సెకనుకు అరపైసా
స్థానిక కాల్స్‌కు 'వర్జిన్' పథకం
హైదరాబాద్, ఆకర్షించే లక్ష్యంతో ప్రారంభమైన వర్జిన్ మొబైల్ కంపెనీ స్థానిక కాల్స్‌కు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇతర రాష్ట్రాలతో సహా ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీన్ని అమలు చేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెల రోజుల కాల పరిమితి కలిగిన రూ.45 లోకల్ ప్యాక్‌ను చందాదారులు ఎంచుకుంటే స్థానిక కాల్స్‌కు రెండు సెకన్లకు పైసా మాత్రమే వసూలు చేస్తారు. సెకను లేదా నిమిషం ప్రాతిపదికన బిల్లింగ్ (పల్స్ రేటు)లో దేన్ని ఎంచుకున్నా ఇదే టారిఫ్ వసూలు చేస్తారు.
7 నెలల్లో 70,000 వాహన అమ్మకాలు: మహీంద్రా హైదరాబాద్: ద్విచక్ర వాహన మార్కెట్లోనూ వాహన దిగ్గజ సంస్థ మహీంద్రా హవా కొనసాగుతోంది. మహీంద్రా 2-వీలర్స్ సంస్థ 2009-10 ఆర్థిక సంవత్సరానికి సుమారు 70,000 వాహన అమ్మకాలను జరిపింది. మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కేవలం ఏడు నెలల కాలంలోనే మహీంద్రా ఇంతటి స్థాయిలో అమ్మకాలు జరపడం విశేషం. డ్యూరో, రోడియో, ఫ్త్లెట్ పేరుతో మహీంద్రా ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. మార్చిలో సంస్థ 12,753 వాహనాలను అమ్మినట్లు మహీంద్రా తెలిపింది.
సంయుక్త రుణ బృందాలు మరో లక్ష: నాబార్డ్ ముంబయి: బ్యాంకు నుంచి పేద రైతులు రుణాలు పొందేందుకు వీలుగానే వారితో సంయుక్త రుణ బృందాలను (జేఎల్‌జీ) ఏర్పాటు చేస్తున్నట్లు నాబార్డ్ ఛైర్మన్ యూసీ సారంగి చెప్పారు. ఇప్పటికే 30,000 బృందాలను ఏర్పాటు చేయగా, మరో లక్ష బృందాలను ఈ ఆర్థిక సంవత్సరంలో నెలకొల్పుతామని ఆయన తెలిపారు. స్వయం సహాయక బృందాల మాదిరి ఈ బృందంలోనూ 7-10 మంది సభ్యులుంటారు. రైతులు విడిగా రుణం పొందడం కంటే, ఈ విధానంలో బ్యాంకును సంప్రదించడం సులభం అవుతుందని సారంగి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ఇచ్చిన రుణం రూ.54,772 కోట్లకు చేరింది.