Thursday, April 1, 2010

సగం సబ్సిడీలకు కత్తెర

కేంద్రం ప్రభుత్వంపై ప్రణాళిక సంఘం ఒత్తిడి
ఆహారం, ఎరువులు, పెట్రో ధరలు పెరిగే ప్రమాదం
తేల్చుకోలేని ప్రభుత్వం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక విషవలయంలో చిక్కుకుంది. తాను సంక్షోభంలో పడిపోకుండా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే 11వ పంచవర్ష ప్రణాళిక నిధుల్లో కోత పడుతుంది. ప్రణాళిక మొత్తంలో కోత పడకుండా చూసుకోవాలంటే... సబ్సిడీలకు భారీకోత పెట్టాలి. ఇప్పుడు అదేపని చేయమని ప్రణాళిక సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతోంది.

తాజా కేంద్ర బడ్జెట్లో మొత్తం కేటాయింపులు రూ.11.08 లక్షల కోట్లయితే అందులో సబ్సిడీల భారమే రూ.1.90 లక్షల కోట్లు. ఇది ప్రణాళికేతర వ్యయం. ప్రభుత్వం దృష్టిలో అనుత్పాదక వ్యయం. దీన్ని సగానికి సగం తగ్గించాలని ప్రణాళిక సంఘం పట్టుబడుతోంది. ఇదే జరిగితే ఎరువులు, వంటగ్యాస్‌, తిండి గింజల ధరలు భారీగా పెరిగిపోతాయి.

ప్రభుత్వం ఆర్థిక లోటును కుదించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12) చివరి రెండేళ్ల కేటాయింపులు తగ్గిపోతాయేమోనని అనుమానం వ్యక్తం చేయగా, ''సబ్సిడీల నిర్ణయాధికారాన్ని ప్రణాళిక సంఘానికి అప్పగిస్తే సగానికి సగం కోసేస్తాం. మిగిలే రూ.80 వేల కోట్లను ఆరోగ్యం, విద్య రంగాలకు తరలిస్తాం'' అని ప్రణాళికసంఘం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా గతవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఇచ్చిన సచిత్ర వివరణలోనూ ఇదే విషయం చెప్పారు.

ఆహారం, ఎరువులు, పెట్రోలియం సబ్సిడీల భారాన్ని 2009-10 నాటి బడ్జెట్‌ అంచనాలకు మించకుండా చూస్తేనే ఆర్థిక క్రమశిక్షణ సాధ్యం అవుతుందని, అందుకోసం వీటి ధరలు పెంచకతప్పదని ఇటీవల 11వ పంచవర్ష ప్రణాళిక మధ్యంతర సమీక్షలో మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా చెప్పారు.

2009-10లో ఆర్థిక లోటు జీడీపీలో 6.8 శాతంగా ఉంది. దీన్ని 2010-11 సంవత్సరంలో 5.5 శాతానికి, 2011-12 సంవత్సరంలో 4.8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. వీటికోసం ప్రణాళిక ఖర్చులకు కోత పెట్టకుండా సబ్సిడీలపై కోత వేయాలని ప్రణాళిక సంఘం సూచిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ, వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) అమలు లాంటి మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవచ్చని చెబుతోంది.

కేంద్ర ప్రభుత్వం 2010-11 ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.40 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వరంగ సంస్థల షేర్లకోసం మార్కెట్‌ ఆవురావురు మంటోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

2009-10 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.25 వేలకోట్లు పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో సేకరించింది. ఎన్‌టీపీసీ, ఎన్‌ఎండీసీషేర్లను మదుపరులు ఇష్టంగా కొనుక్కున్నారు.

పన్నెండో(2012-17) పంచవర్ష ప్రణాళిక కాలంలో 50 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని మౌలిక సదుపాయాలరంగంలో పెట్టుబడిగా పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతిని ప్రణాళిక సంఘం అధికారుల ముందు ప్రస్తావించగా, అందులో సగంప్రైవేటు పెట్టుబడులుగా అంచనా వేశామని తెలిపారు.