Wednesday, April 14, 2010

రెండేళ్లలో అంతా ఓకే

ఏడాది పూర్తి చేసుకున్న మహీంద్రా సత్యం
త్యం కంప్యూటర్స్‌ టెక్‌ మహీంద్రా చేతికొచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది వ్యవధిలో ఎన్నో సంఘటనలు, మరెన్నో ఒడుదొడుకులు. అయినా అందరి సహకారంతో సవాళ్లకు ఎదురీదుతూ ముందుకు సాగుతోందీ కంపెనీ. ఈనేపథ్యంలో మహీంద్రా సత్యం (సత్యం కంప్యూటర్స్‌ బ్రాండ్‌ పేరు) మంగళవారం నాడిక్కడ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, ఆ శాఖ కార్యదర్శి బందోపాధ్యాయ, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా సత్యం ఛైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు.
త్యం కంప్యూటర్స్‌ (బ్రాండ్‌ మహీంద్రా సత్యం) పూర్తిగా గట్టెకాలంటే మరో రెండేళ్లు పడుతుంది. ప్రభుత్వానికి మూడేళ్ల ప్రణాళికను సమర్పించాం. ఉద్యోగులు, ప్రభుత్వ సహకారం, మద్దతుతో విజయవంతంగా ఏడాది పూర్తి చేశాం. గత ఏడాది జూన్‌లో కంపెనీలో భారీ పునర్‌ వ్యవస్థీకరణ జరిగింది. నిర్వహణ అంచెలను 14 నుంచి 7కు కుదించాం. మరింత పారదర్శకత, సమాచార లభ్యత, ఉద్యోగ బృందాల మధ్య సహకారం కోసమే మేనేజ్‌మెంట్‌లో ఈ భారీ మార్పులు చేశాం. ఈ ఏడాది కాలంలో సత్యంకు దూరమైన దాదాపు మొత్తం ఖాతాదారులను మళ్లీ ఆకర్షించగలిగాం.
-సీఈఓ సి.పి. గుర్నానీ
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఖాతాల దిద్దుబాటు ఈ ఏడాది జూన్‌ కల్లా పూర్తవుతుంది. టెక్‌ మహీంద్రా, మహీంద్రా సత్యంల భారీ స్థాయిలో ఏకీకరణ (సినర్జీ) జరుగుతోంది'.
-వినీత్‌ నయ్యర్‌
ఛైర్మన్‌, మహీంద్రా సత్యం=
కంపెనీలోని ఉద్యోగుల మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైంది. సరిగ్గా ఏడాది క్రితం సత్యంను సొంతం చేసుకున్నాం. అక్కడ నుంచి ఎంతో దూరం ప్రయాణించాం. భవిష్యత్తులో కూడా మా పయనం కొనసాగుతుంది. ఇదే స్థాయిలో ఉద్యోగుల సహకారం, మద్దతు కొనసాగితే సత్యం తప్పక మొదటి స్థానంలో నిలబడుతుంది.
- ఆనంద్‌ మహీంద్రా,
ఎం&ఎం గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ
ప్రభుత్వ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖల మద్దతు, కొత్త యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు, ఉద్యోగుల సహకారం వల్లే సత్యం కోలుకుంది. ఇది విజయమంతమైన మోడల్‌ అవుతుంది. ప్రముఖ నిర్వహణ విద్యా సంస్థల్లో దీన్ని బోధిస్తారు. సత్యం ఖాతాల దిద్దుబాటు సాంకేతిక అంశం. సత్యం గట్టెక్కే ప్రక్రియ కొనసాగుతోంది. వినూత్న, నిర్మాణాత్మాక చర్యలతో మహీంద్రా సత్యంను పూర్తిగా గట్టెక్కిస్తాం. కంపెనీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. భవిష్యత్తులో కూడా సత్యంకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుంది. సెజ్‌ ప్రారంభం కంపెనీకి కీలక మైలురాయి.
-సల్మాన్‌ ఖుర్షీద్‌,
కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి
ర్థిక మాంద్యం కారణంగా ఏడాదిన్నర క్రితం ఐటీ పరిశ్రమలో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ.. సత్యం విజయం సాధించగలిగింది. వీలైనన్ని అన్ని మార్గాల్లో సత్యంకు మద్దతు కొనసాగుతుంది. పరిస్థితులు మారుతున్నాయి.
-బందోపాధ్యాయ,
కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి
సెజ్‌ పనులు ప్రారంభం
హీంద్రా సత్యం వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సల్మాన్‌ ఖుర్షీద్‌ సత్యం ఇన్ఫోసిటీ క్యాంపస్‌లో కంపెనీ ప్రత్యేక ఆర్థిక మండలం (సెజ్‌) పనులను ప్రారంభించారు. 26 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సెజ్‌ ఆరు నెలల్లో సిద్ధం అవుతుంది. మొదటి దశ పనులు పూర్తయితే దాదాపు 5,000 మంది పని చేయడానికి వీలైన కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ పని చేయడానికి అవసరమైన నిపుణులను దశల వారీగా నియమించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఉద్యోగుల సంఖ్య, వలస రేటును మాత్రం వెల్లడించలేదు. అయితే.. కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారని తెలుస్తోంది.