Thursday, April 1, 2010

కోళ్ల వ్యాధుల నివారణపై రైతులకు సూచనలు

వెంకటేశ్వర హేచరీస్‌ అనుబంధ సంస్థల సదస్సు..
హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: దేశంలో 17 కోట్ల కోళ్లు ఉండగా, 7 కోట్ల కోళ్లతో వెంకటేశ్వర హేచరీస్‌ ప్రథమ స్థానంలో ఉందని సంస్థ జనరల్‌ మేనేజరు కె.జి.ఆనంద్‌ అన్నారు. హైదరాబాద్‌ ప్రాంతంలో కోళ్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వెంకటేశ్వర హేచరీస్‌ అనుబంధ సంస్థలు వెంట్రి బయలాజికల్స్‌, వెంకీస్‌ ఇండియాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక చింతల్‌కుంటలోని హిమగిరి గార్డెన్స్‌లో కోళ్ల రైతులకు సాంకేతిక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కె.జి.ఆనంద్‌ మాట్లాడుతూ వ్యవసాయంలో కోళ్ల పరిశ్రమ వాటా 20 శాతం ఉందని తెలిపారు. వెంకటేశ్వర హేచరీస్‌ సంస్థ కోళ్ల పెంపకానికి కావాల్సిన టీకాలను, మందులను, ఆహారాన్ని అందిస్తూ ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. వేసవిలో గుడ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల మరణాలు పెరగడం, కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి నశించడం జరుగుతుందన్నారు. వీటిని నివారించేందుకు వెంకటేశ్వర హేచరీస్‌ వైద్య బృందం సలహాలను, సూచనలను అందించింది. రాణికీత్‌ వ్యాధి, మేరక్స్‌, చికెన్‌ ఎనీమియా తదితర వ్యాధులకు తగిన టీకాలను సకాలంలో వేయించుకోవాలని సూచించారు. వెంకటేశ్వర హేచరీస్‌ వైద్యులు హెచ్‌.ఆర్‌.కృష్ణారెడ్డి మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించి అధిక ఉత్పత్తులను సాధించాలన్నారు. ఫాగింగ్‌ మిషన్లతో కోళ్ల షెడ్డులను శుద్ధి చేయాలని సూచించారు. కోళ్ల బరువును తగిన సమయంలో ఎలా సాధించాలో వివరించారు. టీకాలను తయారు చేయడంతో సంస్థ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో వైద్యులు కళ్యాణి, కులకర్ణి, రవీందర్‌ రెడ్డి, కోళ్ల రైతులు పాల్గొన్నారు.