2000, 2005 పారిశ్రామిక విధానాల్లో స్థిరాస్తి ప్రస్తావన లేదు. మొదట్లో ఐటీ పార్కులు, ఆ తర్వాత పరిశ్రమల పేరిట అనుమతులు పొందిన సంస్థలు స్థిరాస్తి వ్యాపారంపై దృష్టి సారించాయి. ప్రత్యేక ఆర్థికమండళ్లలో నాన్ ప్రాసెసింగ్ జోన్ల పేరిట 40 శాతం స్థలాలను సిబ్బంది నివాస, వినోద గృహ సముదాయాల నిర్మాణానికి నిర్దేశించారు. ఈ వెసులుబాటును సాకుగా చేసుకుని స్థిరాస్థి వ్యాపారాలు జరుగుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోంది. స్థిరాస్తి వ్యాపారంలో స్తబ్దత ఏర్పడడంతో పారిశ్రామిక సంస్థలు పరిశ్రమల నిర్మాణాలను నిలిపివేశాయి. దీన్ని పరిగణనలోనికి తీసుకున్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ).. కొత్త పారిశ్రామిక విధానంలో స్థిరాస్తి వ్యాపారానికి చోటు కల్పించరాదని ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన పరిశ్రమల శాఖ బృందాలు సైతం అక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారాలు జరగడం లేదని, ఇక్కడ అదే తరహా విధానం అవలంబించాలని నివేదించాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న పరిశ్రమల శాఖ.. పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. పరిశ్రమలు, ఐటీ పార్కులు ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ఈ నిబంధన అమలయ్యే వీలుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే అయినా రాష్ట్రస్థాయిలో స్థిరాస్తి వ్యాపారానికి అనుమతించరాదని పరిశ్రమల శాఖ ప్రభుత్వాన్ని కోరనుంది.