Thursday, April 1, 2010

రాజధానిలో నేటి నుంచి గంధకం లేని పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకం

వూపిరితిత్తులకు వూరట
రాజధానిలో నేటి నుంచి
గంధకం లేని పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకం
స్వల్పంగా పెరగనున్న ధర
మరో 12 పెద్దనగరాల్లో కూడా
యూరో-4 ప్రమాణాల మేరకే
జిల్లాల్లో యూరో-3 ఇంధనం?
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
హైదరాబాద్‌ సహా దేశంలోని 13 పెద్దనగరాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. పెట్రోల్‌కు యాభై పైసలు, డీజిల్‌కు 26 పైసలు పెరుగుతాయి. స్థానిక పన్నులు అదనం.

ఏప్రిల్‌ ఒకటి నుంచి 13 మహా నగరాల్లో బీఎస్‌(భారత్‌ స్టేజ్‌)-4 ప్రమాణాల మేరకు శుద్ధిచేసిన పెట్రోల్‌, డీజిల్‌ను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఆ మేరకు ధరలు పెరుగుతున్నాయి. అల్ట్రా లోసల్ఫర్‌ పెట్రోల్‌ (యూఎస్‌ఎల్‌పీ), అల్ట్రా లోసల్ఫర్‌ డీజిల్‌(యూ ఎస్‌ఎల్‌డీ)గా పిలిచే ఈ ఇంధనాలను 2006 నుంచే యూరప్‌, అమెరికా దేశాల్లో తప్పనిసరి చేశారు. ప్రస్తుతం మహా నగరాల్లో బీఎస్‌-3 ప్రమాణాల పెట్రోల్‌, డీజిల్‌ విక్రయిస్తున్నారు. బీఎస్‌-4కు మారడం వల్ల వాహనాల నుంచి వెలువడే గంధకపు కాలుష్యం 85 శాతం తగ్గిపోతుంది. ప్రస్తుతం డీజిల్‌ ఇంధనంలో గంధకపు కాలుష్యం 550-350 పీపీఎం(పార్ట్స్‌పర్‌ మిలియన్‌) ఉండగా, యూఎస్‌ఎల్‌డీ వాడకం తర్వాత 50 పీపీఎంకు తగ్గనుంది. పెట్రోల్‌ ఇంధనంలో గంధకపు కాలుష్యం 150 పీపీఎం ఉంది. యూఎస్‌ఎల్‌పీ వాడకం తర్వాత అది కూడా 50 పీపీఎంకు తగ్గనుంది. వీటిని దాదాపుగా గంధకం లేని పెట్రోల్‌, డీజిల్‌ అని చెప్పుకోవచ్చు. కార్బన్‌ మోనాక్సైడ్‌ (సీఓ), నైట్రోజన్‌ ఆక్సైడ్స్‌ (ఎన్‌ఓఎక్స్‌), వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఆమ్ల వర్షాలను నివారించవచ్చు. ఇంధనం మూడు శాతం వరకు ఆదా అవుతుంది.

యూరో-4 ప్రమాణాలకు ధీటుగా ప్రవేశపెట్టిన బీఎస్‌-4 ప్రమాణాలను అందుకొనేందుకు భారతీయ చమురు సంస్థలు 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాయి. ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నారు. ప్రస్తుతం దేశంలోని ఇతర నగరాలు, చిన్న పట్టణాల్లో యూరో-2 ప్రమాణాల పెట్రోల్‌, డీజిల్‌ను విక్రయిస్తున్నారు. వాటిల్లో గంధకం పరిమాణం మరింత ఎక్కువ. అక్కడ విక్రయించే పెట్రోల్‌, డీజిల్‌ ప్రమాణాలను ఆరు నెలల్లో దశలవారీగా యూరో-3 స్థాయికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు గోవా రాష్ట్రమంతా గురువారం నుంచి యూరో-3 పెట్రోల్‌, డీజిల్‌ మాత్రమే అమ్మనున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి జిల్లాల్లోని ఏడు మండలాలు కలిసిన గ్రేటర్‌ హైదరాబాద్‌కు మాత్రమే బీఎస్‌-4 ఇంధనం సరఫరా చేస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు రాజధాని నగరంలో గత 15 రోజులుగా సాగుతోంది. మరో 24 గంటల్లో అన్నిబంకుల ట్యాంకులు శుభ్రం చేయడం పూర్తవుతుందని, ఆ తర్వాత బీఎస్‌-3 పెట్రోల్‌, డీజిల్‌ ఇక రాజధాని నగరంలో కనిపించదని చెబుతున్నారు. ఇతర నగరాల్లో లాగా హైదరాబాద్‌కు చుట్టూ వంద కిలోమీటర్ల మేర బీఎస్‌-4 పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేయాలని కార్ల కంపెనీలు కోరాయి. నెలరోజుల్లో ఏర్పాటు చేస్తామని చమురు సంస్థలు హామీఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం బీఎస్‌-2 ప్రమాణాలు కలిగిన పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా అవుతోంది. ఇందులో గంధకం పరిమాణం ఎక్కువ. అందుకే, రాష్ట్రమంతా మూడు నాలుగు నెలల్లో బీఎస్‌-3 ప్రమాణాలున్న ఇంధనాన్ని సరఫరా చేస్తారు. అప్పుడు జిల్లాల్లో పెట్రోల్‌ ధరలు లీటర్‌కు 26 పైసలు, డీజిల్‌ ధరలు లీటర్‌కు 21 పైసలు పెరుగుతాయి. స్థానిక పన్నులు అదనం.

బీఎస్‌-4 పాటించే నగరాలు: ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరు, లక్నో, కాన్పూర్‌, ఆగ్రా, సూరత్‌, అహ్మదాబాద్‌, పుణె, షోలాపూర్‌
* పాత కార్లలో బీఎస్‌-4 ఇంధనం వాడితే కాలుష్య తీవ్రత పెద్దగా తగ్గదు. ఇంజిన్‌కు ప్రమాదమేమీ ఉండదు. 2000 సంవత్సరం ముందు మోడల్‌ వాహనాల్లో గంధకం లేని డీజిల్‌ బీఎస్‌-4 వాడితే లూబ్రికేషన్‌ సమస్యలు వస్తాయని ఇంటర్నెట్లో కథనాలు ఉన్నాయి. వాటిని ధ్రువీకరించాల్సి ఉంది.

వినియోగదారులకే లాభం
కార్ల ఇంధన సామర్థ్యం పెంచేందుకు ఆధునిక ఇంజిన్ల నిర్మాణంలో అల్యూమినియం వాడకాన్ని పెంచారు. ఫిల్టర్లు చేర్చారు. ఇతర మార్పులు చేశారు. అవే బీఎస్‌-4 ప్రమాణాల వాహనాలు. వాటికి తగ్గట్లు ఇంధనం, ఇంజినాయిల్‌లో కూడా మార్పులు చేస్తున్నారు. అవే బీఎస్‌-4 ప్రమాణాల ఇంధనాలు. ఇంధనం పొదుపు, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ మార్పులు వినియోగదారుడికే లాభం.
- వల్లూరుపల్లి వరుణ్‌దేవ్‌, డైరెక్టర్‌, వరుణ్‌ మోటార్స్‌
రాజధాని వాహనాల రిజిస్ట్రేషన్‌పై
నియంత్రణ అక్టోబర్‌ 1కి వాయిదా
దమూడు పెద్ద నగరాల్లో కేవలం బీఎస్‌-4 కాలుష్య ప్రమాణాలతో కూడిన వాహనాలకే రిజిస్ట్రేషన్‌ చేయాలన్న నిబంధనను ఏప్రిల్‌ ఒకటి నుంచి మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని అక్టోబర్‌ 1 వరకు వాయిదా వేయడానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ అంగీకరించింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. వాహన తయారీ కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిర్ణయంలో మార్పువల్ల హైదరాబాద్‌లో మరో ఆర్నెల్లపాటు బీఎస్‌-3 వాహనాలను కూడా రిజిస్టర్‌ చేస్తారు. మిగిలిన జిల్లాల్లో అక్టోబరు ఒకటినుంచి బీఎస్‌-3, ఆ పైస్థాయి ప్రమాణాలు ఉన్న వాహనాలను మాత్రమే రిజిస్టర్‌ చేస్తారు.