రెండో ఏడాది 9%; ఆపైన చలన రేటు
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాల మధ్య హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ రేటును తగ్గిస్తూ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ తొలి ఏడాదిపై విధించే గృహ రుణ రేటును 8.25 శాతానికి తగ్గించింది. బ్యాంకు తన కొత్త డ్యూయల్ రేట్ ప్రోడక్ట్-2' పథకం కింద ఈ రేటును అమలు చేయనుంది. ఈ పథకం కింద మార్చి 2011 వరకూ 8.25 శాతం స్థిర రేటును ఆఫర్ చేస్తారు. ఆ తర్వాతి ఏడాది నుంచి 9 శాతం; మిగిలిన ఏడాదులకు రుణ మొత్తాన్ని బట్టి చలన వడ్డీ రేటును వర్తింపజేస్తారు. రుణ మొత్తంతో సంబంధం లేకుండా ఈ నెల 30 లోపు తీసుకునే అన్ని కొత్త రుణాలపైనా ఈ స్థిరరేట్లను అమలు చేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 14 వరకూ పూర్తిగా రుణాల పంపిణీ జరగనివారికి కొత్త ఆఫర్‌కు ఎలాంటి ఫీజులూ లేకుండా మారొచ్చని కూడా తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చలన వడ్డీ రేట్ల రుణాల్లో మాత్రం ఏ మార్పూ ఉండదని స్పష్టం చేసింది. రూ.30 లక్షల వరకూ రుణాలపై 8.75 శాతం; రూ.30-50 లక్షల రుణాలపై 9 శాతం; రూ.50 లక్షల పైబడి రుణాలకు 9.25 శాతం రేట్లు యథావిధిగా కొనసాగుతాయి. టీజర్ రేట్లుగా పిలిచే ఈ తొలి ఏడాది రేట్లను ఎస్‌బీఐతో పాటు మరికొన్ని బ్యాంకులూ ఇవ్వజూపినా అందులో చాలా వరకు ఈ ఏడాది మొదట్లోనే వాటిని వెనక్కితీసుకున్నాయి. ఎస్‌బీఐ మాత్రం ఈ నెల 30 దాకా పొడిగించిన విషయం తెలిసిందే. కాగా, తాజా పరిణామంతో ఇతర బ్యాంకులూ హెచ్‌డీఎఫ్‌సీ దారిలో పయనించే అవకాశం ఉంది. 'అంతక్రితం ప్రవేశపెట్టిన డ్యూయల్ రేట్ ఆఫర్‌కు అనూహ్య స్పందన రావడంతో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చిన'ట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణూసూద్ కర్ణాడ్ అన్నారు. వేచి చూస్తాం..యాక్సిస్ బ్యాంకు: 'ఈ విషయంపై ఇతర బ్యాంకులు స్పందించేంతవరకూ వేచి చూస్తామ'ని యాక్సిస్ బ్యాంకు అంటోంది. ఐసీఐసీఐ బ్యాంకు ఇంకా రుణ రేట్ల సవరణపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్‌బీఐ పరపతి విధానం వరకూ వేచిచూడనున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ ఒ.పి. భట్ కూడా ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.