కంపెనీ చట్టం కింద ఏర్పడిన స్వయం ప్రతిపత్తి గల సంస్థలమని, ప్రభుత్వ ఆజమాయిషీలో లేమని, ఈ కారణంగా తాము సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, జైపూర్ స్టాక్ ఎక్స్చేంజ్‌లు చేసిన వాదనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. స్టాక్ ఎక్స్చేంజ్‌లు ప్రజా సంబంధమైనవని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు దీన్ని సవాలు చేస్తూ స్టాక్ ఎక్స్చేంజ్‌లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేసింది.
స్టాక్ ఎక్స్చేంజ్‌లు క్వాజీ ప్రభుత్వ సంస్థలని, ఆర్‌టిఐ చట్టం కింద ఎవరైనా సమాచారాన్ని అడిగితే అవి అందించాల్సి ఉంటుందని సిఐసి 2007లో ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సంబంధించిన వ్యవస్థలను రూపొందించుకోవాలని ఎన్ఎస్ఇని అదేశించింది. దీంతో ఎన్ఎస్ఇ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఆర్‌టిఐకే సెబి ఓటు
కాగా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి స్టాక్ మార్కెట్లు సమాచార హక్కు చట్టంకు లోబడి ఉండాల్సిందేని పేర్కొనడం విశేషం. ఈ విషయంలో సిఐసి జారీ చేసిన అదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన ఎన్ఎస్ఇ- స్టాక్ ఎక్స్చేంజ్‌లు ప్రభుత్వ సంస్థలు కావని, ఈ కారణంగా అవి ఆర్‌టిఐ పరిధిలోకి రావని కోర్టులో కేసు వేసింది.
ఆర్‌టిఐ కింద సమాచారాన్ని ప్రభుత్వం, దాని ఏజెన్సీల నుంచి పొందవచ్చు కానీ కంపెనీల నుంచి కుదరదని, ఎన్ఎస్ఇ ఒక కంపెనీ అన్నది నేషనల్ స్టాక్ఎక్స్చేంజ్ వాదన. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రభుత్వం నియమించదని కూడా తెలిపింది.
ఆర్‌టిఐ చట్టం కింద కొందరు ఇన్వెస్టర్లు కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించటంతో సమాచారాన్ని అందించేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందించుకోవాల్సిందిగా సిఐసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, జైపూర్ స్టాక్ ఎక్స్చేంజ్‌లను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్ఎస్ఇ పిటిషన్ వేయగా ఢిల్లీ హైకోర్టు దానిని కొట్టి వేసింది.
Friday, April 16, 2010
సమాచార హక్కు పరిధిలోకి స్టాక్ ఎక్స్చేంజ్ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఎన్ఎస్ఇ వాదన తిరస్కృతి
న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం కింద స్టాక్ ఎక్స్చేంజ్‌ల నుంచి కూడా సమాచారం తీసుకోవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్‌లు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని ఢిల్లీ హైకోర్టు గురువారంనాడు తీర్పునిచ్చింది.