Thursday, April 8, 2010

బ్రహ్మణీ స్టీల్స్... ఫర్ సేల్?

రంగంలో జిందాల్ గ్రూప్
మెజారిటీ వాటానా..ఏక మొత్తం కొనుగోలా?

కడప జిల్లాలో ఓ పెద్ద ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం... 18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తాం. జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని చూపించడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తాం... ఇలాంటి అట్టహాసపు కబుర్లతో వేల ఎకరాలప్రభుత్వ స్థలాన్ని కారుచౌకరేట్లకు కొట్టేశారు. పోటీదారులను ఒక్కదెబ్బతో తప్పించి అత్యంత విలువైన ఇనుపఖనిజం గనులను సొంతం చేసుకున్నారు. మూడేళ్లయినా పనులు పూర్తికాలేదు. ఇప్పుడిక ఏకంగా అమ్ముకుని కోట్ల రూపాయల సొమ్ము చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆన్‌లైన్ ( కడప-హైదరాబాద్ ): బ్రహ్మణీ స్టీల్స్ ఉక్కు కర్మాగారాన్ని బడా పారిశ్రామిక సంస్ధ జిందాల్ గ్రూప్‌నకు విక్రయించేందుకు గాలి జనార్దన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి రెండు వర్గాల మధ్య చర్చలు దాదాపుగా ముగిసాయని చెబుతున్నారు. వారం రోజుల్లోగానే ఒప్పంద పత్రాలపై సంతకాలు జరగవచ్చని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం నుంచి ఆటంకాలు ఎదురుకాకుండా కూడా బ్రహ్మణి యజమానులకు సన్నిహితులైన రాజకీయ నాయకులు పావులు కదపుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది.

బ్రహ్మణి స్టీల్స్‌లో మెజారిటీ వాటాను గాలిజనార్దన్‌రెడ్డి వర్గం ఆఫర్ చేస్తుండగా ఏకమొత్తంగా కంపెనీని కొనుగోలు చేయడానికే జిందాల్ గ్రూప్ ఇష్టపడుతున్నట్టు తెలిసింది. నిర్మాణంలో ఉన్న ప్లాంటు, దాని కోస కేటాయించిన భూములు, విమానాశ్రయం కోసం కేటాయించిన భూములు, ఇనుపఖనిజం గనులు..... వీటన్నింటికీ విలువ లెక్కగట్టి డబ్బులిస్తామని వాటాల ఊసెత్తవద్దని జిందాల్ గ్రూప్ అంటున్నట్లు తెలిసింది. వివాదాస్పద రాజకీయ, పారిశ్రామిక నేపథ్యం ఉన్న గాలి జనార్దన్‌రెడ్డితో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి జిందాల్ యజమానులు తటపటాయిస్తున్నారని అంటున్నారు.

అయితే 51 శాతం వాటాతో సరిపెట్టుకోవాల్సిందిగా గాలి జనార్దన్ రెడ్డి జిందాల్ యజమానులను కోరుతున్నట్లు తెలిసింది. జిందాల్ గ్రూప్‌నకు బళ్లారిలో ఇప్పటికే అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఉంది. కర్ణాటకలో వారికున్న వ్యాపారాల నేపథ్యంలో తన రాజకీయ పలుకుబడితో వారిని ఒప్పించేందుకు గాలి జనార్దన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. 49 శాతం వాటాతో బ్రహ్మణీలో సాగాలన్నది జనార్దన్ రెడ్డి అభిప్రాయంగా చెబుతున్నారు.

విలువ మదింపు పూర్తి ?
జిందాల్ ఉక్కు పరిశ్రమ ప్రతినిధుల బృందం ఇప్పటికే బ్రహ్మణీ స్టీల్స్ ప్లాంట్ సైట్‌కు వచ్చి పరిస్థితులను పరిశీలించింది. ఇంజనీరింగ్, అకౌంటింగ్ నిపుణులు ఇప్పటి వరకు జరిగిన పనుల విలువను మదింపువేశారని తెలిసింది. ఈ నెల 9న ఓఎంసీపై సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో బ్రహ్మణీ యాజమాన్యం ప్రస్తుతం తన దృష్టిని అటువైపు నిలిపింది. బహుశా 9 తర్వాత మళ్లీ రెండు గ్రూప్‌ల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

20వేల కోట్ల రూపాయల వ్యయంతో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 18 నెలల్లోనే బ్రహ్మణీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన గాలి కుటుంబం ప్రభుత్వం నుండి 10,670 ఎకరాల భూమిని, విమానాశ్రయం పేరుతో మరో 3,015 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి పొందింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పేరుతో ఓబులాపురం మైనింగ్ లీజుకూడా దక్కించుకున్నది. పోటీలో ముందున్నవారిని తోసిపుచ్చి మైనింగ్ లీజుతో 10,671 ఎకరాల భూమిని ఎకరా 18 వేల రూపాయల రేటుతోనూ, విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు 3,115 ఎకరాల స్థలాన్ని ఎకరా 25 వేల రేటుతోనూ బ్రహ్మణీ సొంతం చేసుకున్నది.

కంపెనీ పెట్టకుండానే భారీ లాభాలు
ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మణీ స్టీల్స్‌లో 51 శాతం వాటా ఇచ్చినా ఏకమొత్తంగా అమ్ముకున్నా బ్రహ్మణీ స్టీల్ యాజమాన్యానికి భారీ ఎత్తునే లాభాలు వస్తాయని అంటున్నారు. స్టీల్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాల్యూయేషన్స్ మళ్లీ పుంజుకున్నాయి. జిందాల్ స్టీల్‌కు బళ్లారిలో ఇప్పటికే భారీ ఉక్కు కంపెనీ ఉంది. 70 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ కర్మాగారాన్ని ఈ ఏడాది 7,000 కోట్ల రూపాయల వ్యయంతో కోటి టన్నులకు విస్తరిస్తున్నట్లు జిందాల్ గ్రూప్ ప్రకటించింది. స్టీల్ వ్యాపారంలో దూకుడుగా దూసుకుపోతున్న ఈ సంస్థ, ముడిఇనుము గనులతో సహా నిర్మాణంలో ఉన్న ప్లాంట్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని వదిలిపెట్టకపోవచ్చు.

ఆది నుంచి వివాదాలే
బ్రహ్మణీ యాజమాన్యానికి 18 వేల రూపాయల రేటుకే భూములు అప్పగించడం మొదట్లో వివాదానికి తెర లేసింది. అప్పట్లో ఈ స్థలాన్ని అసెంబ్లీ కమిటీ కూడా పరిశీలించి వెళ్లింది. రెండు టిఎంసిల నీటిని మైలవరం ప్రాజెక్టు నుంచి తీసుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా పైప్‌లైన్ పనులు చేపట్టడం మరోసారి వివాదానికి దారి తీసింది. బ్రహ్మణీ స్టీల్స్ చుట్టు మాత్రమే కాకుండా దాని యజమాని గాలి జనార్ధన్‌రెడ్డికి సంబంధించి కూడా ఓబులాపురం మైనింగ్ వ్యవహారం ఆదినుంచి వివాదాస్పదంగానే ఉంటున్నది.