కృష్ణా గోదావరి బేసిన్‌లోని డి-6 బ్లాక్‌లో సహజవాయువు సమృద్ధిగా ఉన్నప్పటికీ దానిని సరఫరా చేయడానికి తగిన స్థాయిలో గొట్టపు వ్యవస్థలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పేర్కొంది. ఈ కారణంగా డి-6 బ్లాక్‌లో సహజవాయువు ఉత్పత్తిని నిర్దేశిత స్థాయికి పెంచలేకపోతున్నామని ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.
డి-6 బ్లాక్ గరిష్ఠ గ్యాస్ ఉత్పత్తి సామర్ధ్యం 80ఎంసిఎండిలుకాగా రిలయన్స్ ప్రస్తుతం రోజుకు 63-64 ఎంసిఎంల గ్యాస్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను వినియోగ కంపెనీలకు తరలించేందుకు గొట్టపు వ్యవస్థ అందుబాటులో ఉండాలని, ప్రస్తుతానికి అది పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని ప్రసాద్ తెలిపారు.
డి-6 బ్లాక్ నుంచి గ్యాస్ ఉత్పత్తి మార్చి మాసాంతంనాటికి 82ఎంసిఎండిలకు చేరుకుంటుందని ఆయిల్ మంత్రిత్వశాఖ గత నవంబర్‌లో ప్రకటించింది. అయితే గ్యాస్ ఉత్పత్తి ఈ గరిష్ఠ స్థాయిని ఎప్పుడు చేరుకుంటుందన్న విషయాన్ని తాను చెప్పలేనని ప్రసాద్ పేర్కొన్నారు. గరిష్ఠ ఉత్పత్తి స్థాయిని గత డిసెంబర్‌లోనే ప్రయోగాత్మకంగా పరీక్షించాం, గ్యాస్‌ను తరలించేందుకు తగిన స్థాయిలో పైప్‌లైన్ లేదు, మిగతా విషయం మా చేతుల్లో లేదని ప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఆర్ఐఎల్ డి-6 బ్లాక్ నుంచి గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించి సరిగ్గా సంవత్సరమైంది. గత సంవత్సరం ఏప్రిల్ నెల మొదటి వారంలో ఈ బ్లాక్ నుంచి గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ గ్యాస్‌ను ప్రభుత్వం నిర్దేశించిన కంపెనీలకు విక్రయిస్తోంది. ఎరువులు, విద్యుత్, స్టీల్, ఆటోగ్యాస్ వంటి రంగాలకు 90 ఎంసిఎండిల గ్యాస్‌ను డి-6 బ్లాక్ నుంచి సాధికార మంత్రుల బృందం ఇప్పటికే ఖరారు చేసింది. అయితే ఈ విధంగా గ్యాస్ కేటాయింపు జరిగిన కంపెనీలు దానిని తీసుకునేందుకు అవసరమైన గొట్టపు వ్యవస్థ లేకపోవటంతో ఆర్ఐఎల్ తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్పత్తిని నియంత్రించుకోవాల్సి వచ్చింది.
ఆర్ఐఎల్‌కు చెందిన రెండు పెట్రో కెమికల్ ప్లాంట్లకు కేటాయించిన 1.918 ఎంపిఎండి గ్యాస్‌ను అవి వినియోగించుకుంటున్నాయని ప్రసాద్ తెలిపారు. రిలయన్స్‌కు చెందిన గుజరాత్‌లోని గాంధార్ ప్లాంట్‌కు 1.168 ఎంసిఎండిల గ్యాస్, మహారాష్ట్రలోని నాగోథానే ప్లాంట్‌కు 0.75 ఎంసిఎండిల గ్యాస్ అవసరం ఉంది.
రోజుకు 21,000 పీపాల ముడిచమురు
కేజీ బేసిన్ డి-6 బ్లాక్ నుంచి రోజుకు 21,000 బ్యారెళ్ల ముడిచమురును కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఈ బ్లాక్‌లో గరిష్ఠంగా రోజుకు 40,000 బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి చేయవచ్చునని అంచనా. ఈ బ్లాక్‌లో ఇంకా ఒకటి రెండు బావులను తవ్వాల్సి ఉంది, అయితే ఈ విషయంలో మేము తొందరపడటం లేదని ఆయన పేర్కొన్నారు. డి-6 బ్లాక్‌నుంచి వెలికితీసిన ముడిచమురును ప్రస్తుతం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, చెన్నై పెట్రోలియం కార్పిరేషన్ కు విక్రయిస్తోంది. -న్యూస్‌వైర్18