న్యూఢిల్లీ: పెళ్లి బాజాలు మోగడానికి కొన్ని రోజుల ముందు కూడా టెన్నిస్ స్టార్ సానియాకు ఇంకా తలనొప్పులు తప్పేట్టు లేవు. కాబోయే భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చిక్కుల్లో పడి చివరకు ఆయేషాకు తలాక్ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. బ్రాండింగ్‌కు పెట్టింది పేరైన ఈ టెన్నిస్ సంచలనం ఈ సంఘటనవల్ల బ్రాండ్ ఇమేజీ కాస్త తగ్గినట్లుంది. తాజాగా బోర్నవిటా తన కాంట్రాక్టును పునరుద్ధరించుకోబోవట్లేదని ప్రకటించడం గమనార్హం. 'ఏడాది గడువుతో కుదుర్చుకున్న మా ఒప్పందం గత నెలతో తీరిపోయింది. ఇక దాన్ని పునరుద్ధరించుకునే ఆలోచనేమీలేద'ని క్యాడ్‌బరీ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అయితే ఆ నిర్ణయం వెనుకనున్న కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. బ్రాండ్ సానియా తగ్గిందా..: 'ఆమె పెళ్లి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు బ్రాండ్ విలువను తగ్గించేస్తున్నాయ్. ఇది ప్రకటనదారులకు కలత చెందించే విషయమ'ని మార్కెటింగ్ సొల్యూషన్ల సంస్థ ఆల్‌కెమిస్ట్ ఎండీ మానిష్ పొర్వాల్ చెబుతున్నారు. 2005-06లో ఆమె ప్రపంచ ర్యాంకింగ్ 77గా ఉన్నప్పుడు టాటా ఇండికామ్, హ్యుందాయ్ గెట్జ్, లొట్టో స్పోర్ట్ ఇటాలియా, స్ప్రైట్, జీవీకే ఇండస్ట్రీస్, సహారా ఇండియా, అట్లాస్ సైకిల్, టాటా టీ వంటి భారీ కాంట్రాక్టులు దక్కించుకుంది. ఆ ఏడాది ఆమె బ్రాండ్ విలువ సచిన్, సౌరవ్, రాహుల్ ద్రవిడ్ తర్వాతి స్థానంగా ఉండేది. రూ.2-4 కోట్ల వరకూ డిమాండ్ చేయగల సత్తా అప్పటిది. 2007 కల్లా హ్యుందాయ్, టాటా ఇండికామ్, సహారా ఇండియా, లొట్టోలు ఒప్పందాలను పొడిగించుకోలేదు. ఆ తర్వాత ఆమె 27వ ర్యాంక్‌కు రావడంతో 2008లో అడిడాస్; 2009లో టీవీఎస్ స్యూటీ, క్యాడ్‌బరీ బోర్నవీటాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.