Tuesday, April 6, 2010

జోరుగా 'నెట్' వినియోగం

గత ఏడాదిలో 7.1 కోట్ల మంది వీక్షకులు

న్యూఢిల్లీ: ప్రపంచాన్నే ఓ కుగ్రామంగా మలచి కోరుకున్న దానిని ఒక్క క్లిక్‌తో కళ్లముందే ప్రత్యక్షం చేసే ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు భారీ స్థాయిలో పెరుగుతోంది. ఇ-మెయిల్స్, గేమ్స్, మ్యూజిక్ డౌన్‌లోడ్స్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సైట్స్, కంటెంట్, అప్లికేషన్స్, బ్లాగ్స్, ఆన్‌లైన్ ఫలితాలు, ఆన్‌లైన్ టికెటింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభిన్న సేవలను అందజేస్తున్న ఇంటర్నెట్ ను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇటీవలి సర్వేలో తేలింది.

ఇంటర్నెట్ వినియోగానికి పట్టణాల్లోనే కాకుండా పల్లెప్రాంతాల్లో కూడా పెద్ద పీట వేస్తున్నట్లు ఈ సర్వే పేర్కొంది. 2009 సంవత్సరంలో ఇంటర్నెట్‌ను వినియోగించిన వారి సంఖ్య దాదాపు 7.1 కోట్లుగా ఉందని ' ఇంటర్నెట్ ఇన్ ఇండియా' నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఎంఎఐ), మార్కెటింగ్ పరిశోధన సంస్థ ఐఎంఆర్‌డిలు కలిసి ఈ అధ్యయాన్ని చేపట్టాయి.

2009 సెప్టెంబర్ నాటికి దేశంలో 5.2 కోట్ల మంది యాకి ్టవ్ ఇంటర్నెట్ యూజర్లున్నారు. అంటే వీళ్లు కనీసం నెలకు ఒక్కసారైనా ఇంటర్నెట్‌ను వినియోగిస్తారన్నమాట. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే (4.2 కోట్లు) యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు 19 శాతం పెరిగారు. కాగా మిగతావాళ్లు ఎప్పుడో ఒకప్పుడు తమ అవసరాన్ని బట్టి ఇంటర్నెట్‌ను వినియోగించిన వాళ్లు.

మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో రెండో స్థానం..
భారత్‌లో 50 కోట్లకు పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులున్నారు. మొబైల్ ఫోన్లు పెరిగినట్లే మొబైల్ ఫోన్ ఇంటర్నెట్‌ను వీక్షించే వినియోగదారుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని గూగుల్ తాజా నివేదికలో వెల్లడైంది. మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని అమెరికా కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్ల వెబ్ పేజీలను వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ తెరలపై వీక్షించారు.

ఇందులో భారత్ వాటా 5.9 శాతంగా ఉందని గూగుల్ పేర్కొంది. ఈ మొత్తంలో అమెరికా 50 శాతం వెబ్ పేజీలను అమెరికన్ను వీక్షించారు. మొబైల్‌ఫోన్ వెబ్ ట్రాఫిక్‌లో 30,000 రూపాయల స్థాయిలో ఐఫోన్ వాటా 40 శాతంగా ఉంది. ఇండియాలో హౌఎండ్ మొబైల్ ఫోన్ల వినియోగం వృద్ధి చెందకపోవడం వల్ల మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ వినియోగం తక్కువ స్థాయిలో ఉందని మార్కెట్ వర్గాలంటున్నాయి.