Thursday, April 1, 2010

భారతికి భారం కాదు: మిట్టల్

న్యూఢిల్లీ :కువైట్‌కు చెందిన జియాన్ ఆఫ్రికన్ వ్యాపారాలు కొనుగోలు చేయడానికి తాము చెల్లించిన 1070 కోట్ల డాలర్ల ధర హేతుబద్ధమైనదేనని భారతి ఎయిర్‌టెల్ ప్రకటించింది. కాగా ఈ డీల్ ద్వారా తాము 330 కోట్ల డాలర్లు ఆదాయం పొందుతామని జియాన్ టెలికాం ప్రకటించింది.


సూడాన్, మొరాకో తప్పించి ఇతర ఆఫ్రికా దేశాలకు చెందిన వ్యాపారాలన్నింటినీ భారతి ఎయిర్‌టెల్‌కు విక్రయించినట్టు జియాన్ టెలికాం కువైట్ స్టాక్ ఎక్స్ఛేంజికి తెలియచేసింది. ఈ డీల్‌లో తాము చెల్లించిన ధర హేతుబద్ధమైనదేనని, తాము మీద వేసుకున్న రుణభారం కూడా అంత భయపడాల్సినంత పెద్దదేమీ కాదని భారతి ఎయిర్‌టెల్ ప్రమోటర్, చైర్మన్ సునీల్ మిట్టల్ మంగళవారం రాత్రి ఆమ్‌స్టర్‌డామ్‌లో ఈ డీల్‌పై సంతకం చేసిన అనంతరం వ్యాఖ్యానించారు.

ఈ డీల్‌తో జనాభాలో సేవల విస్తరణపరంగా భారతి ఎయిర్‌టెల్ ప్రపంచంలో రెండో పెద్ద ఆపరేటర్‌గాను, సబ్‌స్క్రయిబర్లపరంగా ఐదో ఆపరేటర్‌గాను నిలుస్తుంది. . ఈ డీల్ కుదరడానికి తగు సహకారం అందించినందుకు తమ భాగస్వామి సింగ్‌టెల్‌కు సునీల్ మిట్టల్ కృతజ్ఞతలు తెలిపారు. భారత స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్ అయిన భారతి ఎయిర్‌టెల్‌లో 31 శాతం వాటాలతో సింగ్‌టెల్ కో ప్రమోటర్‌గా ఉంది.

వాటాదారులకు జియాన్ డివిడెండు
తమ ఆఫ్రికన్ ఆస్తులు కొనుగోలు చేసినందుకు భారతి ఎంటర్‌ప్రైజెస్ ఏకమొత్తంగా చెల్లిస్తున్న మొత్తంలో 400 కోట్ల డాలర్లు రుణాల చెల్లింపునకు పోను మిగతా మొత్తాన్ని వాటాదారులకు డివిడెండుగా పంపిణీ చేయనున్నట్టు జియాన్ ప్రకటించింది. గత ఐదేళ్ళుగా తాము షేర్‌హోల్డర్లకు అందచేసిన విలువకు ఈ డీల్ దర్పణం పడుతుందని జియాన్ గ్రూప్ చైర్మన్ అసాద్ అల్ బన్వాన్ వ్యాఖ్యానించారు.

అందరికీ మార్గదర్శి : ఖుర్షీద్
భారతి ఎయిర్‌టెల్ తరహాలో మరిన్ని భారతీయ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. మొదట కొంత ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి భారతి ఈ డీల్ సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రతీ భారతీయ కంపెనీ దీన్ని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు.