Wednesday, April 7, 2010

సిమెంటు అమ్మకాలు


అధిక గిరాకీతో పెరిగిన ధర
కొన్ని ప్రాంతాల్లో రూ.250 పలుకుతున్న బస్తా!
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడు లేనంతగా గత నెలలో 23.50 లక్షల టన్నుల సిమెంటు విక్రయాలు నమోదు అయ్యాయి. సిమెంటు ఉత్పత్తిదారుల గణాంకాల ప్రకారం ఇది రికార్డు. గత పదేళ్లలో గానీ, అంతకు ముందు గానీ మార్చి నెలలో ఇంత అధికంగా సిమెంటు విక్రయాలు జరగలేదు. 2000వ సంవత్సరం మార్చి నెలలో 10 లక్షల టన్నులు ఉన్న అమ్మకాలు అప్పటినుంచి నెమ్మదిగా పెరుగుతూ, గత ఏడాదే 20 లక్షల టన్నులను అధిగమించాయి. కిందటి ఏడాది మార్చి నెలలో 21.67 లక్షల టన్నుల విక్రయాలు నమోదు కాగా, అదే రికార్డు కాబట్టి, సిమెంటు పరిశ్రమ వర్గాలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాయి. కానీ ఈ ఏడాది మార్చిలో అమ్మకాలు అంత కన్నా అధికంగా జరిగాయి. గత పదేళ్ల తీరుతెన్నులను చూసినపుడు సిమెంటు అమ్మకాలు పెరుగుతూ ఉండటం తప్పిస్తే తగ్గిత దాఖలాలు లేవు. రాష్ట్రంలో పలు సిమెంటు కంపెనీలు ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో సిమెంటుకు గిరాకీ పెరగడం, అదే సమయంలో ధర కూడా అధికంగా ఉండటం ఉత్పత్తిదార్లను సంతోషపెడుతోంది.

కోరినంత సిమెంటు మార్కెట్‌లో లేదు!: ధర విషయానికి వస్తే గత కొద్ది నెలలుగా పెరుగుతున్న వరుసలోనే ఈ నెలలోనూ సిమెంటు ధర ఎగసింది. ఈ నెల మొదటి వారంలో బస్తా సిమెంటుకు రూ.20 వరకు పెంపుదలను ఉత్పత్తిదార్లు వర్తింపజేశారు. దీంతో హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఇప్పుడు సిమెంటు బస్తా ధర రూ.225 అయ్యింది. కాస్త సుదూర ప్రాంతాలైన శ్రీకాకుళం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రూ.250 వరకూ ధర చెల్లిస్తే కానీ సిమెంటు లభ్యం కాని పరిస్థితి ఉందంటున్నారు. దీనిపై 'న్యూస్‌టుడే' స్థానిక సిమెంటు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడగా, కేవలం మనరాష్ట్రంలోనే సిమెంటు ధర పెరగడం లేదని, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంటు ధర వేగంగా పెరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సిమెంటు ధర బస్తాకు రూ.300 మించిందని, దక్షిణాదిన కేరళలో రూ.290 ధర ఉన్నట్లు పేర్కొన్నారు. అసలు డిమాండుకు తగ్గట్లుగా సిమెంటు మార్కెట్లో లేదని ఆ వర్గాలు వివరిస్తున్నాయి.

అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు
రాష్ట్రానికి చెందిన సిమెంటు కంపెనీ అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం చింతలపాలెం వద్ద ఉన్న ప్రస్తుత యూనిట్‌లోనే విస్తరణను చేపట్టి పూర్తి చేసింది. అంతేకాకుండా వాణిజ్య ప్రాతిపదికన సిమెంటు ఉత్పత్తిని గత నెల చివరి వారంలో ప్రారంభించారు. దీంతో కంపెనీకి ఇప్పుడు 1.16 మిలియన్‌ టన్నుల వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు అవుతోంది. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి ముందు కంపెనీ వార్షిక సామర్థ్యం 0.5 మిలియన్‌ టన్నులు మాత్రమే. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి రూ.181.53 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది.

మూడో త్రైమాసికంలో రూ.83 లక్షల లాభం: 2009-10 ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలానికి అంజనీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం మొత్తం ఆదాయం రూ.106.90 కోట్లు కాగా, దీనిపై రూ.13.71 కోట్ల నికరలాభం నమోదైంది. మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.26.24 కోట్లు, నికరలాభం రూ.83 లక్షలు ఉన్నాయి. కంపెనీ జారీ మూలధనం రూ.18.38 కోట్లు ఉంది. సిమెంటుకు గిరాకీ, ధర రెండూ అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో అదనపు సామర్థ్యం అందుబాటులోకి వచ్చినందున కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం (2010-11)లో ఆదాయాలు, లాభాలు మెరుగ్గా ఉంటాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.