Thursday, April 15, 2010

తక్షణం కోర్టుకెళ్లండి ...సెబీ, ఐఆర్‌డీఏలకు ప్రభుత్వ సూచన

న్యూఢిల్లీ: యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌(యులిప్స్‌)లను ఎవరు నియంత్రిస్తారనే విషయంపై తక్షణం కోర్టుకెళ్లండని సెబీ, ఐఆర్‌డీఏలకు ప్రభుత్వం సూచించింది. అదే సమయంలో మంగళవారం సెబీ తాజా ఆదేశాల్లో ఎలాంటి తప్పూ కనిపించలేదని కూడా ఆర్థిక కార్యదర్శి అశోక్‌ చావ్లా బుధవారమిక్కడ పేర్కొన్నారు. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం సోమవారం ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ఇచ్చిన యథాపూర్వక స్థితి ఆదేశాలకు వ్యతిరేకంగా అది ఉందని భావించడం తెలిసిందే. 'త్వరగా అవి కోర్టుకెళితే మంచిదని మేం భావిస్తున్నాం. ప్రణబ్‌ చెప్పిన ప్రకారం సెబీ నిషేధం విధించిన తేదీకి ముందు యథాపూర్వక స్థితి కొనసాగుతుంది. అదే సెబీ కూడా చెప్పింద'ని చావ్లా ఇక్కడి విలేకర్లతో అన్నారు. శుక్రవారం రాత్రి14 బీమా కంపెనీలపై ప్రకటించిన నిషేధం కొత్త పథకాలకు కొనసాగుతుందని సెబీ తాజాగా ఆదేశించడం వివాదాన్ని కొత్త మలుపు తిప్పింది.

సెబీ తాజా ఆదేశాన్నీ పట్టించుకోకండి: అంతక్రితం ఆదేశం లాగే దీన్నీ పట్టించుకోనక్కర్లేదని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏ సూచించింది. సెబీ తాజా ఆదేశాలపై వ్యాఖ్యానించమని కోరినపుడు 'తాజాగా ఎలాంటి స్పష్టతా అక్కర్లేదు. అంతక్రితం ఏం చేశామో ఇప్పుడూ అదే చేస్తే మంచిద'ని ఐఆర్‌డీఏ ఛైర్మన్‌ జె. హరినారాయణ్‌ పీటీఐకి తెలిపారు. కాగా, ఐఆర్‌డీఏ జారీచేసే ఆదేశాల మేరకే కంపెనీలు ముందుకెళ్లనున్నాయని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ జనరల్‌ ఎస్‌.బి.మాథుర్‌ పీటీఐకి తెలిపారు.