Monday, April 19, 2010

రూ.వెయ్యి కోట్లు 'బూడిద'

ఐస్‌లాండ్‌లో వీడని మబ్బులు
విమానయాన రంగంపై కోలుకోలేని దెబ్బ
ఐరోపాలోనే 17వేల సర్వీసుల రద్దు
విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఇక్కట్లు
లండన్‌/ముంబయి: ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విమానయాన రంగం మరోసారి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఐరోపాదేశమైన ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఏర్పడిన బూడిద మబ్బులు విమానయాన రంగాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఒక్క ఐరోపాలోనే శనివారం సుమారు 17వేల సర్వీసులు నిలిచిపోయాయి. ఐరోపాయేతర దేశాల్లోనూ వందలాది సర్వీసులు రద్దయ్యాయి. దీంతో రోజుకి రూ.వెయ్యి కోట్ల నష్టం ఉంటుందని అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) చెబుతోంది. రోజులు పెరిగే కొద్దీ నష్టం తీవ్రత పెరిగే అవకాశం ఉంది. లుఫ్తాన్సా, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ బెర్లిన్‌, ఎయిర్‌ ఫ్రాన్స్‌-కేఎల్‌ఎం, ఇబెరియా, రియనార్‌ షేర్లు శుక్రవారమే ఒడుదొడుకులకు లోనయ్యాయి. మొత్తంగా చూస్తే వీటి విలువ.. 1.4 నుంచి 3.0 శాతం మధ్యలో క్షీణించింది. ఐరోపా దేశాల నుంచి భారత్‌సహా పలు దేశాలకు గగనతల రవాణా కూడా నిలిచిపోయింది. మరో ఐదురోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జర్మనీలోని 16 అంతర్జాతీయ విమానాశ్రయాలు దాదాపుగా మూసివేశారు. తొలుత 6 నుంచి 11 కిలోమీటర్లు ఎత్తులో వ్యాపించిన బూడిద ప్రస్తుతం 5 నుంచి 8 కిలోమీటర్లకు తగ్గుముఖం పట్టింది. అగ్నిపర్వతం నుంచి వెలువడే బూడిద తగ్గుముఖం పట్టినా పరిస్థితిలో మార్పులేదని అగ్నిపర్వతాల అధ్యయనవేత్త ఒకరు తెలిపారు. ''9/11 దాడుల తర్వాత ఐరోపా దేశాలకు మళ్లీ అంతటి క్లిష్ట పరిస్థితి ఎదురయింది. గగనతలంలో అవాంతరాలు శనివారం పూర్తిగా ఉండే అవకాశం ఉంది. అందుకే సర్వీసులు రద్దుచేశాం'' అని బ్రిటన్‌ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతం. సర్వీసులు రద్దవడంతో ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో దేశీయ, విదేశీ ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గగనతలం మూసివేత:ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రిటన్‌, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌, హంగేరీ, ఇటలీ, నెదర్లాండ్‌, రొమేనియా, స్లోవేకియా, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌లు శనివారం తమ గగనతలాన్ని మూసివేశాయి. ఆదివారం కూడా తమ సర్వీసులు నిలిపివేశాయి.

ప్రముఖలకు తప్పని పాట్లు:పోలండ్‌ రాష్ట్రపతి సంస్మరణ సభకు ఆదివారం అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వెళ్లాల్సి ఉంది. ఈ ప్రయాణం అనిశ్చితిలో పడింది. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజిలో మోర్కెల్‌ వాషింగ్టన్‌ నుంచి బెర్లిన్‌ రావాల్సి ఉండగా ఆమె ప్రయాణించే విమానాన్ని లిస్బన్‌కు మళ్లించారు.

సోమవారమూ రద్దే.. ఎయిర్‌ ఇండియా:పశ్చిమదేశాల మీదుగా ఐరోపా వెళ్లే సర్వీసుల్ని సోమవారం కూడా రద్దు చేసినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.