Thursday, April 15, 2010

మైనింగ్ కంపెనీల్లో నిర్వాసితులకు వాటా ప్రభుత్వ ప్రతిపాదన: కుదరదంటున్న మైనింగ్ సంస్థలు

మైనింగ్ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే పేదలకు బడా మైనింగ్ కంపెనీలు షేర్లు ఇవ్వాలన్నది ప్రభుత్వం ప్రతిపాదన. విలువైన ఖనిజ వనరుల నిక్షేపాలున్న పేదల భూములను సొంతం చేసుకోవడానికి ఆబగా ఎదురుచూస్తున్న కార్పొరేట్ కామందులు మాత్రం ఇలాంటి ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేస్తున్నారు. లాభాలను పంచడానికి ఏమాత్రం సిద్ధంగాలేమని తెగేసి చెబుతున్నారు.

మైనింగ్ రంగం ఇప్పుడు ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. విలువైన ఖనిజవనరులున్న నిరుపేదలు, గిరిజనుల భూములను స్వాధీనం చేసుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ఆనందిస్తున్న సర్కారుకు తాజా పరిణామాలు నిద్రపట్టడం లేదు. ప్రజల నుంచి ప్రజాస్వామిక సంస్థల నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వ నేతలు ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చారు.

ఈ ప్రతిపాదన ప్రకారం భవిష్యత్‌లో మైనింగ్ కార్యకలాపాల కారణంగా భూములు కోల్పోతున్న పేదలకు మైనింగ్ కంపెనీలు తమ కంపెనీలో వాటాలను కేటాయించాలి. అంటే మైనింగ్ కంపెనీల్లో నిర్వాసితులను కూడా భాగస్వాములుగా చేర్చుకోవాలన్నమాట. వేదాంత రీసోర్సెస్, ఆర్సెలర్ మిట్టల్ వంటి సంస్థలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మైనింగ్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఎఫ్ఐఎంఐ ఈ తరహా ప్రతిపాదనలు మైనింగ్ కంపెనీల పాలిట మరణశాసనమని ప్రకటించింది. భూములు కోల్పోయిన వారికి వాటాలు ఇస్తూ పోతే మైనింగ్ వ్యాపారం కడుభారంగా తయారై లాభాలు ఆర్చుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రతిపాదన చర్చకు కూడా రాకుండానే మైనింగ్ కంపెనీలు తీవ్ర వ్యతిరేకతను ప్రకటిస్తున్నాయి.

ఈ ప్రతిపాదన వాస్తవానికి మైనింగ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తయారు చేస్తున్న గనులు, ఖనిజ వనరుల అభివృద్ధి నియంత్రణ చట్టం ముసాయిదాలో చేర్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం భవిష్యత్‌లో మైనింగ్ కోసం భూములలీజు పొందిన సంస్థలు, ప్రమోటర్ల కోటా ద్వారా భూములు కోల్పోయే వారికి కంపెనీలో 26 శాతం మేర వాటాలను ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది.

నేరుగా మాతృసంస్థలో వాటాలు ఇవ్వకపోయినా మైనింగ్ లీజు పొందిన అనుబంధ కంపెనీలో ఈ షేర్ల కేటాయింపు జరపాల్సి ఉంటుంది. ఒక వేళ మైనింగ్ లీజు పేరెంట్ కంపెనీ పేరిట ఉన్నా లేక మైనింగ్ లీజును సంస్థలకు కాకుండా వ్యక్తులకు కేటాయించినా.. వచ్చే లాభంలో సదరు సంస్థలు లేదా వ్యక్తులు 30 ఏళ ్లపాటు 26 శాతం లాభాన్ని భూమిని కోల్పోయినవారికి పంచాలి.

షేర్లు కావాలా, లాభాల్లో వాటా కావాలా అన్న విషయం తేల్చుకునే హక్కు భూమిని కోల్పోయిన వారికి ఉంటుంది. షేర్లు, లాభాల్లో వాటాలు కాకుండా నిర్వాసితులకు మైనింగ్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలన్న షరతు కూడా ముసాయిదా చట్టంలో చేర్చారు. ప్రభుత్వ షరతులు మైనింగ్ కంపెనీలకు మరణ శాసనం వంటివని మైనింగ్ సంస్థల సంఘం ఫిమి వ్యాఖ్యానించింది.

26 శాతం షేర్లు, ఉద్యోగాలు, ఇతర సహాయాలు... మైనింగ్ కంపెనీలకు తలకు మించిన భారమని స్పష్టం చేసింది. ఖనిజాలు, లోహాల మార్కెట్ ఎప్పుడూ స్థిరంగా ఉండదని ఫిమి పేర్కొంది. కంపెనీలు స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతను చేపట్టాలి తప్ప చట్టాలతో రుద్దడం సరికాదని ఫిమి పేర్కొంది. ఇలాంటి షరతులు పెడితే చట్టవ్యతిరేక మైనింగ్ కార్యకలాపాలు ఊందుకుంటాయని కూడా హెచ్చరించింది.

అయితే పరిశ్రమకు చెందిన నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే భూ సేకరణ సులభం అవుతుందని అంటున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. మార్కెట్ ఆటుపోట్ల గురించి మైనింగ్ కంపెనీలు భయపడాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. లాభాలు వచ్చినప్పుడు మాత్రమే పంచాలని అంటున్నారు తప్ప నష్టాలు వచ్చినా ఎంతో కొంత సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేయడం లేదు కదా.. అని వారు ప్రశ్నిస్తున్నారు.