Thursday, April 1, 2010

ధరలు భగ్గు

కొత్త ఆర్థిక సంవత్సరం ధరల మంటలతో ప్రారంభం అవుతున్నది. ఏప్రిల్ ఒకటి నుంచి సిమెంట్ ధరలు బస్తా మరో 20-25 రూపాయల మేర పెరుగుతుండగా, భారత్ ఐగ ప్రమాణాల కారణంగా పలు పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. కొత్త ప్రమాణాల కారణంగా కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయి.


సిమెంట్ ధరలు హైదరాబాద్‌తో సహా దక్షిణాది మార్కెట్లో గురువారం నుంచి బస్తాకు 20రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర విద్యుత్ కారణంగా ఆంధ్రప్రదేశ్ సిమెంట్ కంపెనీల ఉత్పత్తి బాగా తగ్గిందని దీంతో మార్కెట్లో సిమెంట్ లభ్యతకు కొరత ఏర్పడటంతో ధరలు పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సిమెంట్ ధరలు నెలరోజుల్లో పెరగటం ఇది మూడోసారి.

పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో 50 కిలోల సిమెంట్ బస్తా ధర 225 రూపాయలు అవుతుందని అంటున్నారు. సిమెంట్ కంపెనీలు మార్చి 15న బస్తాకు 25 రూపాయలు, 24న 10 రూపాయలు పెంచాయి. వేసవికాలం కావటంతో నిర్మాణాలు ఊపందుకుని సిమెంట్ కు డిమాండ్ పెరిగింది. కాగా సిమెంట్ ధరల తాజా పెరుగుదల దక్షిణాది రాష్ట్రాల్లో నిలబడవచ్చుగానీ హైదరాబాద్‌లో అనుమానమేనని డీలర్ల అంటున్నారు.

గత వారం పెంచిన 10 రూపాయల ధర హైదరాబాద్ మార్కెట్లో నిలబడలేదని వారు చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ఇప్పటికీ సిమెంట్ బస్తా ధర 202-203 రూపాయల స్థాయిలోనే ఉందని మార్కెట్ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్, అల్ట్రాటెక్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ తాజా ధర పెంపును డీలర్లకు తెలిపినట్లు తెలిసింది.

కార్ల ధరల పెంపు
దేశంలోని పదమూడు పట్టణాల్లో బిఎస్ ఐగ కాలుష్య ప్రమాణాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో గురువారం నుంచి కార్ల ధరలను పెంచాలని ఆటో కంపెనీలు నిర్ణయించాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా కార్లను అప్‌గ్రేడ్ చేయడానికి కొత్త టెక్నాలజీ అవసరం ఉంటుందని, అందుకయ్యే వ్యయ భారాన్ని తగ్గించుకోవడానికి ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి.

జనరల్ మోటార్స్ తన అన్ని కారు మోడళ్లపై 1.5 శాతం వరకు ధరలను పెంచుతోంది. ధరల పెంపుదల 600 - 11,000 రూపాయల మధ్య ఉంటుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు. ఇక హ్యుండయ్ తన పెట్రోల్ వెర్షన్ మోడళ్ల ధరలను 1.5 శాతం వరకు, డీజిల్ మోడళ్లపై ధరను 3 శాతం పెంచుతోంది.

వివిధ మోడళ్ల ధరలను 1-3 శాతం పెంచుతున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు. ఇన్నోవా ధర పెంపు గరిష్ఠంగా 15,000 రూపాయలు ఉండనుంది. టాటా మోటార్స్ ధరల పెంపును ప్రకటించాల్సి ఉంది. మారుతిసుజుకీ కూడా ధరలను పెంచనున్నట్లు పేర్కొంది. ధరల పెంపుదలను ఇంకా నిర్ణయించలేదని స్కోడా ఆటో ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అషుతోష్ దీక్షిత్ తెలిపారు.