Friday, April 16, 2010

మరుగుదొడ్ల కంటే మొబైల్స్‌ అధికం

భారత్‌పై ఐరాస నివేదిక
ఐక్యరాజ్య సమితి: భారత్‌లోని 115 కోట్ల జనాభాలో 55 కోట్ల మందికి మొబైల్‌ కనెక్షన్లు ఉంటే, కనీస అవసరమైన మరుగుదొడ్లు 37 కోట్ల మందికీ అందుబాటులో లేవు. ఆరోగ్య సంరక్షణకు కనీస అవసరమైన మరుగుదొడ్డి సదుపాయం భారత్‌లో 31% మందికే ఉంటే, మొబైల్‌ కనెక్షన్లు మాత్రం 45% మందికి ఉన్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొంది. 2000-01లో ప్రతి 100 మందికి 0.35 మాత్రమే ఉన్న సెల్‌ఫోన్లు, రాకెట్‌ వేగంతో దూసుకెళ్లి ప్రస్తుతం 45శాతానికి చేరాయి. 'దేశంలో దాదాపు సగం మంది వద్ద సెల్‌ఫోన్లున్నాయి. అందులో సగం మందికి మరుగుదొడ్డి సదుపాయమే లేద'ని 'నీరు, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ'పై ఐరాస యూనివర్సిటీ డైరెక్టర్‌ జఫార్‌ అడీల్‌ వివరించారు. పారిశుద్ధ్యంపై ఖర్చుచేసే ప్రతి 50 రూపాయల వల్ల పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, అధిక ఉత్పత్తి సామర్థ్యం రూపంలో రూ.150 నుంచి రూ.1700 వరకు లాభం కలుగుతుందని యూనివర్సిటీ నివేదిక వివరించింది. ప్రపంచవ్యాప్తంగా కలుషితనీరు, కనీస పరిశుభ్రత లోపించడం వల్లే ఏటా 15 లక్షల మంది పిల్లలు, లెక్కలేనంత మంది ఇతరులు చనిపోతున్నారని ఐరాస నివేదిక పేర్కొంటోంది. మరుగుదొడ్డి నిర్మాణానికి సుమారుగా రూ.15000 ఖర్చవుతుందని అంచనా. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందరి అవసరాలు తీరాలంటే రూ.16,46,800 కోట్లు అవసరమని అంచనా వేసింది.