Thursday, April 1, 2010

విస్తరణ బాటలో వేగంగా అడుగులు

63 లక్షల టన్నులు.. విశాఖ ఉక్కు లక్ష్యం
తూర్పు కోస్తా తీరంలో ఏర్పాటై రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక పురోభివృద్ధికి తమ వంతుగా తోడ్పడుతున్న రెండు కంపెనీలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున సామర్థ్య విస్తరణ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఈ భారీ పథకాలను 2011కల్లా పూర్తి చేసుకొని ఆశించిన ఫలాలను అందుకోవాలనే లక్ష్యంతో ఇవి తమ పయనాన్ని కొనసాగిస్తున్నాయి. వాటిలో ఒకటి విశాఖ ఉక్కు కర్మాగారం కాగా, రెండోది కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌..
విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌- ఆర్‌ఐఎన్‌ఎల్‌) రానున్న ఆర్థిక సంవత్సరం (2010-11)లో రెండు కీలకమైన మైలురాళ్లను చేరుకోనుంది. వాటిలో రూ.12,000 కోట్ల వ్యయంతో చేపట్టిన విస్తరణ పథకం ముఖ్యమైంది. 'నవరత్న' పీఎస్‌యూ హోదా రెండో మైలురాయి. ఈ హోదా మరో 2 నెలల్లో లభించనుంది. ఈ ప్రాజెక్టుల కంపెనీని మరింత శక్తిమంతంగా మార్చనున్నాయి. కంపెనీలో విస్తరణ పనులు చకచక సాగుతున్నాయి. కర్మాగారం సామర్థ్యాన్ని 30 లక్షల టన్నుల నుంచి 63 లక్షల టన్నులకు చేర్చడం విస్తరణ పథకం లక్ష్యం. 2006 మేలో రూ.8,600 కోట్లతో తలపెట్టిన పనులకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఆనక అంచనా వ్యయం రూ.12,000 కోట్లకు చేరింది. విస్తరణలో భాగంగా 3,800 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం కలిగిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నిర్మిస్తున్నారు. అత్యాధునిక స్టీల్‌ మెల్ట్‌ షాప్‌లు, రోలింగ్‌ మిల్స్‌ నిర్మాణం జరుగుతోంది. 80 శాతం పరికరాలు విస్తరణ సైట్‌కి చేరాయి. స్ట్రక్చరల్‌ ఫ్యాబ్రికేషన్‌ పనులు 90 శాతానికి పైగా, స్ట్రక్చరల్‌ ఎరక్షన్‌ పనులు 75 శాతం పూర్తి అయ్యాయి. 2010-11 అక్టోబరు- నవంబరు నాటికే విస్తరణ ముగియాలి. వచ్చే మార్చికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నారు.

కలిసొచ్చే కాలానికి 'నవరత్న' హోదా: అనేక బాలారిష్టాలు కంపెనీని వెన్నాడాయి. 1971లో శంకుస్థాపన జరిగితే 1992 ఆగస్టుకు గానీ పూర్తి కాలేదు. ఆరంభమే నష్టాలతో మొదలైంది. సొంత గనులు లేకపోవడం వంటి సమస్యలు వేధించగా నష్టాలు పేరుకుపోయి ఖాయిలా దశకు చేరుకుని 2000లో బీఐఎఫ్‌ఆర్‌ పరిశీలనకు వెళ్లింది. కేంద్రం చేయూతతో కోలుకుని 2003లో అప్పులన్నీ తీర్చేసింది. అప్పటి నుంచీ లాభాలు ఆర్జిస్తోంది. 2006 మే లో 'మినీరత్న' హోదా వచ్చింది. ఆర్థిక మందగమనంలోనూ కంపెనీ రూ.10,400 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. 'నవరత్న' హోదాతో రూ.1,000 కోట్ల పెట్టుబడులపై బోర్డు నిర్ణయం తీసుకోగలగడం ఈ హోదాతో సాధ్యపడుతుంది.

డీప్‌వాటర్‌ పోర్టులో కొత్త బెర్తులు
కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టులో సుమారు రూ.330 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో.. రూ.105 కోట్లతో 600 మీటర్ల పొడవైన బెర్త్‌ నిర్మాణానికి రూ.105 కోట్లు అవుతున్నాయి. ఐదో, ఆరో, ఏడో బెర్తుల కోసం సుమారు రూ.125 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అలాగే, నౌకలు ఆగే చోట లోతు (డ్రాఫ్ట్‌)ను మరింత పెంచడం కోసం మరో రూ.100 కోట్లు ఖర్చుపెట్టనున్నారు.

2010-11లో 1.30 లక్షల టన్నుల సరకు రవాణాపై కన్ను: ఏప్రిల్‌ 1 నాటికి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ప్రైవేటీకరణ జరిగి 11 ఏళ్లు ముగియనున్నాయి. పోర్టు ఈ ఏడాది 30 శాతం సరకు రవాణాను సాధించగలగడం విశేషం. గత ఏడాది 78 లక్షల టన్నుల సరకు రవాణా చేయగా, ఈ సంవత్సరం 1.05 కోట్ల టన్నుల సరకును రవాణా చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.30 లక్షల టన్నులు రవాణా చేయాలని ఆశిస్తున్నట్లు కేఎస్‌పీఎల్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) వై.ఎస్‌.ప్రసాద్‌ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

కేంద్రం అనుమతితో: రెండు మూడేళ్లుగా విస్తరణకు వెళ్లని నౌకాశ్రయాలు ఈ ఏడాది విస్తరణకు వెళ్లవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేఎస్‌పీఎల్‌ ఈ ఏడాది 5, 6, 7 బెర్తులకు విస్తరించేందుకు నడుం కట్టింది. తాజాగా ఆదివారం జరిగిన పోర్టు విస్తరణ- పర్యావరణ అంశాలపై స్థానికంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సానుకూలంగా ముగిసింది. మే లోగా మిగతా అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం డీప్‌వాటర్‌ పోర్టులోకి 40,000 టన్నుల సామర్థ్యమున్న నౌకలు వస్తున్నాయి. అంతకన్నా భారీ నౌకలూ వచ్చేలా రానున్న మూడు నెలల్లో నౌకాశ్రయం డ్రాఫ్ట్‌ను 11.5మీ. నుంచి 13.5మీ. లోతుకు పెంచాలని నిర్ణయించారు.

నౌకానిర్మాణ కేంద్రం కూడా
కాకినాడలో 'శంబ్‌మెరైన్‌ కాకినాడ లిమిటెడ్‌' (ఎస్‌కేఎల్‌) నౌకానిర్మాణ కేంద్రం (షిప్‌యార్డు) కూడా రానుంది. కేఎస్‌పీఎల్‌తో సింగపూర్‌- శాంబోవాంగ్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ జట్టు కట్టి సంయుక్తంగాదీనిని ఏర్పాటు చేస్తోంది. రూ.1,800 కోట్ల అంచనాతో షిప్‌యార్డ్‌ పనులు గత డిసెంబరులో చేపట్టారు. మరో నాలుగేళ్లలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ షిప్‌యార్డ్‌ పూర్తి అయితే కావేరి, కృష్ణా-గోదావరి బేసిన్‌ లకు చెందిన నౌకలు చిన్నపాటి మరమ్మతుల కోసం దాదాపు 15 రోజులు ప్రయాణించి సింగపూర్‌కు వెళ్లవలసిన అవసరం ఉండదు.