Friday, April 16, 2010

ఫోనుంది... లైను కలవదు!

ఇబ్బందులు పడుతున్న మొబైల్‌ వినియోగదార్లు
ఫిర్యాదులపై కాల్‌సెంటర్‌ కేంద్రాల ఉదాసీనత
ఎయిర్‌టెల్‌ చందాదారులకు ఇంకొంచెం ఎక్కువ కష్టాలు
రాష్ట్రంలో ఎయిర్‌టెల్‌ కస్టమర్లు తక్కువేం కాదు. ఎంతో ఇష్టపడి తీసుకున్న ఎయిర్‌టెల్‌ కనెక్షను ఇప్పుడు వారికి ఇబ్బందికరంగా మారుతోంది. చేతిలో ఫోను ఉంటుంది. కానీ.. లైను దొరకదు. దొరికినా.. మాట్లాడుతూ ఉండగా మధ్యలో కట్‌ అయిపోతుంది. నగరం నడిబొడ్డున ఉన్నా సిగ్నల్‌ దొరకదు. ఇక దూర ప్రాంతాల సంగతి సరేసరి. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ వినియోగదార్లు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది. సమస్యకు సత్వర పరిష్కారాన్ని ఎయిర్‌టెల్‌ కనుక్కోకపోతే భవిష్యత్తులో వినియోగదార్ల కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కారణం త్వరలో నంబరు పోర్టబులిటీ (నంబరు మారదు కానీ, ఆపరేటరును మార్చుకోవచ్చు) అందుబాటులోకి రానుండటమే.
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
నెలనెలా పెరిగే కొనుగోళ్లు.. ఎదురుచూడకున్నా వచ్చిపడే కస్టమర్లు. మొబైల్‌ ఫోన్‌ సేవలందిస్తున్న కంపెనీలకు కనిపించే రంగుల ప్రపంచమిది. చందాదార్లను ఆకర్షించడంపై అవి చూపించే శ్రద్ధ.. వారికి అందించే సేవలపై మాత్రం ఉండటం లేదన్నది వాస్తవం. రాష్ట్ర విపణిలో అగ్రగామిగా ఉన్న ఎయిర్‌టెల్‌ చందాదారుల పరిస్థితి సైతం ఇందుకు మినహాయింపు కాదు. మాట్లాడుతూ ఉండగా మధ్యలో కట్‌ అయిపోవడం వల్ల రెండోసారి కాల్‌ చేయాల్సి వస్తోంది. ఇది తమపై అదనపు భారం మోపుతోందని కొంతమంది చందాదారులు చెబుతున్నారు. తనకు బ్లాక్‌బెర్రీ ఫోన్‌ లేకపోయినా తన నుంచి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ ఛార్జీలను వసూలు చేశారని.. వాటిని తిరిగి పొందడానికి ఎంతో ప్రయాస పడాల్సి వచ్చిందని సీనియర్‌ సిటిజన్‌ ఒకరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

పీక్‌ సమయాల్లో అవస్థలు
ఎక్కువ మంది ఫోన్‌ మాట్లాడే సమయంలో (పీక్‌ సమయం) నెట్‌వర్క్‌కు ట్రాఫిక్‌ ఎక్కువై ఎయిర్‌టెల్‌ చందాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9-10, సాయంత్రం 7-8 గంటల మధ్య, వారాంతాలు, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో చందాదారులు ఎక్కువ మాట్లాడతారు. హైదరాబాద్‌లోని కొన్ని కీలక కూడళ్లలోని టవర్లపై అధిక భారం పడి ఇటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ఈ ప్రాంతాల్లో టవర్‌ సామర్థ్య వినియోగం 80-90 శాతం వరకు ఉంటుంది. అంతకు మించినప్పుడు చందాదారుడు ఫోన్‌ చేయడానికి వేచి ఉండక తప్పడం లేదు. ఒక్కో టవర్‌కు మూడు సెక్టార్స్‌, గరిష్ఠంగా 30 రేడియోలు ఉంటాయని, ట్రాఫిక్‌ పెరిగినప్పుడు ఆ ప్రాంతంలో మరో టవర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గరలో అనువైన స్థలం లభించకపోవడం, ఏర్పాటులో జాప్యం కారణంగా చందాదారులకు తరచు ఫోన్లు కలవవని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేనప్పుడు డీజిల్‌ ఇంజిన్‌పై సెల్‌సైట్‌ పని చేస్తుంది. డీజిల్‌ అందుబాటులో లేనప్పుడు ఆ టవర్‌ ట్రాఫిక్‌ను పక్క టవర్‌కు మళ్లిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో భారం పెరుగుతుంది.

సంస్థ ఏమంటోందంటే..
ప్రతి నెల ట్రాఫిక్‌కు అనుగుణంగా నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దుతామని అయితే.. కొత్త భవనాలు, నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాల కారణంగా ఫోన్‌ చేసినప్పుడు కలవకపోవడానికి అవకాశం ఉంటుందని ఎయిర్‌టెల్‌ ప్రతినిధి చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమకు 10 వేల వరకు టవర్లు ఉన్నట్లు చెప్పారు. ఆరు నెలలకు ముందే అవసరాలను అంచనావేసి తదనుగుణంగా సామర్థ్యాలను పెంచుతామని వివరించారు. అక్కడున్న ట్రాఫిక్‌ అవసరాల కంటే టవర్లకు 30 శాతం అదనపు సామర్థ్యం (బఫర్‌) ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో టవర్‌ సామర్థ్యంలో 40-50 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాం. ఫోన్‌ కలవకపోవడం, కాల్‌ డ్రాపింగ్‌ వంటి సమస్యలు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని అంటున్నారు. అయితే.. చందాదారులు మాత్రం సమస్య తీవ్రంగా ఉందని వాపోతున్నారు.

కొన్ని సమస్యలు
* ఫోన్‌ చేసిన వెంటనే తరచు లైన్లు దొరక్కపోవడం.
* మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా అంతరాయం (కాల్‌ డ్రాపింగ్‌) కలగడం.
* కస్టమర్‌ కేర్‌ కేంద్రానికి ఫోన్‌ చేస్తే ఆశించిన ఫలితం దక్కకపోవడం.
* కొన్ని సందర్భాల్లో వాడని సేవలకు బిల్లులు (పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్ల విషయంలో) రావడం.
* తప్పుడు బిల్లులను సరిదిద్ది తిరిగి సొమ్ము వాపసు ఇవ్వడం (ఇవ్వాల్సి ఉంటే)లో కాలయాపన.

గణాంకాలు
* రాష్ట్రంలో ఎయిర్‌టెల్‌ వాటా 28 శాతం.
* చందాదార్లు దాదాపు 1.26 కోట్ల మంది.
* ప్రతి నెల దాదాపు 2 లక్షల మంది కొత్త చందాదారులను కంపెనీ ఆకర్షిస్తోంది.
* ప్రత్యేక పథకాలు, పండగల సమయంలో ఈ సంఖ్య 3 లక్షల వరకు ఉంటుంది.

ఎక్కువమంది ఆపరేటర్లున్నా..
రాష్ట్రంలో 10 సంస్థలు టెలికాం సేవలు అందిస్తున్నాయి. మరో నాలుగు కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇంతమంది ఆపరేటర్లు ఉన్నప్పటికీ.. చందాదారులకు మెరుగైన సేవలు అందకపోవడానికి వేగంగా విస్తరిస్తున్న విపణే కారణమని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర జనాభా 8 కోట్లను మించింది. ఇందులో ప్రస్తుతం 30% మంది వద్దే మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. రాష్ట్రంలో నెలకు 20-30 లక్షల మంది కొత్తగా చందాదారులుగా చేరుతున్నారు. కాబట్టి చందాదారులను కోల్పోవాల్సి వస్తుందన్న భయం కంపెనీల్లో లేదు. చందాదారులు పెరిగినంత స్థాయిలో నెట్‌వర్క్‌, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందకపోవడంతో చందాదారులు మెరుగైన సేవలు పొందలేకపోతున్నారు. నూరు శాతం మంది చేతిలో మొబైల్‌ ఫోన్లు ఉండే సింగపూర్‌లో సైతం చిన్న సమస్య కూడా ఎదురుకాదని, ఒక వేళ ఇబ్బంది కలిగితే వెంటనే ఆపరేటర్‌ను మార్చి వేస్తారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థితికి చేరడానికి ఇక్కడ చాలా సమయం పడుతుందని అంటున్నారు.