Thursday, April 15, 2010

తనఖాలేని రుణం రూ.లక్షకు పెంపు


కలవరపడుతున్న ప్రభుత్వం
మార్పులే మార్గం
పంటరుణానికి అదనంగా 20 శాతం
తనఖాలేని రుణం రూ.లక్షకు పెంపు
కేంద్రానికి వినతి
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వ్యవసాయ పెట్టుబడులు రైతును మళ్లీ సంక్షోభంవైపు నెడుతున్నాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గి... పరిస్థితి కుదుటపడుతోందని భావిస్తున్న తరుణంలో... మరో వ్యవసాయ సంక్షోభం ఉరుముతోంది. బ్యాంకుల ద్వారా వ్యవస్థీకృత రుణాలను రైతులకు మరింతగా అందుబాటులోకి తేగలిగితేనే ఈ కొత్త సమస్య నుంచి గట్టెక్కవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా- కేంద్రానికీ, ప్రణాళికా సంఘానికీ నివేదించింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. 2009-10 సంవత్సరంలో 911 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానమంత్రి ప్యాకేజీ ద్వారా వివిధ కార్యక్రమాలను చేపట్టినందున రాష్ట్రంలో రైతుల పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే రుణాలు అందని కారణంగా... రైతాంగం మళ్లీ సంక్షోభం దిశగా ప్రయాణిస్తోంది. వ్యవసాయ రుణాలు సక్రమంగా అందకపోవడమే సంక్షోభానికి ప్రధాన కారణమని ప్రభుత్వం కూడా భావిస్తోంది. గత ఖరీఫ్‌లో కరవు, వరదల కారణంగా పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకున్న రైతులు కూడా ప్రస్తుతం ఆందోళనగా ఉన్నారు. ప్రస్తుతం వీళ్లకు పావలా వడ్డీ వర్తించట్లేదు.వీరు తమ రుణాలపై దాదాపు మూడేళ్ల పాటు 10 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి రావడం కూడా భారం కానుంది. బ్యాంకులో రుణాలు తీసుకుంటున్న వారు కూడా పంటకు అవసరమైన మేర రుణాలను పొందలేకపోతున్నారు. రుణాలు దక్కనివారితోపాటు వీరు కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. కౌలుదారుల సమస్య అగమ్యగోచరంగా ఉంది.

రుణ పంపిణీలో ఈ మార్పులు అవసరం
రుణ భారం నుంచి రైతులను సంక్షోభం నుంచి తప్పించేందుకు వ్యవసాయ రుణ పంపిణీ విధానాల్లో వెంటనే కొన్ని మార్పులు అవసరమంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.ఇంతకుముందు కోరిన ఒకటి రెండు అంశాల్లో కేంద్రం స్పందించకపోవడంతో ఇపుడు మరికొన్నింటితోపాటు వాటినీ చేర్చి కేంద్రానికి పంపింది. రాష్ట్రం కోరిన ముఖ్యమైన మార్పులు ఇలా ఉన్నాయి...

* పంటల వారీ నిర్దేశించే రుణ మొత్తానికి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్సుకు) అదనంగా 20 శాతం మొత్తాన్నీ చేర్చాలి. రైతు తన ఇంటి ఖర్చులకు, పంట దిగుబడులు చేతికొచ్చిన తర్వాత ఖర్చులకు ఆ అదనపు మొత్తం ఉపయోగపడుతుంది.

* ఏ పంటకు ఎంత మొత్తాన్ని ఇవ్వాలనేది పేర్కొంటూ ఏటా జిల్లాల వారీ నిర్ధారించే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్సు విధానం తప్పనిసరిగా అమలు కావాలి. దీనికి అదనంగా 20 శాతం రుణం ఇవ్వాలనే నిబంధన విధించాలి.

*రైతుకు ఆస్తి తనఖా లేకుండా ఇచ్చే గరిష్ఠ రుణ పరిమితిని రూ. ఒక లక్షకు పెంచాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50 వేలు మాత్రమే ఉంది.

*కరవు కారణంగా దీర్ఘకాలిక రుణాలుగా మార్చిన పంట రుణాలకూ కేంద్రం 4 శాతం వడ్డీ రాయితీని ఇవ్వాలి. మొత్తం పది శాతం వడ్డీ రేటులో ఇలా కేంద్రం రాయితీ పోగా మిగతా 6 శాతంలోను రైతు, రాష్ట్ర ప్రభుత్వం చెరి సంగం భరించేందుకు వీలవుతుంది.

*కష్టకాలంలో ఉన్న రైతుకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ)గాఇచ్చే మొత్తాన్ని హెక్టార్‌కు వర్షాధార పంటలకు 5 వేలు, సాగునీరు అందే పంటలకు రూ.8 వేలకు పెంచాల్సి ఉంది. ప్రస్తుతం వీటిని కేంద్రం వరసగా రూ.2వేలు, రూ.4వేలు చొప్పున మాత్రమే సమకూరుస్తోంది.

డిపాజిట్లకు మించి రుణాలు..: బ్యాంకర్లు
రాష్ట్రంలో రైతులందరికీ సరిపడే విధంగా రుణాలను ఇవ్వటం అంత సులువైన పనేం కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం డిపాజిట్లకంటే రుణాలే ఎక్కువ ఇస్తున్నామని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు. డిపాజిట్లు 100 రూపాయలు ఉంటే... రుణాలు అంతకంటే ఎక్కువగా అంటే రూ.108గా ఉందని వారు చెబుతున్నారు. ఇలా 108 శాతం ఇచ్చిన రుణాల్లో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలూ ఉన్నాయి. అన్ని రంగాల వారికీ కలిపి ఇంతవరకూ ఇచ్చిన రుణాల్లో (అవుట్‌స్టాండింగ్‌) వ్యవసాయ రుణాల వాటా 24.61 శాతంగా ఉంది. 2008లో వ్యవసాయ రుణాల వాటా 27 శాతం ఉండేది. ఇది క్రమేపీ తగ్గుతున్నట్టు స్పష్టమవుతోంది. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ఈ వాటా 18 శాతం ఉంటే చాలని, అలా చూస్తే... రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు పరిమితికి మించే ఇస్తున్నట్లు అర్థమవుతోందని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితికి చెందిన ఒక అధికారి 'న్యూస్‌టుడే'తో వ్యాఖ్యానించారు.