'మార్చి 21 : ముంబైకి చెందిన సతీష్ సావంత్ ప్రభాదేవిలోని షోరూమ్ నుంచి కొత్తగా డెలివరీ తీసుకున్న నానో కారులో భార్య, ఐదేళ్ళ వయసున్న కుమారునితో సెంట్రల్ ముంబై మీదుగా ఇంటికి వెళుతున్నాడు. నగర శివార్లలోని ములుంద్-ఐరోలి వంతెన దగ్గరకి రాగా నే కారులో మంటలురేగాయి. మంటలు గమనించిన వాహనదారులు అప్రమత్తం చేయడంతో ఒక్క పెట్టున భార్యాపిల్లలతో సహా బయటకు దూకి బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాలు రక్షించుకున్నాడు. వారి కళ్ళ ముందే క్షణాల్లో కారు మాడి మసైపోయింది.
ఏప్రిల్ 7 : గుజరాత్‌లోని వడోదర షో రూమ్‌కు అందచేయడానికి టాటా డ్రైవర్లు 11 నానో కార్లను తీసుకువెడుతున్నారు. ఎనిమిదో నంబర్ జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి బొరియావి గ్రామం వద్ద ఒక కారులో మంటలు లేచాయి. ఆ విషయం గమనించిన డ్రైవర్ కారును రోడ్డు మీదనే వదిలి బయటకు దూకాడు. ఆ కారు కూడా క్షణాల్లో బూడిదగా మారిపోయింది.
రెండు వారాల వ్యవధిలోనే చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలు నానో కారుతో తాము కూడా కారు యజమానులు కావాలన్న కల సాకారం చేసుకునేందుకు ఆరాటపడుతున్న సగటు జీవులను భీతావహులను చేస్తున్నాయి. ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలందుకున్న నానో కారుకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు.
ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా చెక్కు చెదరక భారతదేశంలోని సగటు జీవికి లక్ష రూపాయలకే కారు అందిస్తానన్న హామీని నిలబెట్టుకుంటూ కంపెనీ అధినేత రతన్ టాటా 2009 జులైలో తొలి కస్టమర్‌కు కారును అందించిన నాటి నుంచి ఈ 10 మాసాల వ్యవధిలో నాలుగైదు కార్లలో పొగలు వచ్చిన సంఘటనలు వార్తలకెక్కాయి. అహ్మదాబాద్‌లోని ఒక హౌసింగ్ కాలనీలోని బంగ్లా ఆవరణలో పార్క్ చేసి ఉన్న నానో కారులో గత ఏడాది సెప్టెంబర్‌లో మంటలు లేచినట్టు వార్తలు వచ్చాయి.
కానీ దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. బ్యాటరీలో సాంకేతిక లోపం వల్లనే కారులో మంటలు లేచాయని అప్పట్లో అన్నారు. అలాగే మరి కొన్ని నానో కార్లలో కూడా పొగలు వచ్చిన సంఘటనలు అడపాదడపా వెలుగులోకి వచ్చాయి. కారులో ఇగ్నీషన్ స్విచ్‌లో లోపాలే అందుకు కారణమని గుర్తించినట్టు కూడా ఆ సమయంలో టాటా మోటార్స్ ప్రతినిధులు చెప్పారు. కాని నడుస్తున్న కార్లలో మంటలు అంటుకుని అందరూ చూస్తుండగానే మాడి మసైపోయిన తొలి సంఘటనలు మాత్రం ఇవే.
ఈ సంఘటనలతో నానో కారు ఎంతవరకు సురక్షితం అనే అంశం కూడా ప్రజల్లో ఒక చర్చగా మారింది. అంత పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినా కొత్త కారు ఇవ్వడం లేదా కారు కోసం చెల్లించిన సొమ్ము వాపసు ఇవ్వడం అన్న రెండు ప్రతిపాదనలు తప్పించి టాటా యాజమాన్యం నుంచి ఈ సంఘటనలకు తాము విచారిస్తున్నట్టుగా ఎలాంటి లేఖ గాని సందేశం గాని రాకపోవడం తమను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నదని బాధితులు అంటున్నారు.
కారణాలపై దర్యాప్తు
నానో కార్లలో మంటలు లేవడానికి కారణం ఏమై ఉంటుందన్న అంశంపై తాము అధ్యయనం చేస్తున్నామని టాటా మోటార్స్ ప్రతినిధులు చెబుతున్నారు. అది డిజైన్‌లో లోపం కాదని తాము గట్టిగా చెప్పగలమని, మరి మంటలు ఎందుకు చెలరేగాయన్నది పరిశీలించాల్సి ఉన్నదని వారంటున్నారు. ముంబైలో సతీష్ సావంత్ కారు మాడి మసైపోయిన సంఘటనపై తాము పూర్తి స్థాయి అధ్యయనం చేపట్టినట్టు టాటా మోటార్స్ ఎండి పి.ఎం.తెలాంగ్ ముంబైలో చెప్పారు. ప్రస్తుతం భారతీయ రోడ్లపై 30 వేలకు పైగా నానోలు తిరుగుతున్నాయని ఆయన అన్నారు.
గుణపాఠం చెబుతా: సతీష్ సావంత్
టాటా యాజమాన్యం వైఖరికి ఆగ్రహించిన సతీష్ సావంత్ ఇది తమను అవమానించడంగానే భావించి కంపెనీపై 15 లక్షల రూపాయలకు నష్ట పరిహారం దావా వేయాలనుకుంటున్నట్టు ఆదివారం ప్రకటించారు. కారులో మంటలు కళ్ళారా చూసిన ఐదేళ్ళ తమ కుమారుడు మరే కారులో ఎక్కడానికైనా భయపడిపోతున్నాడని, మనకి అసలు ఏ కారూ వద్దంటూ తన భార్య పట్టుబడుతున్నదని ఆయన చెప్పారు. అసౌకర్యానికి చింతిస్తున్నామన్న ఒక లేఖ, కారు ధరను వాపసు ఇస్తూ జారీ చేసిన 2.25 లక్షల రూపాయల చెక్కు తమ కుటుంబానికి ఏర్పడిన మాన సిక వేదనకు పరిహారం అవుతాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇంత పెద్ద సంఘటన జరిగినా టాటా కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు గాని, కంపెనీ అధినేత రతన్ టాటా గాని తమకు క్షమాపణ చెప్పకపోవడాన్ని ఆయన తప్పు పడుతున్నారు. పైగా చిన్న తనంలో సైకిల్ నేర్చుకునే సమయంలో తాను కిందపడ్డానని, మొదట భయపడినా ఆ తర్వాత సద్దుకుని తిరిగి సైకిల్ తొక్కానంటూ టాటా మోటార్స్ పాసింజర్ కార్ల విభాగం రీజినల్ మేనేజర్ దీపాంకర్ తివారి తమకు కాకమ్మ కథలు చెప్పడం ఎంతవరకు సమర్థనీయమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండాకంపెనీకి గుణపాఠం నేర్పి తీరాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
కొన్ని మార్పులు తప్పవు..
నానోకు ఇటీవల ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో కారుకి ఫైర్ అలారం, మంటలు ఆర్పే పరికరాలు అమర్చడం అవశ్యమని కొందరు సూచిస్తున్నారు. అందులోనూ యూరోపియన్ మార్కెట్‌లో వచ్చే రెండేళ్ళలో నానో విడుదల చేసేందుకు టాటా కంపెనీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో దేశ ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉండాలంటే ఇలాంటి ప్రమాదాలు నివారించే విషయంలో తక్షణం దృష్టి సారించాలంటున్నారు. అంతేకాదు ఈ సంఘటనల నేపథ్యంలో నానో భద్రతపై స్వయంగా రతన్ టాటా కస్టమర్లకు భరోసా ఇవ్వాలని కూడా అంటున్నారు. టాటా పోటీదారులు దీన్ని అవకాశంగా మలుచుకునే వ్యవధి ఇవ్వకూడదన్నది టాటా శ్రేయోభిలాషుల సూచన. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న 30 వేల నానోలతో పోల్చితే ఈ ప్రమాదాలు తక్కువగా పరిగణించడానికి లేదని ఆటో విశ్లేషకుడు దీపేష్ రాథోడ్ అంటున్నారు. నానో నిస్సందేహంగా అద్భుతమైన కారని, కాని ఈ లోపాలను సరిదిద్దకపోతే మాత్రం టాటాల ప్రతిష్ఠ, దేశ ప్రతిష్ఠ కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో నానోను సమర్థిస్తున్న వారు లేకపోలేదు.
తాము కొన్ని నెలలుగా నానో నడుపుతున్నామని, తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని కొందరు నానో యజమానులంటున్నారు. అడపాదడపా చోటు చేసుకున్న సంఘటనలను పట్టుకుని ఈ ప్రాజెక్టునే నిర్వీర్యం చేయాలనుకుంటే మాత్రం సగటుజీవికి కారు అందుబాటులో లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అవి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న అభిప్రాయంతో వారు ఏకీభవించారు.