రూ.17,000 కోట్ల సమీకరణ!
షేరు ధర 7% పైగా పతనం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో పెట్టుబడి ఉపసంహరణ ప్రతిపాదనకు కేంద్రం గురువారం ఆమోదం తెలిపింది. ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపిన ప్రకారం.. ఈ కంపెనీలో 10 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించడంతో పాటు మరో 10 శాతం కొత్త ఈక్విటీ షేర్లను ప్రజలకు జారీ చేయడం ద్వారా నిధులను సమీకరించనున్నారు. రెండు విడతలుగా ఈ ఉపసంహరణ జరుగుతుందని, ప్రతి దఫాలో 5 శాతం ప్రభుత్వ ఈక్విటీ అమ్మకం, మరో 5 శాతం ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ (ఎఫ్‌పీఓ) కలసి ఉంటుందని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చెప్పారు. సీసీఈఏ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు విడతలు పూర్తి అయ్యాక సెయిల్‌లో ప్రభుత్వ వాటా ఇపుడు ఉన్న 85.82 శాతం నుంచి 69 శాతానికి పరిమితం అవుతుందని, ప్రజల చేతిలో 31 శాతం వాటాలు ఉంటాయని చిదంబరం తెలిపారు. కాగా ఉక్కు శాఖ మంత్రి వీరభద్ర సింగ్ మాట్లాడుతూ సెయిల్ ఎఫ్‌పీఓల నుంచి సుమారు రూ.17,000 కోట్ల నిధులను సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సెయిల్ విస్తరణ, నవీకరణలకు మొత్తం రూ.70,000 కోట్లు అవుతుందన్నారు. రెండు విడతల ఎఫ్‌పీఓలకు మధ్య ఎంత ఎడం ఉంటుందని అడగగా, సాధికార సంఘం త్వరలోనే విషయాన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి బదులిచ్చారు. చాలా వరకు సన్నాహక కసరత్తు ఈసరికే ముగిసినందువల్ల మహా అయితే ఒక నెల లోపే ఆ నిర్ణయం వెలువడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సెయిల్ ఉద్యోగులకు కూడా ఎఫ్‌పీఓలో పాలు పంచుకొనే అవకాశం ఇస్తామని మంత్రి తెలిపారు. * ప్రస్తుతం ప్రజల వద్ద 14.2 శాతం సెయిల్ వాటాలు ఉన్నాయి.
* బీఎస్‌ఈలో గురువారం సెయిల్ షేరు ధర రూ.236.75 వద్ద ముగిసింది. ఇది అంత క్రితం ముగింపు ధర కన్నా 7.18 శాతం తక్కువ కావడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలోనూ ఈ షేరు ధర 7.11 శాతం పతనమై, రూ.237 వద్ద స్థిరపడింది.
* సెయిల్ తన వార్షిక ఉత్పాదక సామర్థ్యాన్ని ఇపుడు ఉన్న 13.82 మిలియన్ టన్నుల నుంచి 23.46 మి. టన్నులకు పెంచుకోవడానికి రూ.70,000 కోట్లతో విస్తరణ ప్రక్రియను చేపడుతోంది.
* ఇతర సీపీఎస్‌ఈలైన కోల్ ఇండియా లిమిటెడ్, ఎంఎంటీసీ, ఇంజినీర్స్ ఇండియాల వంటివి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి.
సెయిల్ విశిష్టత ఇదీ
* మన దేశంలో అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ సెయిల్. కంపెనీ మొత్తం వ్యాపారం (టర్నోవర్) సుమారు రూ.48,681 కోట్లుగా ఉంది.
* గత డిసెంబరు 31తో ముగిసిన తొమ్మిది నెలలకు రూ.4,669.47 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ నికర లాభం రూ.4,688.13 కోట్లు.
* 2008-09లో ఈ కంపెనీ తన విస్తరణ కార్యక్రమాలపై రూ.5,233 కోట్లు ఖర్చు పెట్టింది.