2014-15కల్లా రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వార్షిక లాభాన్ని ఆర్జించే స్థితిలో ఉంటామన్నారు. ఆయనతో 'న్యూస్‌టుడే' ప్రతినిధి జరిపిన ఇంటర్వ్యూలో ఇతర ముఖ్యాంశాలివీ

న్యూస్‌టుడే: గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్‌ సాధించిన బొగ్గు ఉత్పత్తి, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత
నర్సింగ్‌ రావు: 2009-10లో 13 శాతం వృద్ధి రేటుతో 50.4 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాం. వాస్తవానికి కేంద్రం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 46.5 మిలియన్‌ టన్నులు మాత్రమే. ఆ లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించాం. బొగ్గు ఉత్పత్తిలో జాతీయ వృద్ధి రేటు 8శాతం. సింగరేణి కాలరీస్‌ 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతేకాదు, గత ఆర్థిక సంవత్సరం '50 మిలియన్‌ టన్నుల క్లబ్‌'లో మేం చేరాం. దేశం మొత్తంమీద వార్షిక బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్‌ వాటా 9 శాతానికి పెరిగింది. 2010-11 ఆర్థిక సంవత్సరానికి 47.5 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్రం మాకు నిర్దేశించింది. మేం 51 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేయగలం.

? ఉత్పత్తి వ్యయం అధికంగా ఉన్నందువల్ల లాభాలు తక్కువగా ఉన్నాయి కదూ. దీనికి పరిష్కారమేమైనా ఆలోచిస్తున్నారా
ఇతర బొగ్గు గనులతో పోల్చితే సింగరేణి బొగ్గు గనులకు సహజసిద్ధమైన ఇబ్బందులు ఉన్నాయి. భూమి లోపల ఎంతో లోతుగా, ఎగుడుదిగుడుగా మా బొగ్గు నిల్వలు ఉన్నాయి. వీటిని తవ్వితీయడానికి నిట్టనిలువుగా లోనికి తవ్వుకుంటూ వెళ్లాలి. పైగా లభించేది మేలురకమైన బొగ్గు కూడా కాదు. ఉదాహరణకు ఓపెన్‌ కాస్ట్‌లలో బొగ్గు తీయడానికి సింగరేణి గనుల్లో ఒక టన్ను బొగ్గుకు 6.5 క్యూబిక్‌ మీటర్ల మట్టిని (ఓవర్‌ బర్డెన్‌) తీయాల్సి వస్తోంది. అదే మహానది కోల్‌ ఫీల్డ్స్‌లో 0.7 క్యూబిక్‌ మీటర్ల మట్టి తీస్తే సరిపోతుంది. కోల్‌ ఇండియా గనుల్లో చూసినా కూడా 1.7 క్యూబిక్‌ మీటర్ల ఓబీ తీస్తే చాలు, బొగ్గు లభిస్తుంది. మాది ప్రభుత్వ రంగంలోని కంపెనీ కాబట్టి పూర్తిగా లాభాలే పరమార్థం కాదు. అదే సమయంలో పలు రకాలైన వ్యయాలు మా అదుపులో ఉండవు. ఉదాహరణకు జీత భత్యాలు. మొత్తం మీద చెప్పదలచిందేమిటంటే.. ఎన్నో కష్టనష్టాల మధ్య బొగ్గు తవ్వకం చేయాల్సి వస్తుండటంతో వ్యయాలను అదుపు చేయలేకపోతున్నాం. కాకపోతే దీనికి పరిష్కారం లేకపోలేదు.. అది, సాధ్యమైనంతగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలన్నదే. పాత గనుల్లో ఇది ఎటూ పూర్తిగా సాధ్యం కాదు. కొత్త గనుల్లో యాంత్రీకరణ చేపట్టి, అధిక మొత్తంలో బొగ్గు తీసే ఏర్పాట్లు చేస్తున్నాం.

? అటువంటి కొత్త గనులు ఏం మొదలుపెట్టారు
గోదావరిఖనిలోని అడ్రియాలా గనిలో అధునాతన లాంగ్‌వాల్‌ టెక్నాలజీని అమలు చేస్తున్నాం. దీనికి జర్మనీకి చెందిన డీబీటీ అనే సంస్థ సాంకేతిక సహకారాన్ని, యంత్రసామగ్రిని అందజేస్తోంది. వచ్చే సెప్టెంబరు నుంచి ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఏటా 3 మిలియన్‌ టన్నుల బొగ్గు ఈ ఒక్క గని నుంచే లభిస్తుంది. దీని జీవితకాలం 20- 25 ఏళ్లు. దీనిపై రూ.864 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం.

? ఓపెన్‌ కాస్ట్‌ గనులపై కొన్ని వర్గాలకు అభ్యంతరాలు ఉన్నాయి... మీ విధానం ఏమిటి
సింగరేణిలో కొత్తగా ఓపెన్‌ కాస్ట్‌ గనులు తవ్వే అవకాశాలు దాదాపు లేవు. దీనికి కారణం భూమికి దగ్గరగా బొగ్గు నిల్వలు ఉన్న గనులు మాకు లేకపోవడమే. అందువల్ల ఇపుడు ఉన్న ఓపెన్‌ కాస్ట్‌ గనుల కొనసాగింపు- విస్తరణ, పాత భూగర్భ గనులను ఓసీలుగా మార్చడమే చేయాల్సింది.

? మూలధన వ్యయం గత ఏడాది ఎంత.. ఈ సంవత్సరం ఎంత కేటాయిస్తున్నారు?
గత ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్లు మూలధన వ్యయం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,334 కోట్లు వెచ్చించాలనేది ప్రణాళిక. కొత్త గనులకు, యాంత్రీకరణకు, ఉపకరణాలకు ఈ నిధులు వెచ్చిస్తాం. విద్యుదుత్పత్తి ప్రాజెక్టుపై పెట్టే రూ.540 కోట్ల వ్యయం కూడా ఇందులో ఉంది.

? విద్యుదుత్పత్తిలోకి ఎందుకు వెళ్తున్నారు..
ఎస్‌సీసీఎల్‌ బొగ్గు కంపెనీ కాబట్టి, విద్యుదుత్పత్తిలోకి రావడం అసహజమేం కాదు. పైగా లాభం పెంచుకోవడానికి చక్కటి అవకాశం. రామగుండం సమీపంలో 600 మెగా వాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. ఇది రూ.3,000 కోట్ల ప్రాజెక్టు. ఇందులో రూ.2,100 కోట్ల రుణం, మిగిలిన మొత్తాన్ని సొంత వనరుల నుంచి సమకూరుస్తున్నాం. మరో రెండు నెలల్లో బీహెచ్‌ఇఎల్‌కు టర్బైన్ల ఆర్డర్‌ ఇవ్వబోతున్నాం. 450 మె.వా. విద్యుత్తును విక్రయించడానికి ఏపీ ట్రాన్స్‌కోతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని నెల రోజుల్లో కుదుర్చుకునే అవకాశం ఉంది. 150 మె.వా. విద్యుత్తును సొంతంగా వాడుకుంటాం. 2013 ఏప్రిల్‌ నాటికి నిర్మాణం పూర్తి చేసి, అదే ఏడాది సెప్టెంబరు నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టు నుంచి రూ.400 కోట్ల వార్షిక లాభం ఉండవచ్చని ఆశిస్తున్నాం.

? కాంట్రాక్ట్‌ మైనింగ్‌ సేవల్లోకి విస్తరించే ఆలోచన ఉందని తెలిసింది..
ఇదీ లాభాలు పెంచుకొనే యత్నమే. బొగ్గు ఉత్పత్తిలో సంవత్సరానికి రూ.150 కోట్లకు మించి లాభాలు సాధ్యం కావడం లేదు. ఏటా బొగ్గు ఉత్పత్తిని ప్రస్తుత స్థాయిల నుంచి పెంచుకోవడం సులువైన పనిగా కనిపించడం లేదు. మైనింగ్‌లో విశేషమైన అనుభవం మాకు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కాంట్రాక్టు మైనింగ్‌ చేసే యత్నాల్లో ఉన్నాం. మాకు ఇదో పెద్ద ఆదాయ మార్గంగా భావిస్తున్నాం.

? ఒక వైపు కాంట్రాక్టు మైనింగ్‌ చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు మీ వద్ద ఉన్న గనులను ప్రైవేటు మైనర్లకు ఇవ్వాలని యోచిస్తున్నారేం.
ఈ రెండింటికీ సంబంధం లేదు. మా వద్ద కొన్ని లోతైన బొగ్గు గనులున్నాయి. వీటి నుంచి బొగ్గు తీయాలంటే ఎక్కువ పెట్టుబడి అవసరం. ఉత్పత్తి వ్యయమూ ఎంతో అధికం. ఏవైనా ప్రైవేటు సంస్థలు తక్కువ ఖర్చులో బొగ్గు తీయడానికి ముందుకు వచ్చినట్లయితే ఆ గనుల నుంచి బొగ్గు తీసి మాకే ఇచ్చే ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న ఆలోచన ఉంది. ఇక్కడ ప్రైవేటు సంస్థల సేవలు తీసుకోవడమే తప్ప, గనులను ఇవ్వడం ఉండదు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంది.