Thursday, April 1, 2010

సేవింగ్ ఖాతాలపై రోజువారీ వడ్డీ

న్యూఢిల్లీ: సేవింగ్ ఖాతాదారులకు తమ సొమ్ముపై మరింత వడ్డీ లభించనుంది. గురువారం నుంచి సేవింగ్ ఖాతాల్లోని సొమ్ముపై రోజువారీ వడ్డీ లెక్కింపు విధానం అమలులోకి రానుంది. ఇంతకు ముందు నెలలోని 10వ రోజు నుంచి నెల చివరి రోజు వరకు సేవింగ్ ఖాతాలో ఉన్న కనీస నిల్వపైనే వడ్డీని లెక్కించేవారు. తాజాగా అమలులోకి వచ్చే విధానం ద్వారా ఖాతాలో ఏ రోజు ఉన్న నిల్వపై ఆ రోజుకు వడ్డీనిలెక్కిస్తారు.


దీని వల్ల ఖాతాదారులకు అదనంగా 0.3 నుంచి 0.4 శాతం ఎక్కువ వడ్డీ లభించనుంది. ప్రస్తుతం సేవింగ్ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని బ్యాంకులు ఈ కొత్త వడ్డీ లెక్కింపు విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తేనున్నాయి.

బ్యాంకులపై భారం..
సేవింగ్ డిపాజిట్లపై రోజువారీ వడ్డీలెక్కింపు విధానం వల్ల బ్యాంకులపై భారం పెరిగే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల బ్యాంకుపై 30-40 బేసిస్ పాయింట్ల నిధుల నిర్వహణ వ్యయం పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అలెన్ పెరీరా తెలిపారు.

బ్యాంకింగ్ రంగంలోని అన్ని బ్యాంకులు దాదాపు కంప్యూటరీకరణ కావడం వల్ల రోజు వారీ వడ్డీలెక్కింపు సులభమైనదేనని ఆయన అన్నారు. కాగా ఈ తరహా విధానం వల్ల కస్టమర్లకు ఎక్కువ లబ్ది చేకూరనుందని ఆయన చెప్పారు.