విధానాల రూపకల్పనలో ఫ్యాప్సీ సలహాలు తీసుకుంటాం
ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడి
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలో ఫ్యాప్సీ, ఇతర వాణిజ్య మండళ్ల సలహాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. కొత్త పారిశ్రామిక విధాన (2010-15) రూపకల్పనలో ఫ్యాప్సీ సూచనలను, సలహాలను కోరారు. 92వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యాప్సీ ప్రకటించిన అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి విజేతలకు అవార్డులను అందజేసి, వారిని అభినందించారు. 'పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం కొనసాగుతుంది. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో కూడా రాష్ట్రం వృద్ధిరేటును కొనసాగించడానికి సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అండగా నిలిచింది. అధిక శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ.. వృద్ధిరేటు కొనసాగించడానికి పారిశ్రామిక రంగమే కీలకం. ఔషధ, ఐటీ, విత్తన తదితర పరిశ్రమలకు రాష్ట్రం రాజధానిగా ఉంద'ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. శ్రమాధారమైన చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూనే సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిశ్రమలను కూడా ప్రోత్సహించాల్సి ఉందని చెప్పారు. 'రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 12 శాతం వృద్ధిరేటును నమోదు చేయాలంటే.. విద్యుత్ వినియోగం 18 శాతం చొప్పున పెరుగుతుంది.
గిరాకీకి అనుగుణంగా సరఫరాను సమకూర్చుకోవడానికి భారీ ఎత్తున ప్రయివేటు పెట్టుబడులు అవసరం అవుతాయి. పారిశ్రామికవేత్తలకు అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంద'ని రోశయ్య అన్నారు. ఈ సంవత్సరం ఎక్స్‌లెన్స్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ విభాగంలో తులసి గ్రూపు సంస్థలకు చెందిన చైతన్య ప్యాకేజింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్‌కు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సిల్వర్ రోలింగ్ ట్రోఫీ అవార్డు లభించింది. దీనిని ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా తులసి గ్రూపు సంస్థల ఎండీ తులసి యోగీష్‌చంద్ర అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పించే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను రాష్ట్రంలో ప్రోత్సహించాలని ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) అధ్యక్షుడు కె.హరీశ్ చంద్ర ప్రసాద్ కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవసరమైన ముడిపదార్ధాలు రాష్ట్రంలో బాగా లభిస్తున్నందున రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వ మద్దతు లభిస్తే దేశానికి ఆహార పదార్ధాలు సరఫరా చేసే కర్మాగారంగా రాష్ట్రం అభివృద్ధి చెందగలదని చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానం కోసం ఫ్యాప్సీ సలహాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఎగుమతులు, పనితీరు, ఇతర విభాగాల్లో అవార్డులు ఇచ్చినట్లు అవార్డుల కమిటీ ఛైర్మన్ అట్లూరి సుబ్బారావు తెలిపారు. 18 అవార్డులకు 70 మంది పోటీ పడినట్లు చెప్పారు. అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ వి.ఎస్.రాజు, సెక్రటరీ జనరల్ ఎం.వి.రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.