Thursday, April 15, 2010

ఐఎస్‌బీ చదువు భారమే

రూ.80,000 పెరిగిన బోధన రుసుము
వరుసగా రెండో ఏడాదీ పెంపు
మొత్తం ఖర్చు రూ.20.2 లక్షలు
ద్రవ్యోల్బణమే కారణమంటున్న స్కూలు
పెరుగుతున్న ధరల సెగ మేనేజ్‌మెంట్‌ విద్యకూ తాకింది. దేశంలోని ప్రముఖ నిర్వహణ విద్యా సంస్థలయిన ఐఐఎంల బాటలోనే హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) కూడా అడుగులు వేసింది. నిర్వహణ విద్యలో అందించే ఏడాది పీజీ ప్రోగ్రాం రుసుమును పెంచింది.
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
త ఏడాది బోధన, ప్రవేశ రుసుమును పది శాతం పెంచిన ఐఎస్‌బీ.. ఏడాది తిరగకుండా మరోసారి వాటిని సవరించింది. బోధన సిబ్బందికి వేతనాలు పెరగడం, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని నిర్వహణ విద్యా సంస్థలు రుసుమును పెంచుతున్నాయని, నాణ్యమైన విద్యను అందించాలంటే పరిస్థితులకు తగ్గట్లు రుసుము పెంచడం సహజమేనని ఐఎస్‌బీ ప్రొఫెసర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. 'రుసుమును ప్రత్యేకంగా ఏమీ పెంచలేదు. ద్రవ్యోల్బణ ప్రభావానికి అనుగుణంగా సవరించాం' అని ఐఎస్‌బీ డీన్‌ అజిత్‌ రంగ్నేకర్‌ తెలిపారు.

ఐఎస్‌బీ 2010-11 విద్యార్థులకు బోధన రుసుమును రూ.80 వేలు పెంచింది. గతంలో ఈ రుసుము రూ.14.5 లక్షలు ఉండగా.. దీన్ని రూ.15.3 లక్షలు చేసింది.

ట్యూషన్‌ ఫీజుతో పాటు రూ.2 లక్షల ప్రవేశ రుసుము చెల్లించాలి. దీనిలో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు.

ఐఎస్‌బీలో చదువుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ప్రాంగణంలోనే ఉండాలి. నివాసం, పుస్తకాలు, విద్యార్థుల అసోసియేషన్‌ రుసుము, ల్యాప్‌టాప్‌, భోజనానికి అయ్యే ఖర్చు తాజాగా రూ.2.9 లక్షలకు పెరిగింది. గత ఏడాది ఇది రూ.2.66 లక్షలుంది.

మొత్తంమీద ఐఎస్‌బీలో నిర్వహణ విద్యలో పీజీ పూర్తి చేయడానికి అయ్యే వ్యయం రూ.19.16 లక్షల నుంచి రూ.20.2 లక్షలకు చేరింది. ఇది 5.4 శాతం పెరుగుదలకు సమానం.

2009లో ట్యూషన్‌, ప్రవేశ రుసుము కలిపి రూ.1.5 లక్షలు పెంచారు. అంతక్రితం ఏడాది ఈ రెండూ రూ.15 లక్షలు ఉండగా.. 10 శాతం పెంచి రూ.16.5 లక్షలు చేశారు.

70% మంది రుణాలపైనే చదువుతారు
ఐఎస్‌బీలో విద్యను అభ్యసించడానికి వచ్చేవారిలో దాదాపు 70 శాతం మంది కోర్సు కోసం రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు బోధన రుసుము, నివాసం, పుస్తకాలు, భోజనం ఇతర ఖర్చులకు అయ్యే మొత్తం వ్యయంలో 95 శాతం వరకు రుణాలు ఇస్తున్నాయి. దాదాపు 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఐఎస్‌బీ విద్యార్థులకు రుణాలు అందిస్తున్న సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలతో పాటు క్రెడిలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఉన్నాయి.

100 ఉపకార వేతనాలు: ఆర్థికంగా వెనుకబడిన, తెలివైన విద్యార్థులకు ఐఎస్‌బీ దాదాపు 100 ఉపకార వేతనాలు ఇస్తోంది. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.3.5 లక్షల వరకు సాయం చేస్తోంది. కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఐఎస్‌బీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. హెచ్‌ఎస్‌బీసీ, నోవార్టిస్‌ గ్రూపు, సిటీ బ్యాంకులు వంటి కంపెనీలు విద్యార్థులకు సాయం చేస్తున్నాయి. ఐఎస్‌బీలో కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రవేశం ఉండదు. ఉద్యోగం చేస్తూ అనుభవం పొందిన వారే ఐఎస్‌బీలో నిర్వహణ కోర్సు చేయడానికి అర్హులు. విద్యార్థులు ఫీజును రెండు విడతలుగా చెల్లించే వెసులుబాటును కూడా ఐఎస్‌బీ కల్పిస్తోంది. 2010-11 ఏడాదికి కూడా గత ఏడాది స్థాయిలోనే దాదాపు 560 మంది ప్రవేశం పొందారు.

ఐఐఎంల మోత
ఆరో వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా పెరిగిన వ్యయాలను, ఇతర ఖర్చులను భర్తీ చేసుకోవడానికి ఒకటి రెండు మినహా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌ (ఐఐఎంలు) 2010-12 విద్యార్థులకు ఫీజులను పెంచాయి. ముందుగా ఫీజుల పెంపునకు బెంగళూరు ఐఐఎం శ్రీకారం చుట్టింది. మరికొన్ని ఐఐఎంలు ఇదే దోవన నడిచాయి. దేశంలో మొత్తం 7 ఐఐఎంలు- అహ్మదాబాద్‌, లక్నో, ఇండోర్‌, కోల్‌కతా, షిల్లాంగ్‌, బెంగళూరు, కోజికోడ్‌- ఉన్నాయి.