నష్టాలొచ్చినా వెరవని కంపెనీలు
భవిష్యత్‌పై విశ్వాసమే కారణం
2009-10లో కంపెనీలు భారీ స్థాయిలో డివిడెండ్లను ముట్టజెప్పాయి. వృద్ధికి ఢోకా ఉండదన్న విశ్వాసమే వారిని ముందుకు నడిపించింది. కంపెనీలకు నష్టాలొచ్చినా.. లాభాలు క్షీణించినా రూ.18,000 కోట్లవిలువైన మధ్యంతర డివిడెండ్లను చెల్లించాయ్. గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్లు ప్రకటించిన 207 కంపెనీల్లో 100 శాతం పైగా చెల్లించినవి 36 కంపెనీలుండగా.. 50-100 శాతం లోపు 30; 25-50 శాతం లోపు 33; 25 శాతం లోపు 108 కంపెనీలున్నాయి. వృద్ధి కొనసాగుతుందని.. భవిష్యత్ బాగుంటుందన్న అంచనాలతో కంపెనీలు ఈచెల్లింపులు చేయడానికి వెనకాడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్లో ర్యాలీ కొనసాగుతుండడంతో షేర్ల విలువ పెరిగిపోయింది. ఆ విలువ నిజమేనని తెలియజెప్పడానికి కంపెనీలు అధిక మధ్యంతర డివిడెండ్లు ప్రకటించాయి. కొత్తగా ఇష్యూలకొచ్చిన కంపెనీల్లో ఎక్కువగా ఈ ధోరణి కనిపించిందని వారు అంటున్నారు. 2008-09లో 160 కంపెనీలు మాత్రమే డివిడెండ్లను ప్రకటించాయి. వాటి మొత్తం కూడా రూ.16,449 కోట్లకే పరిమితమైంది. ఇందులో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి.

ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, సొనాటా సాఫ్ట్‌వేర్‌లు 50-200 శాతం మేర మధ్యంతర డివిడెండ్లు ఇచ్చాయి. వీటితో పాటు ఇతర ఐటీ కంపెనీలు కలిసి మొత్తం రూ.2,164 కోట్లు ధారపోశాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే తక్కువే అయినా ఇతర రంగాలతో పోలిస్తే పరిమాణం ఎక్కువే. ఇక విద్యుత్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని కంపెనీలు సైతం ఇదే స్థాయి ధోరణిని కనబరచాయి(పట్టిక చూడండి). ఇక పీఎస్‌యూ కంపెనీ అయిన ఇంజినీర్స్ ఇండియా అన్ని కంపెనీల కంటే ఎక్కువగా 1000 శాతం మేర ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరాల్లో ఇది వరుసగా 185%, 110 శాతం మేర మాత్రమే ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో కంపెనీలో ఏకైక అతిపెద్ద వాటాదారైన(90.4%) ప్రభుత్వానికి లబ్ది చేకూర్చడానికే ఈ భారీ స్థాయి ప్రకటన చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

డివిడెండ్లు అధికంగా ఇస్తున్నాయంటే లాభదాయకత ఎక్కువగా ఉందన్న మాట కొంచెం వాస్తవమే అయినప్పటికీ పెట్టుబడుల విషయంలో దాన్నే ప్రామాణికంగా ఎంచుకోవద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. మదుపర్లను సంతోషపరచి తమ షేర్లకే అట్టిపెట్టిఉంచుకొనేలా చేసుకోవడానికి కంపెనీలు ఈ డివిడెండు పాచికను ఉపయోగిస్తుంటాయని వారు హెచ్చరిస్తున్నారు. స్క్రిప్ ఎంపికకు దీర్ఘకాలంలో డివిడెండు అనేది ప్రాతిపదిక కాదని వారు చెబుతున్నాయి.
ఉదాహరణకు థింక్‌సాఫ్ట్, డీబీ కార్ప్, తంగమాయిల్ జువెలరీ, ఆయిల్ ఇండియాలు ఇష్యూకు ముందు/తర్వాత డివిడెండ్లు ప్రకటించి మదుపర్లకు ఆకర్షించడానికి ప్రయత్నించినవే. ఇందులో ఆయిల్ ఇండియా షేరు ఇష్యూ ధర కంటే 10 శాతం పైగా ట్రేడ్ అవుతుండగా.. థింక్‌సాఫ్ట్ తన 52 వారాల గరిష్ఠమైన రూ.544కు 65 శాతం తక్కువ వద్ద; ఇష్యూ ధర కంటే 53.6 శాతం ఎక్కువ వద్ద చలిస్తోంది. డీబీ కార్ప్, తంగమాయిల్ షేర్లు మాత్రం ఇష్యూ ధర కంటే దిగువగా కదలాడుతున్నాయి.