ఐక్యరాజ్య సమితి: ప్రకృతి అవసరాలు తీర్చుకోకుండా మనిషి ఉండలేడు. కాలకృత్యాలు ప్రతి మనిషికీ నిత్యకృత్యం. కానీ అవి తీర్చుకునేందుకు సరైన మరుగుదొడ్లు (టాయ్‌లెట్లు) లేనివారు భారతదేశంలో కోట్లాదిమంది ఉన్నారు. సరైన సౌకర్యాలు లేక ఎందరో బహిరంగ ప్రదేశాల్లోనే బహిర్భూమికి వెడుతున్నారు. తగిన సంఖ్యలో ప్రజలకు టాయ్‌లెట్లు లేవన్నది అందరికీ తెలిసిందే. కానీ విచిత్రమేమిటంటే భారతదేశంలో టాయ్‌లెట్ల సంఖ్య కన్నా సెల్‌ఫోన్‌లు ఎక్కువగా ఉన్నాయట. భారతదేశంలో చాలామందికి టాయ్‌లెట్ వసతి లేకున్నా మొబైల్ ఫోన్ కొనగల అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా అధ్యయనం లో వెల్లడైంది. పారిశుద్ధ్య వసతులులేని వారి సంఖ్యను ఎలా తగ్గించాలి అన్న అంశంపై ఐక్యరాజ్య సమితి ఈ అధ్యయనం జరిపి నివేదిక వెలువరించింది.‘జనాభాపరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారతదేశంలో దాదాపు సగం మందికి సొంతంగా ఫోన్‌లు కొనుక్కోగల స్తోమత ఉంది. కానీ సగం మంది ప్రజలు ప్రాథమిక అవసరానికి అంటే కాలకృత్యం తీర్చుకొనే మరుగుదొడ్డి (టాయ్‌లెట్) వసతికి నోచుకోలేకపోవడం విచారకరం’ అని జాఫర్ ఆదిల్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయానికి చెందిన నీరు, పర్యావరణం, ఆరోగ్య సంస్థలో (ఐడబ్ల్యూఈహెచ్) ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. భారతదేశంలో 54.5 కోట్ల సెల్‌ఫోన్లున్నాయి. అంటే జనాభాలో దాదాపు సగం మందికి సెల్‌ఫోన్‌లు ఉన్నాయనవచ్చు. 2008 లెక్కల ప్రకారం 36.6 కోట్ల మందికి మాత్రమే, అంటే 31 శాతం మందికి మాత్రమే మెరుగైన పారిశుద్ధ్య (టాయ్‌లెట్లు) సౌకర్యాలున్నాయి.ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయంం (యుఎన్‌యు) సిఫార్సులు బుధవారం విడుదలయ్యాయి.
మిలీనియం అభివృద్ధి లక్ష్యాన్ని(ఎండిజి) త్వరగా సాధించడం ఈ సిఫార్సుల ఉద్దేశం. రక్షిత మంచినీరు, మౌలిక పారిశుద్ధ్య వసతి లేకపోవడం ఇందుకు అవరోధంగా మారుతున్నాయి. ప్రపంచం పరిస్థితి ఇలాగే ఉంటే 2015 నాటికి మరుగువసతికి నోచుకోని వారి సంఖ్య వందకోట్లవుతుంది.‘టాయ్‌లెట్ల అంశంపై మాట్లాడేందుకు చాలామంది వెనకడుగు వేస్తారు. అది పనికిరాని విషయమని, దానిపై చెప్పడం హుందాగా ఉండదని భావిస్తారు. కానీ, కలుషిత జలం, టాయ్‌లెట్ వసతుల్లేని అనారోగ్యకర పరిసరాల వల్ల ఏటా 15 లక్షల మంది చిన్నపిల్లలు మరణిస్తున్నారు. ఈ భయంకర నిజాన్ని తెలుసుకున్న తర్వాతైనా దీనిపై మాట్లాడేందుకు ముందుకు రావాలి’ అని ఆదిల్ కోరారు. ఒక టాయ్‌లెట్ నిర్మించేందుకు అన్ని ఖర్చులూ కలిపి సుమారుగా 300 డాలర్లు (రూ 15 వేలు) అవుతుందని యుఎన్‌యూ అంచనా వేసింది. ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించింది.