Friday, April 9, 2010

భారతీయుల్ని వదలని 'పొగ'బంధం!

దూరంగా జరుగుతోంది రెండు శాతం మందే
సిగిరెట్లు, బీడీలపై పన్ను పెంచితే ఆరోగ్యం, ఆదాయం
ఎన్‌ఐపీఎఫ్‌పీ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: జీవితంలో ఆలస్యంగా పొగతాగడం మొదలుపెట్టినా.. ఈ అలవాటును భారతీయులు వదిలించుకోవడం చాలా అరుదని అధ్యయనంలో తేలింది. కేవలం రెండు శాతం మంది మాత్రమే ఈ అలవాటును వదిలించుకుంటున్నట్లు తేలింది. అదే అమెరికా, ఐరోపాల్లో ఇది 40 శాతంగా ఉన్నట్లు పరిశోధకులు వివరించారు. కేరళలో అత్యధికంగా ఏడు శాతం మంది ధూమపానాన్ని వదిలేస్తుండగా.. ఢిల్లీలో అతి స్వల్పంగా ఒక శాతం కంటే తక్కువ మంది ఈ అలవాటుకు దూరంగా ఉంటున్నారు. 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ రీసెర్చ్‌' (ఎన్‌ఐపీఎఫ్‌పీ) ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలివీ..
* పొగతాగడం 10 శాతం మేర పెరిగే కొద్దీ ఆయువు ఏడాది చొప్పున తగ్గుతున్నట్లు తేలింది.
* పట్టణ ప్రాంతాల్లోని 20- 24 ఏళ్ల వయసు పురుషుల్లో ధూమపానం 13 శాతం ఉండగా.. 2006 నాటికి అది 25 శాతానికి పెరిగింది.
* 30 ఏళ్ల వయస్సు వారిని పరిశీలిస్తే.. బీడీ తాగే పురుషులు ఆరేళ్ల జీవితాన్ని కోల్పోయారు. అదే మహిళలైతే.. తమ జీవితంలో 8 ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోయారు. సిగరెట్‌ తాగే పురుషుల్లో ఆయుష్షు 10 ఏళ్ల మేర తగ్గిపోయింది.
* సిగరెట్లపై పన్నుల ఎక్కువైతే పొగతాగడం తగ్గుతుంది. వీటి ధర 10 శాతం మేర పెరిగితే ధూమపానం తాగేవారిలో 2-4 శాతం మంది ఈ అలవాటును వదిలించుకుంటారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో సిగరెట్లపై ఎక్సైజ్‌ పన్నును 17 శాతం మేర పెంచారు. దీనివల్ల రెండు లక్షల మంది పొగతాగడాన్ని మానేస్తారని అంచనా.
* ఓ ప్యాకేజీ రీటెయిల్‌ ధరపై ప్రస్తుతం పన్ను నలభైశాతం కంటే తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ 65 నుంచీ 80 శాతంగా ఉండాలని కచ్చితంగా సిఫారసు చేసింది.
* సిగరెట్ల రీటెయిల్‌ ధరపై పన్నులను 78 శాతం దాకా పెంచితే భారత్‌లో 34 లక్షల అకాల మరణాలను నిరోధించవచ్చు. రూ.14,630కోట్ల ఆదాయాన్ని పన్నురూపేణా ఏటా సర్కారీ ఖజానాకు జమ చేయవచ్చు.
* బీడీలపై ఇప్పుడు రీటెయిల్‌ ధరపై తొమ్మిది శాతంగా ఉన్న పన్నును కనుక నలభైశాతం మేరకు పెంచగలిగితే ఏటా 1.5 కోట్ల మంది ప్రాణాలను అకాల మృత్యుబారిన పడకుండా కాపాడవచ్చు. ప్రభుత్వానికి రూ.3,690కోట్ల ఆదాయం వస్తుంది.