Friday, April 9, 2010

బొమ్మల అమ్మకంలోకి రిలయన్స్‌ రిటైల్‌

ముంబయిలో తొలి స్టోర్‌ ప్రారంభం
ముంబయి: రానున్న ఏడేళ్లలో రూ.150 కోట్ల పెట్టుబడితో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 20 బొమ్మల దుకాణాలను ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ తెలిపింది. ముకేశ్‌ అంబానీకి చెందిన ఈ కంపెనీ బ్రిటన్‌లోని ప్రముఖ రిటైల్‌ సంస్థ హ్యామ్‌లేస్‌తో 2008లోనే వ్యాపార అవగాహన కుదుర్చుకొని, మొదటి స్టోర్‌ను గురువారమిక్కడ ప్రారంభించింది. తగిన స్థలం కోసం ఇన్నాళ్లుగా వేచి ఉన్నామని ఈ సందర్భంగా రిలయన్స్‌ రిటైల్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (లైఫ్‌స్త్టెల్‌) బిజూ కురియన్‌ విలేకరులతో అన్నారు. తదుపరి స్టోర్‌ను ఆరు నెలల్లోపల చెన్నైలో ప్రారంభిస్తామని, మిగిలిన దుకాణాలను ఆరేళ్లలో ఏర్పాటు చేస్తామని వివరించారు. భారత దేశంలో వ్యవస్థీకృతమైన బొమ్మల మార్కెట్‌ విలువ సుమారు రూ.1,500 కోట్లు ఉంటుందని, ఇది మరింతగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని కురియన్‌ చెప్పారు. ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌ రిటైల్‌కు బొమ్మలను సరఫరా చేయడమే కాకుండా బొమ్మల విక్రయ కేంద్రాలను డిజైన్‌ చేయడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి వాటిలో హ్యామ్‌లేస్‌ సహాయపడుతుంది. స్థిర పెట్టుబడుల సంగతిని రిలయన్స్‌ రిటైల్‌ చూసుకొంటుంది. పది రూపాయల నుంచి రూ.25,000 వరకు ధరల్లో 5,000 రకాల బొమ్మలు ఈ స్టోర్‌లో లభిస్తాయి. హ్యామ్‌లేస్‌ బ్రాండ్‌ను 1760లో కార్నిష్‌మన్‌ విలియం హ్యామ్‌లే లండన్‌లో నెలకొల్పారు.