చిత్రహింసల నిరోధక బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం
* ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కమిషన్ గడువును జులై 31 వరకు (నాలుగు నెలలపాటు) పొడిగించారు. ఈబీసీ కోటా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి 2004లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* అమానుష, క్రూరమైన హింసను నిరోధించేందుకు వీలుగా రూపొందించిన 'చిత్రహింసల నిరోధక బిల్లు-2010'కు ఆమోదం తెలిపారు. దీన్ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడతారు. అమానుష హింసకు వ్యతిరేకంగా 1975లో ఐక్యరాజ్య సమితి చేసిన ఓ తీర్మానానికి అనుగుణంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానంపై భారత్ 1997లో సంతకం చేసింది.
* ఆకాశవాణి, దూరదర్శన్‌లకు చెందిన ట్రాన్స్‌మిటర్లు, స్టూడియోలు, అనుసంధాన వ్యవస్థలను డిజిటలైజ్ చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు, ప్రైవేటు రంగంనుంచి పోటీని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.1540 కోట్లు వెచ్చిస్తారు.
* యూఎన్‌డీపీ ఆధ్వర్యంలోని విపత్తు నిర్వహణ కార్యక్రమానికి నిధుల కేటాయింపును 3.4 కోట్ల డాలర్ల నుంచి 4.1కోట్ల డాలర్లకు పెంచారు. అదనపు నిధులతో తమిళనాడులోని మరో ఏడు జిల్లాల్లో సునామీ సహాయ కార్యక్రమాలు చేపడతారు.
* చెన్నైలోని భారత మారిటైమ్ యూనివర్సిటీకి రూ.282.25కోట్ల మేర ఆర్థికసాయం అందించే ప్రతిపాదనను ఆమోదించారు.