నెల్లూరు విమానాశ్రయ ఒప్పందం రద్దుకు ఎంఎడిసికి నోటీసు
హైదరాబాద్ (ఆన్‌లైన్): ప్రాంతీయ విమానాశ్రయాల ప్రతిపాదనకు సర్కారు స్వస్తి పలికింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చినా ఈ విమానాశ్రయ ప్రాజెక్టుల 'టేకాఫ్' సాధ్యంకాదని మౌలికసదుపాయాలు పెట్టుబడుల శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) విధానం కింద రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలని సర్కారు గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ విమానాశ్రయాల పేరుతో గత కొన్నేళ్ళుగా భారీ ఎత్తున సాగిన రియల్ దందాలో అమాయక ప్రజలు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
నెల్లూరు, నిజామాబాద్‌తోపాటు కర్నూలు, ఒంగోలు తదితర జిల్లాల్లో విమానాశ్రయాల పేరు చెప్పి కొంత మంది దళారీలు భారీ ఎత్తున రియల్ వ్యాపారం సాగించారు. 2007 సంవత్సరంలో నెల్లూరు, ఒంగోలు, రామగుండం (కరీంనగర్), కొత్తగూడెం (ఖమ్మం), కర్నూలు, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి), నిజామాబాద్, బాడంగి (విజయనగరం)ల్లో ఈ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఒంగోలు, నెల్లూరు విమానాశ్రయాలను గవర్నమెంట్ టు గవర్నమెంట్ ( జి టు జి) విధానం కింద వాన్‌పిక్- రస్అల్ ఖైమా జాయింట్ వెంచర్, మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కంపెనీ (ఎంఎడిసి)లకు అప్పగించారు.
నెల్లూరు విమానాశ్రయానికి సంబంధించి ఎంవోయు జరిగి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా.. ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో కొద్ది రోజుల కిత్రమే మౌలికసదుపాయాల శాఖ మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయినా ఈ కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.
ఒంగోలు విమానాశ్రయానికి సంబంధించి అనుమతుల కోసం వాన్‌పిక్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. నిజామాబాద్, కరీంనగర్ విమానాశ్రయాల స్థలంపై రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. మిగిలిన కర్నూలు, తాడేపల్లిగూడెం విమానాశ్రయ ప్రతిపాదనలు ముందుకు సాగేవికావని తేల్చారు.
కొత్తగూడెం, విజయనగరం ప్రాంతీయ విమానాశ్రయాల ప్రతిపాదనలు ప్రాథమిక దశలోనే అటకెక్కాయి. ఇదిలా ఉంటే పీపీపీ విధానం కింద కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కరీంనగర్ జిల్లాలోని రామగుండం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంల్లో ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి 2009 ఆగస్టు 25న రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు కంపెనీలేవీ ముందుకు రాకపోవటంతో సర్కారు ఈ విమానాశ్రయాలకు మంగళం పాడాలని నిర్ణయించింది.