మా వాహనాలపై ఇక 'బజాజ్' పేరుండదు
పుణె: 'బజాజ్' కంపెనీ వాహనాలపైన ఆ పేరు మరో రెండు సంవత్సరాల్లో కనపడదు..! ఈ విషయాన్ని కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ స్వయంగా తెలిపారు. 2012 కల్లా తమ కంపెనీ ఉత్పత్తి చేసే వాహనాలపైన 'బజాజ్' అనే బ్రాండ్ కనిపించదని ఆయన ప్రకటించారు. ఒకే మాతృ సంస్థ బ్రాండ్‌తో తమ వాహన శ్రేణికి ప్రాచుర్యాన్ని కల్పించే అంశంపై తమకు అంతగా నమ్మకం లేదని ఆయన అన్నారు. దీనికి బదులు పల్సర్, డిస్కవర్, ప్లాటినాల వంటి బ్రాండ్‌లతోనే ఆయా వాహనాలను విక్రయిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం పుణెకు సమీపంలోని అకుడ్డీ కర్మాగారంలో తయారుచేసిన కొత్త సీఎన్‌జీ ఆటోను రాజీవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌక ధర కారు కోసం రూపొందిస్తున్న ప్లాట్‌ఫామ్ మీదనే చౌక ధర వాణిజ్య వాహనాల తయారీని చేపట్టనున్నట్లు చెప్పారు. చిత్రంలో రాజీవ్ బజాజ్‌తో సంస్థ వాణిజ్య వాహనాల విభాగం సీఈఓ ఆర్.సి.మహేశ్వరి.