Monday, April 12, 2010

అంకెల జాతర

దాదాపు నూట ఇరవైకోట్లమంది భారతీయుల్ని వరుసబెట్టి లెక్కించే అంకెల యజ్ఞం వెుదలైంది. 'ఇంటింటి సర్వే' గంట కొట్టేశారు. పాతికలక్షల మంది ఉద్యోగులు కాగితాల కట్టలతో రంగంలో దిగుతున్నారు. ఏప్రిల్‌ 1న లాంఛనంగా ప్రారంభమైన జనాభా లెక్కల తొలిదశ కార్యక్రమం, మన రాష్ట్రంలో ఏప్రిల్‌ 26 నుంచి జరుగుతుంది.
మీపేరు?
తండ్రిపేరు?
తల్లి పేరు?
ఏం చేస్తుంటారు?
ఏం చదువుకున్నారు?
మీ ఇంటికొస్తారు. మీ తలుపు తడతారు. మిమ్మల్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అయినా సరే, విసుక్కోకండి. తప్పించుకోకండి. తప్పులు చెప్పకండి. ధడాలున తలుపు మూసేయకండి. వచ్చినవాళ్లు ప్రభుత్వ ప్రతినిధులు. జనాభాలెక్కలు సేకరించడం వాళ్ల బాధ్యత. పదేళ్లకోసారి జరిగే జనగణన మరో పదేళ్లపాటూ ప్రభుత్వ నిర్ణయాలకు ఆధారమవుతుంది. ప్రణాళికలకు ప్రాణం అవుతుంది. ఆ అంకెల యజ్ఞానికి సహకరించడం మన కర్తవ్యం.
* * *
జనాభా లెక్కలంటే అంకెల్లో చరిత్ర. నిజానికి, చరిత్రపుస్తకం కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే, రాసేవారి దృక్పథాన్ని బట్టి చరిత్ర మారిపోతుంది. ఎరుపో, కాషాయవో ఎవరికి తోచిన రంగు వాళ్లు పూస్తారు. ఎవరికి నచ్చిన అద్దంలోంచి వాళ్లు చూస్తారు. వక్రీకరణలూ వ్యాఖ్యానాలూ షరామామూలే. కానీ, అంకెలెప్పుడూ అబద్ధం చెప్పవు. వాస్తవాలకు మసిపూయవు. అదేదో శీతలపానీయం ప్రకటనలో చెప్పినట్టు 'సూటిగా, సుత్తిలేకుండా...' నిజాల్ని వెల్లడిస్తాయి. రెండు జనాభాలెక్కల్ని ముందేసుకుంటే, ఇరవై ఏళ్ల మార్పుల్ని సరిపోల్చుకోవచ్చు. వందేళ్ల గణాంకాల్ని విశ్లేషించుకుంటే శతాబ్ది చరిత్ర అర్థంచేసుకోవచ్చు. గ్రామీణ, పట్టణప్రాంత జనాభాలో మార్పులు...వ్యవసాయరంగంలో సంక్షోభాల గురించి పారిశ్రామికీకరణ విస్తరణ గురించి సలసలకాగే కడుపుల వలసల గురించి చెప్పకనే చెబుతాయి. స్త్రీపురుషుల జనాభా నిష్పత్తిని చూస్తే, సమాజంలో మహిళకున్న గౌరవం ఏపాటిదో తెలుసుకోవచ్చు. నిజంగానే ఆమె ఆర్థికంగా, సామాజికంగా ఎంతోకొంత ఎదుగుదల సాధించివుంటే గతానికీ ఇప్పటికీ తేడా కనిపించాలి. 1991, 2001 లెక్కల్ని పోలిస్తే... స్త్రీపురుష నిష్పత్తి 927 నుంచి 933కు మారింది. అంటే, ఆమె స్థానం మునుపటి కంటే మెరుగుపడిందని అర్థం. అక్షరాస్యత పెరిగిందంటే దేశం అభివృద్ధి చెందుతోందని సంకేతం. జీవనప్రమాణాలూ మెరుగయ్యాయని భావం. గతాన్ని బేరీజువేసుకోడానికే కాదు, భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోడానికీ జనాభాలెక్కలు అవసరమవుతాయి. అందుకే ప్రభుత్వాలు వాటికంత ప్రాధాన్యమిస్తాయి. శాంపిల్‌సర్వేలూ సర్కారీ రికార్డులూ ఎన్నున్నా...జనగణనకే పెద్దపీటవేస్తాయి. ఆ మహాయజ్ఞానికి ఎన్నికోట్లయినా ఖర్చుపెడతాయి. ఎంతమంది సిబ్బందినైనా నియోగిస్తాయి. 1947 తర్వాత జరుగుతున్న ఏడో గణన ఇది. అంతకు చాలా ముందే, 1872 నుంచే బ్రిటిష్‌ పాలకులు మనదేశంలో జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. అలా అని ఆ ఘనత తెల్లదొరలకే అంటగట్టలేం. రుగ్వేదంలో జనగణన ప్రస్తావన ఉంది. కౌటిల్యుని అర్థశాస్త్రం జనాభా లెక్కల అవసరాన్ని నొక్కిచెప్పింది. అక్బర్‌ కాలంనాటికే పక్కా చిట్టాలున్నాయి. కానీ ఆ లెక్కలన్నీ పన్నులు విధించడానికో సైనికుల్ని నియమించుకోడానికో తయారుచేసినవే. సామాన్యుడిని పట్టించుకున్న దాఖలాలు లేవు. తెల్లదొరల జనాభాలెక్కల ఉద్దేశం వేరు. ఇంతపెద్ద దేశాన్ని పాలించడమంటే మాటలు కాదు. ప్రజల సంస్కృతినీ సంప్రదాయాల్నీ అర్థంచేసుకోవాలి. ఆర్థిక, సామాజిక పరిస్థితుల మీద అవగాహన రావాలి. కులవ్యవస్థ లోతుపాతుల్ని అధ్యయనం చేయాలి. పోర్చుగీసువారి నుంచి, డచ్చివారి నుంచి వస్తున్న పోటీని తట్టుకోడానికి భారతీయ సంప్రదాయ కళల్ని మార్కెట్‌ చేసుకోవడం కూడా తప్పనిసరైంది. ఇదంతా జరగాలంటే ఓ సమగ్ర ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళికకు అంకెల మద్దతు ఉండాలి. అప్పుడొచ్చిన ఆలోచనే జనాభా లెక్కల సేకరణ. 1870లో బ్రిటిష్‌రాణికి పంపిన నివేదికలో ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్టు వివరించారు. బ్రిటిష్‌ పాలకులు ఏ ఉద్దేశంతో వెుదలుపెట్టినా...జనాభాలెక్కల ప్రాధాన్యాన్ని కాదనలేం. దేశ జనాభాకు సంబంధించి ప్రజల స్థితిగతులకు సంబంధించి మనకున్న ఏకైక ఆధారం ఈ లెక్కలే. అక్షరాస్యత, నివాస పరిస్థితులు, వలసలు, పట్టణీకరణ, ఎస్సీఎస్టీల సంఖ్య, మతాలు, భాషలు... ఏ వివరాలకైనా ఇవే ప్రామాణికం. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల్ని ప్రారంభించడానికి ఈ అంకెలే ఆధారం. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన... ఏ కీలక నిర్ణయానికైనా జనాభా లెక్కలే సాక్ష్యం. వివిధ కార్యక్రమాల్లో భాగం వహించే ప్రభుత్వేతర సంస్థలకూ పరిశోధకులకూ గణాంకాలే ప్రాణం. వ్యాపారవాణిజ్య వ్యూహాలకూ ఇవే వూపిరి. 'జనాభా లెక్కల్ని పరిశీలించకుండా ఆర్థిక, సామాజిక, పరిపాలనాపరమైన ఏ కార్యక్రమాన్నీ ప్రారంభించలేం. ప్రతి అధ్యయనానికీ ఇవే ఆధారం. ప్రతి సమస్యకూ ఇందులోనే పరిష్కారం ఉంది' అంటూ గోవింద్‌ వల్లభ్‌పంత్‌ చేసిన వ్యాఖ్యానం నూటికి నూరుపాళ్లు నిజం.
మార్పులూ చేర్పులూ
ప్రపంచంలో ఏ దేశానికీ ఇంత సుదీర్ఘమైన జనగణన చరిత్ర లేదు. ఉన్నా, ఇంత నిరాటంకంగా ఇంత శాస్త్రీయంగా లేకపోవచ్చు. ఆ ఘనతకు కారణం మన జనాభాలెక్కల విధానమే. అదెప్పుడూ నిబంధనల చట్రంలో ఇరుక్కుపోలేదు. గతానుభవాల్ని బట్టి, ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి, నిపుణుల సూచనల్ని బట్టి, అంతర్జాతీయ ప్రమాణాల్నిబట్టి మారుతూనే ఉంది. నూట ముప్ఫైఏళ్ల ఆ మార్పుల చిట్టా చాలా పెద్దది. 1872 నాటికి జనాభాలెక్కల్లో 'ఇల్లు' అన్న మాటకు కచ్చితమైన నిర్వచనం లేదు. అది మేడా, పూరిగుడిసా అన్న తేడా లేదు. 1881లో ఆ లోపాన్ని సవరించారు. దీనివల్ల దేశంలో ఎంతమంది పక్కా ఇళ్లలో ఉంటున్నారు, ఎంతమంది పూరిగుడిసెల్లో బతుకుతున్నారనే విషయంలో ఓ స్పష్టత వచ్చింది.

మనిషి వయసెలా లెక్కించాలి? గత పుట్టినరోజు ప్రకారమా? రాబోయే పుట్టినరోజు ప్రకారమా? లేదంటే, లెక్కలు సేకరిస్తున్న సమయానికా? 1872లో రాబోయే పుట్టినరోజు నాటికి ఆ వ్యక్తి వయసును పరిగణనలోకి తీసుకున్నారు. 1881 నుంచి 1921 దాకా గత పుట్టినరోజును లెక్కలోకి తీసుకున్నారు. 1941 నుంచి జనాభా లెక్కలు సేకరిస్తున్న సమయానికి సదరు వ్యక్తి వయసెంతో నెలలతో సహా లెక్కించారు. మళ్లీ 1971 నుంచి గత పుట్టినరోజు నాటి వయసునే రికార్డు చేస్తున్నారు.

తొలిరోజుల్లో మహిళల వైవాహికస్థితికి సంబంధించి...వివాహిత, అవివాహిత, వితంతువు అన్న ప్రశ్నలే ఉండేవి. విడాకులు తీసుకున్నవారిని కూడా వితంతువుల జాబితాలో చేర్చేవారు. 1971 నుంచి ఒంటరి మహిళ అన్న పదాన్ని కొత్తగా చేర్చారు. 1961 దాకా దేవదాసీల వివాహ వివరాలను నవోదు చేసుకోడానికి తిరస్కరించేవారు. ఆతర్వాత నిబంధనల్ని మార్చారు. తొలి జనాభా లెక్కలనుంచి కూడా అక్షరాస్యత మీద అపారమైన శ్రద్ధ చూపించారు. 1881 లెక్కల వరకూ మాతృభాషకు సంబంధించి ఎలాంటి వివరాల్లేవు. కొంతకాలం 'తెలిసిన విదేశీభాషలు' అన్న ప్రశ్న ఉండేది. దాన్నే ఆతర్వాత 'ఇంగ్లిష్‌ తెలుసా?' అని మార్చారు. 1971 నుంచి ప్రతి జనాభాలెక్కల్లోనూ 'తెలిసిన ఇతర భాషలు' అన్న ప్రశ్న కనిపిస్తూనే ఉంది. కులాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు అగ్రకులాలు, నిమ్నకులాలని రెండు విభాగాలుండేవి. ఆ తర్వాత నిమ్నకులాలు అన్న మాటను 'అట్టడుగు వర్గాలు'గా సవరించారు. 1931 తర్వాత అసలు కులాలవారీ వివరాల్ని సేకరించడమే మానేశారు. ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే నవోదు చేస్తున్నారు. తాజా జనాభా లెక్కల్లో కులాల సమాచారం ఉండి తీరాలని కొన్ని వర్గాలనుంచి ఒత్తిడి పెరిగినా, ప్రభుత్వం అంగీకరించలేదు. ఈసారి జనాభా లెక్కలకు 'జాతీయ జనాభా రిజిస్టరు'ను కూడా జోడించారు. ఇప్పటిదాకా ప్రభుత్వోద్యోగులు మాత్రమే నిర్వర్తిస్తున్న జనగణన బాధ్యతల్లో ఈసారి ప్రభుత్వేతర సంస్థలవారినీ (ఎన్జీవోలు) భాగస్వాములను చేస్తున్నారు. చాలాకాలం దాకా జనాభాలెక్కల సేకరణకు శాశ్వత ఏర్పాట్లు ఉండేవి కాదు. జనాభాలెక్కల పనులు అయిపోగానే ఠక్కున మాయమైపోయే ఆ తాత్కాలిక వ్యవస్థను 'ఫీనిక్స్‌' పక్షితో పోల్చి నవ్వుకునేవారంతా. 1961లో రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర హోంశాఖ అజమాయిషీలో పనిచేస్తుంది. జనాభా లెక్కల సేకరణ చట్టం-1948 జనగణనకు చట్టబద్ధతనిచ్చింది. ప్రజల్ని ప్రశ్నించే అధికారమిచ్చింది. అదే సమయంలో వ్యక్తిగత వివరాల్ని గోప్యంగా ఉంచుతామని ప్రజలకు భరోసానిచ్చింది. ఎన్యూమరేటర్లకు చెప్పిన సమాచారాన్ని ఏ న్యాయస్థానాల్లోనూ సాక్ష్యంగా చూపడానికి వీల్లేదు.

సుదీర్ఘ ప్రక్రియ...
వందకోట్ల జనాన్ని వరుసపెట్టి లెక్కించడమంటేనే ఓ పెద్ద సాహసం. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, గిరిజన గూడాలు, తండాలు, లంకలు, కొండజాతుల ఆవాసాలు...ఎవర్నీ వదిలిపెట్టకూడదు. జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యమిస్తోంది. 246వ నిబంధన ప్రకారం, సాక్షాత్తు భారత రాజ్యాంగమే ఈ బాధ్యతను కేంద్రానికి అప్పగించింది. 2011 జనగణనలో పాతిక లక్షల సిబ్బంది పాల్గొంటున్నారు. 28 రాష్ట్రాలూ 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 640 జిల్లాలు, 5,767 పట్టణాలు, 6,08,786 గ్రామాలు... ఎంత విస్తృత పరిధి! ఈ ప్రక్రియ నిర్విఘ్నంగా సాగడానికి ప్రభుత్వం దాదాపు 2,200 కోట్లు కేటాయించింది. జాతీయ జనాభా రిజిస్టరు తయారీకి మంజూరుచేసిన రూ.3,756 కోట్లకు ఇది అదనం. అంటే...దాదాపు ఆరువేల కోట్ల ప్రాజెక్టు! ఇక టెక్నాలజీ పరంగా చూస్తే పదేళ్ల క్రితమే 15 డేటాసెంటర్లలో 25 స్కానర్లు, 1060 కంప్యూటర్లు, 45 సర్వర్లు ఉపయోగించారు. అయినా, తుదిఫలితాలు రావడానికి ఐదారేళ్లు పట్టింది.

జనగణనకు దాదాపు ఐదేళ్ల ముందునుంచే ఏర్పాట్లు వెుదలవుతాయి. ప్రణాళికా సంఘం, ప్రజల ఆర్థిక సామాజిక సాంస్కృతిక వ్యవహారాలతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలు, విద్యావేత్తల సలహాలూ సూచనల ఆధారంగా ప్రశ్నావళి తయారవుతుంది. ఏఏ అంశాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాలో అంతా కలిసి నిర్ణయిస్తారు.

జనాభాలెక్కల సేకరణ రెండు దశల్లో ఉంటుంది. తొలి దశలో జరిగేది ఇంటింటి సర్వే. ఇందులో ప్రతి గృహానికి సంబంధించిన వివరాలు నవోదు చేస్తారు. రెండోదశలో జరిగే జనాభాసేకరణకు ఇదే ఆధారం. జాతీయ జనాభా రిజిస్టరు తయారీకి అవసరమైన... ఇళ్ల సంఖ్య, వాటి నిర్మాణం (డాబా ఇళ్లా, పూరిళ్లా), నివాస యోగ్యత, తాగునీటి వసతి, మురుగునీటి వ్యవస్థ, ఇంట్లో ఉన్న సౌకర్యాలు, రవాణా సాధనాలు...తదితర వివరాలు కూడా తొలిదశలోనే సేకరించబోతున్నారు. రేడియో/ట్రాన్సిస్టరు, టీవీ, కంప్యూటర్‌/లాప్‌టాప్‌, టెలిఫోన్‌/వెుబైల్‌ సైకిలు, స్కూటరు/వోటారు సైకిలు/వోపెడ్‌, కారు/జీపు/వ్యాను... తదితర ఉపకరణాలూ రవాణాసాధనాల సమాచారమూ రికార్డులకు ఎక్కనుంది. బ్యాంకు ఖాతాలు ఉన్నాయా లేదా అన్నదీ తెలుసుకుంటారు. ప్రజల జీవనశైలినీ జీవనప్రమాణాల్నీ అర్థంచేసుకోడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి. ప్రణాళికల తయారీలో సంక్షేమ పథకాల అమలులో ఈ గణాంకాలు పనికొస్తాయి. విధినిర్వహణలో ఉన్న ఎన్యూమరేటర్లూ సూపర్‌వైజర్లకు ఉపయోగపడేలా మార్గదర్శక సూత్రాల్ని కూడా రూపొందించారు. శిక్షణ కార్యక్రమాలూ జరుగుతున్నాయి. ఏప్రిల్‌ ఒకటిన భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మన రాష్ట్రానికి సంబంధించి ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ 10 వరకూ జరుగుతుంది. ఈ వివరాలు సేకరించడానికొచ్చిన సిబ్బంది ఓ రసీదులాంటిది ఇస్తారు. నిర్ణీత తేదీల్లో నిర్వహించే ఫొటోలూ వేలిముద్రల కార్యక్రమానికి దాన్ని తీసుకెళ్లాలి. ఈ సమాచారం ఆధారంగా విశిష్ట గుర్తింపు కార్డునిస్తారు. ఆ తర్వాత, ఫిబ్రవరి 2011లో జనాభా లెక్కింపు వెుదలవుతుంది. తొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకూ నిరాటంకంగా సాగుతుంది. మార్చి తొలివారంలో సవరణలకు అవకాశమిస్తారు. తుదిజాబితా రావడానికి కనీసం రెండేళ్లుపట్టే అవకాశం ఉంది.

ఇంకో పదేళ్ల తర్వాత, మరోసారి జనాభా లెక్కగట్టేదాకా విధాన నిర్ణయాలకూ అంతర్జాతీయ వేదికలమీద సగర్వ ప్రస్తావనలకూ ఈ అంకెలే ఆధారం, ఆ అంకెలే ఆయుధం. గ్రూప్స్‌ పరీక్షల్లో చచ్చినట్టు వచ్చే ప్రశ్నలూ సివిల్స్‌ ఇంటర్వ్యూలో వెుట్టవెుదట ప్రస్తావించే అంశాలూ...జనాభా లెక్కలే. ఒంటరి భావనతో కుమిలిపోతున్నప్పుడు ... ఒక్కసారి జనాభా లెక్కలు చూసుకున్నా, బోలెడంత ధైర్యం వచ్చేస్తుంది. వందకోట్ల జనం 'మేమున్నాం...' అని చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఇది అంకెల చుట్టరికం!

ఎంత సమగ్రం?
కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నారు. వేలమందిని రంగంలో దించుతున్నారు. అయినా, అంకెల్లో కొంత విశ్వసనీయత లోపిస్తోందనే విమర్శ ఉంది. సేకరణలో చిత్తశుద్ధి తగ్గిందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అనేకానేక ఒత్తిళ్లమధ్య పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జనాభా లెక్కల బాధ్యతలంటే అదనపు తలనొప్పే. ఆ ప్రభావం సేకరణమీదా పడే ప్రమాదం ఉంది. చాంతాడంత ప్రశ్నావళి ఉండటంవల్ల జనం జవాబు చెప్పకుండా తప్పించుకునే అవకాశం ఉందనీ ప్రశ్నల్ని సంక్షిప్తం చేస్తే మంచిదని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నిజమే, ఏకంగా ముప్ఫైనాలుగు ప్రశ్నలంటే ఎవరికైనా కష్టమే? వందేళ్ల నాటి జనాభా సేకరణ పద్ధతులు ఆధునిక సమాజం అవసరాలు తీర్చలేకపోతున్నాయనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 'జనగణన అంటే దేశంలోని ప్రజలందర్నీ లెక్కబెట్టడం ఒక్కటే కాదు. వందకోట్ల ప్రజల నైపుణ్యాల్నీ ఆలోచనల్నీ సమ్మిళితం చేసే సమగ్ర నివేదికలా ఉండాలి. జనాభా లెక్కల సేకరణ మట్టిలోని మాణిక్యాల్ని వెలికితీసే కార్యక్రమం ఎందుకు కాకూడదు?' అని ప్రశ్నిస్తారు సమాజశాస్త్ర పరిశోధకుడు దినేష్‌ కులకర్ణి. ఆలోచించాల్సిన విషయమే.
ఎన్నో జ్ఞాపకాలు...
జనాభా లెక్కల ఎన్యూమరేటర్‌గానో, సూపర్‌వైజర్‌గానో పనిచేయడమంటే... కష్టమైన వ్యవహారమే. కాళ్లరిగేలా తిరగాలి. ఓపిగ్గా జవాబులు రాబట్టాలి. 'ఇవన్నీ మీకెందుకు?' అన్న అనుమానపు చూపుల్ని భరించాలి. గల్లీల్లో కుక్కలు కయ్యిమంటాయి. నడినెత్తిన సూరీడు వెుట్టికాయలేస్తుంటాడు. ఎంత కష్టం, ఎంత కష్టం! అదంతా తలుచుకుని, 'అయ్యబాబోయ్‌! జనాభా లెక్కల సేకరణా? నా వల్లకాదు' అని చేతులెత్తేస్తారు ప్రభుత్వ టీచరు ఊర్మిళ. జనాభా లెక్కలే కాదు, లెక్కల సేకరణలో ఎన్యూమరేటర్లకు ఎదురయ్యే అనుభవాలు కూడా... అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు అద్దంపడతాయి. అరవై, డెబ్భై దశకాల్లో గృహిణుల ద్వారా కుటుంబ వివరాలు రాబట్టేసరికి సిబ్బంది తలప్రాణం తోకకొచ్చేది. తమపేరు తాము చెప్పుకున్నా, శ్రీవారి నామధేయం చెప్పాల్సి వచ్చినప్పుడు తెగ సిగ్గుపడిపోయేవారు. భారతనారి తన నోటితోతాను కట్టుకున్న వెుగుడిపేరు ఎలా చెబుతుంది? పక్కింటివారో పొరుగింటివారో వచ్చి మాటసాయం చేయాల్సిందే! 'ఎంతమంది పిల్లలు?' అని అడిగినప్పుడు కూడా చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేసేవారు. ఆ సంఖ్య చెబితే, తమ కుటుంబానికి ఎక్కడ దిష్టితగులుతుందో అని భయం. ''డెబ్భై ఒకటిలో అనుకుంటా, ఓ మారుమూల గ్రామంలో జనాభా లెక్కల బాధ్యత నాకు అప్పగించారు. నానా తిప్పలూ పడి ఆ ఊరికి చేరుకున్నాను. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తుంటే...నలుగురు మనుషులొచ్చి అమాంతంగా వోసుకెళ్లి పోయారు. వాళ్లెవరో, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారో అస్సలు అర్థం కాలేదు. వెుత్తానికి ఓ పాతకాలం బంగళాలో కట్లు విప్పారు. ఎదురుగా ఓ బుర్రమీసాల పెద్దమనిషి. 'ముత్యాలముగ్గు'లో రావుగోపాల్రావులా ఉన్నాడు. 'ఏమయ్యా, ఆఫీసరూ! ఊళ్లోకి రాగానే ప్రెసిడెంటుగార్ని కలవాలని కూడా తెలియదా?' పక్కనే ఉన్న మునసబు కస్సుమన్నాడు. ఎదురుతిరిగి ఇంగ్లిష్‌లో చడామడా తిట్టేద్దామనిపించింది కానీ, చుట్టూ ఉన్న గూండాల్ని చూసి తగ్గిపోయాను. అన్యదా శరణం నాస్తి! తప్పయి పోయిందని లెంపలేసుకున్నాను. అంతే, ప్రెసిడెంటు చల్లబడిపోయాడు. 'ఈకాలం కుర్రాళ్లే అంత! బారెడు డిగ్రీలుంటాయికానీ, పిసరంత లోకజ్ఞానం ఉండదు' అంటూ హాయిగా నవ్వేశాడు. ఆరోజు అక్కడే భోజనం. నాకోసం స్పెషల్‌గా నాటుకోడి కూర చేయించాడు. పాతతరం మనుషుల మాట కటువు, మనసు వెన్న!''...రాయలసీమ జిల్లాలో జనాభాలెక్కల అనుభవాల్ని గుర్తుచేసుకుంటారు రిటైర్డ్‌ ఎన్జీవో వెంకటేశ్వర్రావు. అప్పట్లో 'బతికున్న పిల్లలెంతమంది?', 'మరణించిన పిల్లలు ఎంతమంది?' అన్న ప్రశ్న జనాభాసేకరణ సిబ్బందికి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. 'ఛిఛి అపశకునం మాటలూ నువ్వూనూ! దేవుడిదయవల్ల నా కడుపులో పుట్టిన బిడ్డలంతా క్షేమంగా ఉన్నారు. అడిగింది చాలు. దయచెయ్‌'... అంటూ చడామడా తిట్టిపంపించేవారు కడుపుచల్లని తల్లులు.

హైదరాబాద్‌ మహానగరంలో 2001 జనాభా లెక్కలు సేకరించిన ప్రభాకర్‌ కష్టాలు ఇంకోలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ కాలింగ్‌బెల్‌ నొక్కితే, ఓ మెరుపుతీగ తలుపు తీసింది. ఫలానా అని చెప్పగానే లోపలికి రమ్మంది. ఓ కుర్రాడు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. భార్యాభర్తలేవో అనుకున్నాడు ప్రభాకర్‌. కాదట! పెళ్లయిందా అంటే, లేదని చెప్పింది. 'మరి, ఒకే ఇంట్లో ఎలా ఉంటారు? కుటుంబ యజమానితో మీ సంబంధం ఏమిటి?' అంటే...'ఇక్కడెవరూ యజమానుల్లేరు. వాడూ నేనూ సహజీవనం చేస్తున్నాం. పెళ్లీపెటాకులూ మాకు గిట్టవు. ఇష్టం ఉంటే కలిసుంటాం. లేకపోతే విడిపోతాం' అని కుండ బద్దలుకొట్టింది. ఆ సమాచారాన్ని ఏ కాలమ్‌కింద రాయాలో తెలియక, వెుహంవేలాడేసుకుని వచ్చేశాడు మనవాడు. ఒకరిద్దరు 'గే'లతోనూ పెద్ద గోలయింది. 'ఆడ' దగ్గర రాస్తుంటే కాదన్నారు, 'మగ' దగ్గర నవోదు చేస్తుంటే తగదన్నారు. 'ఈసారి రెండూకానివారి కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్‌ పెట్టకపోతే మాకు మూడేట్టుంది'...అంటాడు ప్రభాకర్‌ ఆ అనుభవాన్ని తలుచుకుని. వైజాగ్‌ ప్రసాద్‌ను జనాభాలెక్కలే ఓ ఇంటివాణ్ని చేశాయి. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నప్పుడు, ఓ ముద్దుగుమ్మని చూసి మనసుపారేసుకున్నాడు. అమ్మాయి పుట్టినరోజుతో సహా వివరాలన్నీ చేతిలోనే ఉండటంతో, జాతకాలు చూపించి మరీ రంగంలో దిగాడు. అబ్బాయి అందగాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఏ పిల్లతండ్రి మాత్రం కాదంటాడు. అలా ఎన్యూమరేటర్‌గారు కాస్త అల్లుడుగారైపోయారు. ప్రసాద్‌ దంపతులు 2011 జనాభాకు మరో ఇద్దర్ని జోడించారు.

* * *
'మీ వయసు పాతికేళ్లే కదూ!
అంత కచ్చితంగా ఎలా చెప్పానంటారా?
పదేళ్లక్రితం జనాభాలెక్కలకు వచ్చినప్పుడు మీరే చెప్పారుగా!'
('టేకింగ్‌ ద సెన్సస్‌' అనే కవితా సంపుటిలో చార్లెస్‌ థాచర్‌ ఆనే ఐరిష్‌ కవి)
అంకెల భారతం
నగణన జరిగే ఏడాదిలో ఏదో ఒక రోజును విభజన రేఖగా తీసుకుంటారు. సాధారణంగా ఆ నెల ఒకటో తేదీ విభజన తేదీగా ఉంటుంది. ఆతర్వాత జరిగే చావుపుట్టుకలు ఆ దశాబ్దపు జనాభాలెక్కల్లో చేరవు.
* చాలాదేశాల్లో 'సున్నా'తో ముగిసే సంవత్సరంలో జనాభాలెక్కలు సేకరిస్తారు. మనదేశంలో మాత్రం '1'తో ముగిసే ఏడాది లెక్కల జాతర జరుగుతుంది.
* 1931లో ఒరిస్సా విభజన జనాభా లెక్కల ఆధారంగానే జరిగింది. ఆతర్వాత మళ్లీ 1951లో, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు కూడా జనాభా లెక్కలే ప్రాతిపదిక అయ్యాయి.
* 1961 జనాభా లెక్కలకు ఓ ప్రత్యేకత ఉంది. పండగలు, జాతరలు, సంప్రదాయాలు తదితర సాంస్కృతిక అంశాల్ని కూడా సేకరించారు.
* జనాభాతోపాటు జనాభా లెక్కల సిబ్బంది సంఖ్యా పెరుగుతూనే ఉంది. 1951 జనాభా లెక్కల సేకరణలో ఆరులక్షల మంది పాల్గొన్నారు. 1961 లెక్కల్లో పది లక్షలమంది పాల్గొన్నారు. 1991నాటికి ఆ సంఖ్య ఇరవై లక్షలకు చేరింది. ఈసారి పాతికలక్షల సిబ్బంది రంగంలో దిగుతున్నారు.
* 1961 జనాభాలెక్కల సేకరణ సమయంలో సూపర్‌వైజర్లకు బ్లాకుకు నాలుగు రూపాయల చొప్పున పారితోషికం ఇచ్చారు. ఎన్యూమరేటర్లకు వెుత్తం పనికి ఇరవై రూపాయలు ముట్టజెప్పారు. 2001 నాటికి సూపర్‌వైజర్ల పారితోషికం పదిహేనువందలు, ఎన్యూమరేటర్ల పారితోషికం ఏడువందలు.
* 1991 జనాభా లెక్కల కోసం ఏడువేల మెట్రిక్‌టన్నుల కాగితాన్ని వాడారు.
* అంతరించిపోతున్న తెగల గురించి అడుగంటిపోతున్న భాషల గురించి తెలుసుకోడానికి జనాభాలెక్కలకు మించిన ఆధారం లేదు. తొలిరోజుల్లో జనగణన కార్యక్రమానికి సారథ్యం వహించిన తెల్లదొరలంతా ఆంథ్రోపాలజిస్టులే.
* జనాభాలెక్కల సిబ్బంది ఇంటింటికీ వెళ్లినా, అసలు ఇళ్లే లేనివారిని కూడా పలకరించినా...వివిధ కారణాలవల్ల 1.5 శాతం ప్రజలు లెక్కలోకి రాకుండా మిగిలిపోతున్నారని అంచనా.
* 1981 జనాభా లెక్కల నాటికి అసోంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపులో లేదు. 1991నాటికి కాశ్మీర్‌ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్ని పాక్షికంగా మినహాయించారు. 2001లో భూకంపం కారణంగా గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతంలో లెక్కలు తీసుకోలేదు. 2011 జనాభా లెక్కలకు ఎలాంటి విఘ్నాలూ రాకూడదని కోరుకుందాం!