Friday, April 16, 2010

సుప్రీంకెళ్లిన సెబీ

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ముంబయి హైకోర్టుల్లోనూ కేవియట్‌
యులిప్‌ వివాదం
న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీం కోర్టుకెళ్లింది. యులిప్‌ల విషయంలో సెబీ నిషేధాన్ని సవాలు చేస్తూ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ కోర్టుకెళ్లనున్న నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీం సహా కొన్ని హై కోర్టులకూ వెళ్లింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ హైకోర్టులలో కేవియట్లు దాఖలు చేసింది. అయితే సెబీ నుంచి అధికార ప్రకటన ఏమీ వెల్లడి కాలేదు. యులిప్‌ల విషయంలో ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై తక్షణం కోర్టుకు వెళ్లండంటూ బుధవారం ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా గత వారంలో తమ అనుమతి లేకుండా 14 బీమా కంపెనీలు యులిప్‌లను జారీ చేస్తున్నాయని వాటిపై సెబీ నిషేదాజ్ఞలు జారీ చేయగా.. ఆర్థిక శాఖ జోక్యంతో అంతకు ముందు పరిస్థితి ఏర్పడింది. అయితే ఏప్రిల్‌ 9 తర్వాతి యులిప్‌లపై నిషేధం కొనసాగుతుందని ఏప్రిల్‌ 14న సెబీ కొత్త మెలిక పెట్టింది.

పింఛన్‌ పథకాలపైనా గురి..?
యూనిట్‌ ఆధారిత బీమా పథకాల (యులిప్‌) కోవలోనే పింఛన్‌ పథకాల పైనా సెబీ తన దృష్టిని ఇక సారించనుందా..? పింఛన్‌ ఫండ్‌ మేనేజర్లు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పింఛన్‌ పథకాలు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నియంత్రణలో ఉన్నాయి. యులిప్‌లలో బీమా ప్రీమియం వాటాను మినహాయించగా మిగతా సొమ్మును ఈక్విటీలు, రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్న కారణంగా యులిప్‌లకు తన అనుమతిని పొంది తీరాలని సెబీ స్పష్టం చేసిన విషయం విదితమే. సెబీ ఇదే తర్కాన్ని పింఛన్‌ పథకాల విషయంలోనూ వర్తింపచేయవచ్చని పింఛన్‌ నిధుల అధికారులు అభిప్రాయపడుతున్నారు. అవ్యవస్థీకృత రంగంలోని పనివారికి ఉద్దేశించి అమల్లోకి తెచ్చిన పింఛన్‌ పథకంలోని నిధులను షేర్‌ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇతర పింఛన్‌ పథకాలలోనూ ఈ సౌలభ్యం ఉంటోంది. సెబీ ముఖ్యోద్దేశం మదుపరుల ప్రయోజనాలను కాపాడాలన్నదే. అయితే, పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం ఇంకా పార్లమెంట్‌ ఆమోదం పొందవలసి ఉన్నందువల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ఘర్షణ తలెత్తకపోవచ్చని పరిశ్రమ వర్గాలు కొన్ని గుర్తు చేస్తున్నాయి.