Tuesday, April 6, 2010

మేము ఎప్పటికీ ఇండియన్స్‌మే!!

దేశంలో ప్రయివేటు రంగంలోని రెండు పెద్ద బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు తాము భారతీయ బ్యాంకులుగానే కొనసాగనున్నట్టు ప్రకటించాయి. తాము విదేశీ బ్యాంకు ముద్ర వేసుకోబోమని స్పష్టం చేశాయి. ఈ బ్యాంకుల్లో విదేశీ షేర్‌హోల్డింగ్ 51 శాతం దాటినందువల్ల కొత్త ఎఫ్‌డిఐ నిబంధనల ప్రకారం వాటి భారతీయత ప్రశ్నార్థకం అయిన నేపథ్యంలో ఈ స్పష్టీకరణ ఇచ్చాయి. ఈ రెండు బ్యాంకులతో పాటుగా ప్రయివేటు రంగంలోని యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐఎన్‌జి వైశ్య బ్యాంకు, డెవలపమెంట్ క్రెడిట్ బ్యాంకు కూడా ఈ నిబంధనకు ప్రభావితం అవుతాయి.

ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎఫ్‌డిఐ నిబంధనల ప్రకారం ఏ సంస్థలో అయినా ఎడిఆర్‌లు, జిడిఆర్‌లతో సహా విదేశీ ఈక్విటీ 51 శాతం దాటితే అవి భారతీయ కంపెనీలుగా గుర్తింపును కోల్పోతాయి. తమ బ్యాంకు ఎప్పటికీ భారత జాతీయత కలిగిన బ్యాంకులుగానే కొనసాగుతుందని ఐసిఐసిఐ బ్యాంకు ఎండి చందాకొచ్చార్ అన్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎండి ఆదిత్యపురి కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటిస్తూ అలాంటి సమస్యే తలెత్తదని, వోటింగ్ హక్కులు భారతీయుల చేతిలో ఉండి భారతీయులే సారథ్యం వహిస్తుండగా తమది విదేశీ బ్యాంకు ఎలా అవుతుందని ప్రశ్నించారు.