Monday, April 12, 2010

యులిప్‌లు.. బీమా పథకాలు కావు

అవి మ్యూచువల్‌ ఫండ్‌ స్కీముల వంటివే
ఇకపై ప్రకటనలు, ప్రచారం చేయొద్దు
14 బీమా సంస్థలపై సెబీ కొరడా
ఫండ్‌ పథకాలు కావవి.. బీమా స్కీములే
మీ అనుమతి మాకు అక్కర్లేదు: బీమా కంపెనీలు
రేపు ముంబయిలో సమావేశం!
ముంబయి: జీవిత బీమా కంపెనీలు యులిప్‌ పథకాల ద్వారా బీమా పాలసీదార్ల నుంచి నిధులు వసూలు చేయడాన్ని నిలిపివేస్తూ స్టాక్‌ మార్కెట్‌ వ్యవహారాల నియంత్రణ సంస్థ సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయని సెబీ సభ్యుడు ప్రశాంత్‌ శారన్‌ పేర్కొన్నారు. జీవిత బీమా కంపెనీలు విక్రయిస్తున్న యులిప్‌ పథకాలు మ్యూచువల్‌ ఫండ్‌లను పోలి ఉన్నాయి కాబట్టి ఫండ్‌లకు వర్తించే నిబంధనల ప్రకారం ఆయా జీవిత బీమా కంపెనీలు సెబీ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జీవిత బీమా కంపెనీలు అటువంటి అనుమతి తీసుకోలేదు కాబట్టి, యులిప్‌ల కింద నిధుల వసూలు తక్షణం నిలిపివేయాలని , దీనికి సంబంధించిన ఆఫర్‌ డాక్యుమెంట్లు ప్రచురించడం, ప్రకటనలు ఇవ్వడం, ప్రచారం సాగించడం కూడదని సెబీ పేర్కొంది. ఎల్‌ఐసీ మినహా 14 జీవిత బీమా కంపెనీలకు సెబీ ఉత్తర్వులిచ్చింది. తాజా ఉత్తర్వులతో దిగ్భ్రాంతి చెందిన బీమా కంపెనీలు సెబీని, ఐఆర్‌డీఏను కలిసి తమ అభిప్రాయాలు విన్నవించే పనిలో నిమగ్నమయ్యాయి. జీవిత బీమా కంపెనీల ప్రాతినిధ్య సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ జనరల్‌ ఎస్‌.బి.మాథుర్‌ స్పందిస్తూ సెబీ ఉత్తర్వుల నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితులపై సంబంధిత రెగ్యులేటర్లతో మాట్లాడతామని తెలిపారు. సోమవారం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సారథ్యంలో బీమా కంపెనీలన్నీ ముంబయిలో సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జనవరిలోనే నోటీసులు: యులిప్‌ పథకాలు కేవలం బీమా పథకాలే అనే బీమా కంపెనీల వాదనను సెబీ తిరస్కరించింది. ఐఆర్‌డీఏ వద్ద అనుమతి తీసుకుని యులిప్‌లు జారీ చేస్తున్నామని, ఇవి బీమా పథకాలు కాబట్టి సెబీ అనుమతి అవసరం లేదని బీమా కంపెనీలు పేర్కొన్నాయి. కానీ ఈ పథకాల్లో జీవిత బీమా పాలు కంటే మ్యూచువల్‌ ఫండ్‌ పద్ధతిలో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మొత్తమే ఎక్కువగా ఉన్నట్లు సెబీ స్పష్టం చేసింది. అందువల్ల సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్‌ ఫండ్‌లకు మాదిరిగా జీవిత బీమా కంపెనీలు కూడా యులిప్‌లకు ముందస్తుగా తన వద్ద అనుమతి తీసుకోవాలని సెబీ వివరించింది. ఈ ఏడాది జనవరిలో ఆయా బీమా కంపెనీలకు యులిప్‌ల విషయంలో సెబీ నోటీసులు అందాయి. అప్పుడే ఈ కంపెనీలు ఐఆర్‌డీఏను సంప్రదించాయి. ఐఆర్‌డీఏ మాత్రం యులిప్‌లు ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నాయని, అవి బీమా పధకాలనే అప్పట్లో అభిప్రాయపడింది. ఈ అంశం రెగ్యులేటర్ల సహకార సంస్థ హై లెవల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ముందు కూడా ప్రస్తావనకు వచ్చింది. సెబీ, ఐఆర్‌డీఏ పరస్పరం దీన్ని పరిష్కరించుకోవాలని ఈ కమిటీ స్పష్టం చేసింది.

సెబీ ఏమంటోందంటే..: యులిప్‌లు పూర్తిగా బీమా పథకాలు కావని, ఇందులో 'స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడి' వాటా కూడా ఉన్నట్లు, పైగా ఒక్కో పాలసీదారుడు చెల్లించే మొత్తం బీమా ప్రీమియం మొత్తం కంటే మార్కెట్లో పెట్టుబడికి కేటాయించే మొత్తమే అధికంగా ఉంటోందని అందువల్ల వీటిని మ్యూచువల్‌ ఫండ్‌లుగా పరిగణించాలని సెబీ వాదిస్తోంది. ప్రధానంగా ఇవి బీమా పాలసీలని, బీమా వ్యవహారాలు సెబీ పరిధిలోకి రావనేది బీమా కంపెనీల వాదన. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పటికిప్పుడే సర్దుకునేట్లు లేదు. ఒకవేళ సెబీ ఆదేశాల ప్రకారం యులిప్‌ పథకాల కింద నిధులు వసూలు చేయలేని స్థితిని బీమా కంపెనీలు ఎదుర్కొంటే, అది వాటికి తీవ్ర నష్టదాయకంగా మారుతుంది. బీమా కంపెనీలు వసూలు చేసే ప్రీమియం ఆదాయంలో ఇప్పుడు యులిప్‌ల వాటా ఎంతో అధికంగా ఉంటోంది. అన్ని పథకాల కింద వసూలయ్యే మొత్తంలో యులిప్‌ల ఆదాయమే సగం కంటే ఎక్కువగా ఉంటుందనేది విస్పష్టం. అంతగా వీటికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిస్థితి ఏమిటంటే... యులిప్‌లను కొనసాగించాలంటే బీమా కంపెనీలు సెబీ వద్ద అనుమతి తీసుకోవాలి. ఒక రంగంలోని కంపెనీలపై రెండు నియంత్రణ సంస్థల పర్యవేక్షణ అంటే... అదీ ఇబ్బందికరమే. నిలకడమీదగానీ ఇది తేలేటట్లు లేదు.

యులిప్‌ల విక్రయం ఆపొద్దు
బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ ఆదేశాలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సెబీ ఉత్తర్వులపై బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) తిరగబడింది. యులిప్‌ల విక్రయాలను ఏమాత్రం ఆపనక్కర్లేదని, యథావిధిగా వాటి వ్యాపారాన్ని కొనసాగించవచ్చని సూచిస్తూ సంబంధిత 14 బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ శనివారం రాత్రి పొద్దుపోయాక ఆదేశాలు జారీ చేసింది. బీమా చట్టం-1938 కింద యులిప్‌లను ఆఫర్‌ చేయడమే కాకుండా, మార్కెటింగ్‌, సర్వీసింగ్‌లను మునుపటి మాదిరిగానే నిర్వహించుకోవచ్చని ఛైర్మన్‌ హరినారాయణ్‌ సంతకంతో కూడిన ఉత్తర్వులను ఐఆర్‌డీఐ వెలువరించింది. అంతక్రితం యులిప్‌ పథకాలు క్షేమకరమేనని, వీటికి ఎటువంటి ఇబ్బందీ లేదని ఐఆర్‌డీఏ స్పష్టం చేసింది. సెబీ ఆదేశాలపై చట్టంలోని నిబంధనల ప్రకారం తగిన వేదికల మీద ప్రస్తావిస్తామని తెలిపారు. వాస్తవానికి సెబీ ఆదేశాలపై సంబంధిత బీమా కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందనేది ఐఆర్‌డీఏ ఉద్దేశంగా ఉంది.
సెబీ నిషేధించిన బీమా కంపెనీలు
* ఏగాన్‌ రెలిగేర్‌
* అవీవా లైఫ్‌ ఇన్సూరెన్స్‌
* బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
* భారతీ యాక్సా లైఫ్‌
* బిర్లా సన్‌లైఫ్‌
* హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌
* ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
* ఐఎన్‌జీ వైశ్యా
* కోటక్‌ మహీంద్రా
* టాటా ఏఐజీ
* మ్యాక్స్‌ న్యూయార్క్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
* మెట్‌లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌
* రిలయన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
* ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌