భూవినియోగ మార్పిడి ఛార్జీల పేరుతో బాదుడు
నిధుల కరవులో విచక్షణ మరచిన సర్కారు
బూమ్‌కు అనుగుణంగా పన్ను కట్టాలని డిమాండ్పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇంటి విలువ మార్కెట్ జూదంలో కోటిరూపాయలైనా అందులో ఉంటున్న యజమానికి అది 'నాది అనే మానసిక తృప్తినిచ్చే గూడు' మాత్రమే. డబ్బుల కరువులో పడిన సర్కారు మధ్య తరగతి జీవికి ఆ తృప్తి కూడా మిగలనివ్వడం లేదు. ఎప్పుడో కట్టుకున్న సొంతఇంటికి కూడా భూవినియోగ మార్పిడి పన్ను చెల్లించమంటోంది. అదీ లాభాలు పండించుకున్న రియల్ వ్యాపారులకు మల్లే మార్కెట్ ధర చెల్లించమంటోంది. ఇన్నాళ్లు చెల్లించనందుకు అపరాధ రుసుం కూడా వేస్తోంది. కూడు, గుడ్డ, ఇల్లు అనేవి కనీస అవసరాలన్న ప్రాథమిక సూత్రాన్ని మరచి తాఖీదుల మీద తాఖీదులు పంపిస్తోంది. ఈ మొత్తాలు చెల్లించాలంటే ఇల్లో, తలో తాకట్టు పెట్టాల్సిందేనని జనం గగ్గోలు పెడుతున్నారు.

నిరుపేదకు రూ.41 వేల నోటీసు: యాభై అయిదు గజాల్లో ఇల్లు కట్టుకోవడం కష్టమే. స్థోమత లేని పేదలు అందులోనే సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారినీ రెవెన్యూ అధికారులు వదిలిపెట్టడం లేదు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో రూ.41,850 చెల్లించాలంటూ లక్ష్మి అనే మహిళకు నోటీసు జారీ అయింది. చదరపు గజానికి రూ.5 వేలుగా అధికారులు ధర నిర్ణయించారు. 55.8 చదరపు గజాలకు భూ మార్పిడి రుసుం కింద రూ.27,900, అపరాధ రుసుం కింద రూ.13,950 చెల్లించాలన్నదే ఆ నోటీసు సారాంశం.
ఎవరు చెల్లించాలి ఈ మొత్తం?..: విజయవాడ సమీపంలోని నిడమానూరులో ఎకరాధర రూ.20 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 8.83 ఎకరాలకు భూమార్పిడి రుసుం చెల్లించలేదని తాజాగా కె.రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నోటీసు జారీచేసింది. ఎకరా రూ.20 లక్షల చొప్పున 10 శాతం మార్పిడి ఫీజు రూ.17.66 లక్షలు, అపరాధ రుసుం కింద రూ.8.83 లక్షలుగా నిర్ధారించారు. అంటే ఈయన మొత్తం రూ.25.99 లక్షలు చెల్లించాలి. భూమి చేతులు మారిన తరువాత డబ్బులు కట్టడానికి ఆయన ఎంతవరకు బాధ్యత తీసుకుంటారన్నది ప్రశ్న. ఆ భూమిలో ఎవరైతే ఇళ్లు కట్టుకుని ఉంటున్నారో వారి మీద భారం పడక తప్పదు.
ఊరితోపాటు భారం పెరిగింది: పట్టణాలు, గ్రామాల విస్తరణతో వ్యవసాయ భూములు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించాలంటే దాన్ని మార్పు చేయాలి. భూ మార్పిడికి గతంలో నామమాత్రపు ధర ఉండేది. 10 వేల జనాభా లోపు ఉన్న ప్రాంతాల్లో నివాస యోగాన్యికైతే అసలు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. 50 వేల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో చదరపు మీటరుకు 15-20 పైసలు చెల్లిస్తే సరిపోయేది. అయితే 2006లో చట్టాన్ని సవరించారు. మూల విలువలో 10 శాతం చెల్లించాలని చట్టం నిర్దేశిస్తోంది. సంబంధిత ధ్రువీకరణ అధికారి నుంచి భూ మార్పిడికి అనుమతి తీసుకోవాలి. ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఇల్లు కట్టుకుంటే మూల విలువలో 10 శాతంతో పాటు 50 శాతం అపరాధ రుసుంకూడా విధించవచ్చు. ఇది సామాన్యుడి పాలిట నడ్డి విరిచే చర్య అయింది. మూల విలువ పెరిగితే ఈ మొత్తం పెరుగుతుంది. ఇది ఒక్కో ప్రాంతానికి ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒక దఫా మూల విలువను పెంచుతూ వస్తున్నారు. ఏడాదికి 10 శాతం నుంచి 30 శాతం వరకూ గతంలో అధికం చేశారు. దీంతో భూ మార్పిడికి చెల్లించాల్సిన మొత్తం తడిసిమోపెడు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్లాటు లేదా ఫ్లాటు కొనుగోలు చేసిన వాడే ఈ పన్ను చెల్లించాలి. దీని వల్ల వారు కట్టాల్సిన మొత్తం పెరుగుతుంది. ఈ కారణంగా ఎవరూ ముందుకు రాకపోవచ్చన్న ఉద్దేశంతో పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తీసుకుని లే-అవుట్లు, ఫ్లాట్లు నిర్మించిన వారు కూడా భూ మార్పిడి రుసుం చెల్లించే అంశాన్ని పక్కనపెట్టారు. తెలిసీ తెలియక సామాన్యులు కూడా పట్టించుకోలేదు. వారంతా ఇపుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. 10 శాతం మూల విలువతోపాటు 50 శాతం అపరాధ రుసుం చెల్లించాలని నోటీసులు జారీ అవడంతో తెల్లమొహం వేస్తున్నారు. ఇంటి కొనుగోలుకు చేసిన అప్పు తీర్చడమే కష్టంగా ఉన్న తరుణంలో ఈ మొత్తాన్ని ఎలా చెల్లించాలో తెలియడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు చెల్లించక తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించినపుడు భూ మార్పిడి తప్పని సరి. ఒకసారి చెల్లిస్తే లైసెన్సు ఇచ్చినట్లవుతుంది. ఎవరైనా తాము ఇచ్చిన నోటీసుకు స్పందించకపోతే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే అవకాశం కూడా నిబంధనల ప్రకారం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. పేదలను ఇబ్బంది పెట్టబోమని, తొలుత పెద్దల మీద దృష్టి పెట్టాలని కోరామని వారు చెబుతున్నారు. రెండు మూడు వాయిదాల్లో చెల్లించే విధంగా పేదలకు అవకాశం ఇచ్చే విషయం పరిశీలనలో ఉందని వారు తెలిపారు.