ఏప్రిల్ 10 నుంచి వర్తింపు
అంతక్రితం వాటిపై నిషేధం లేదు
బీమా కంపెనీలకు తాజా ఉత్తర్వులు
పూర్తిగా చూశాకే స్పందిస్తా: ప్రణబ్
న్యూఢిల్లీ: 'యులిప్' వివాదం తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఈనెల 9 తర్వాత బీమా కంపెనీలు కొత్తగా యులిప్ పథకాలు జారీ చేయడంపై నిషేధం కొనసాగిస్తున్నట్లు సెబీ మంగళవారం ప్రకటించింది. దీంతో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏల మధ్య 4 రోజుల క్రితం మొదలైన వివాదం ఆర్థిక శాఖ జోక్యంతో ప్రస్తుతానికి సద్దుమణిగిందని భావిస్తున్నప్పటికీ.. నివురుగప్పిన నిప్పేనని సెబీ తాజా ఉత్తర్వులను బట్టి స్పష్టమవుతోంది. ఏప్రిల్ 9కి ముందు ఆయా బీమా కంపెనీలు జారీ చేసిన యులిప్‌లను మాత్రం నిషేధం నుంచి మినహాయిస్తున్నట్లు సెబీ తాజా ప్రకటన పేర్కొంది. అంటే ఈనెల 9కి ముందు జారీ చేసిన యులిప్‌లకు నిషేధం వర్తించదన్న మాట. యులిప్‌ల జారీ నుంచి నిషేధించిన 14 బీమా కంపెనీలకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సెబీ పేర్కొంది. తమనుంచి అనుమతులు పొందేవరకు ఎలాంటి కొత్త యులిప్ పథకాలను జారీ చేయొద్దని ఆ బీమా కంపెనీలను సెబీ ఆదేశించింది. యులిప్ పథకాలు మ్యూచువల్ ఫండ్‌ల వంటివేనని, వాటిని జారీ చేయాలంటే తమ అనుమతి తీసుకోవాల్సిందేనని సెబీ ఆదేశించిన విషయం తెలిసిందే. దీన్ని బీమా కంపెనీలు నిరసించడం, ఐఆర్‌డీఏ రంగంలోకి దిగి, ఆ ఆదేశాలను పట్టించుకోవద్దని సూచించడం, అనంతరం వివాదం ఆర్థిక శాఖ దృష్టికి వెళ్లడం, ప్రణబ్ ముఖర్జీ జోక్యంతో కోర్టులో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించడం తెలిసిందే. సెబీ తాజా ఉత్తర్వులపై ఐఆర్‌డీఏ ఛైర్మన్ జె. హరినారాయణ స్పందన కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరని పీటీఐ వెల్లడించింది.
రెండేళ్ల క్రితం ప్రారంభించిన కంపెనీలకు నష్టం:సెబీ తాజా ఉత్తర్వులపై స్పందిస్తూ 'గతేడాది లేదా రెండేళ్ల క్రితం వ్యాపారాలను మొదలుపెట్టిన కంపెనీలపై ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుంద'ని జీవిత బీమా కంపెనీల అత్యున్నత సంఘం లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. 'అవి ఎక్కువ ఉత్పత్తులను విక్రయించి ఉండవు. ఈ ఉత్తర్వుతో వాటికి కష్టాలు రానున్నాయ'ని కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ఎస్.బి. మాథుర్ అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాలూ కోర్టుకు వెళతాయా అని అడగ్గా.. 'తాజా ఉత్తర్వు ఐఆర్‌డీఏ, సెబీల పరస్పర అవగాహనతో వచ్చిందా లేదా అన్న విషయంపై ఇది ఆధారపడి ఉంటుంద'ని ఆయన అన్నారు. కాగా, ఈ విషయంపై సెబీ తాజా ఆదేశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే స్పందిస్తానని ఆర్థిక మంత్రి ప్రణబ్ వెల్లడించారు.
ప్రభుత్వ జోక్యంతోనే ముగింపు.. బీమా కంపెనీలు: యులిప్‌ల వివాదం ప్రభుత్వ జోక్యంతోనే సమసిపోగలదని బీమా కంపెనీలు మంగళవారమిక్కడ అభిప్రాయపడ్డాయి. అపుడే మదుపర్లలో ఏర్పడ్డ ఆందోళనలు తగ్గి సాధారణ వ్యాపార కార్యకలాపాలు తిరిగి మొదలవుతాయని వారు అంటున్నారు. రెన్యూవల్ ప్రీమియంల చెల్లింపుల విషయంలో తమ వినియోగదార్లు ఆందోళన చెందుతున్నారని బజాజ్ అలియంజ్ లైఫ్ పేర్కొంది.
| ఐఆర్‌డీఏ |
| |