జి-కంపెనీ!
మైనింగ్‌ను మాఫియాగా మార్చిన 'గాలి'
గనుల్లో తుపాకులతో గార్డుల కాపలా
బళ్లారిలో యువకులతో గూఢచర్యం
60 గదులతో ఒక ఎకరంలో ఇంటి నిర్మాణం
నిరంతంరం 20 మంది సాయుధులు కాపలా
అంగబలం అర్ధబలమే ఆయుధాలు
ఆక్రమణలు కిడ్నాప్‌లు దౌర్జన్యాలు
గాలి అండ్ బ్రదర్స్‌పై తెహల్కా సంచలన కథనం
ఇనుప ఖనిజం గని అంటే... ఎర్ర రంగు మట్టి, రాకాసి యంత్రాలు, పాతాళం లోతున గోతులు, రణగొణ ధ్వనులు, దూసుకుపొయ్యే ట్రక్కులు, రోడ్లపై గోతులు మాత్రమేనా? కానే కాదు!
ఇనుప ఖనిజం గని అంటే... తుపాకులు, బెదిరింపులు, కిడ్నాపులు, రౌడీలు, గూండాలు, కొట్టడాలు, గూఢచారులు, ఆక్రమణలు, పంచాయతీలు, అక్రమ పర్మిట్లు, రాజకీయాలు, పదవులు, కోట్లకు కోట్లు డబ్బులు కూడా!
'గని అంటే కోట్లకు కోట్ల మనీ' అని గ్రహించిన గాలి జనార్దన్ రెడ్డి అండ్ బ్రదర్స్ (జి-కంపెనీ) మైనింగ్‌ను ఓ మాఫియాగా మార్చింది. జి-కంపెనీ చుట్టూ ఎన్నో వివాదాలు! వీరి గనుల్లో రీసర్వే చేయాలని, అప్పటిదాకా మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. జి-కంపెనీపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మరో మైన్ ఓనర్ తపాల్ గణేశ్‌పై బళ్లారిలో దాడి జరిగింది.
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో! జి-కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు, అక్కడ జరిగే అక్రమాలు, దుర్మార్గాలపై సంచలనాత్మక పత్రిక 'తెహల్కా' సుదీర్ఘమైన పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. 'గనుల్లో అక్రమాలు దేశ విపత్తుకే దారి తీస్తాయి. ఇలాంటి అక్రమాల్లో గాలి సోదరులది అందె వేసిన చేయి' అని తెహల్కా ఒక్కముక్కలో విషయం మొత్తం చెప్పింది. ఈ పత్రిక ప్రచురించిన సుమారు పది పేజీల కథనంలోని ముఖ్యాంశాలు ఇవి....
మైనింగ్ నిబంధనల ప్రకారం ఒక్కసారి గనిని లీజుకు ఇస్తే... అది 20 ఏళ్లపాటు అమలులో ఉంటుంది. లీజుకు తీసుకున్న రెండేళ్లలోపు మైనింగ్ మొదలు పెట్టాలి. లేనిపక్షంలో లీజును రద్దు చేస్తారు. ఇదీ నిబంధన. బళ్లారిలోని ఇనుప గనులను ఎవరో ఒకరు అప్పటికే లీజుకు తీసుకున్నారు.
వాటిని పొందాలంటే జి-కంపెనీ ఏళ్లతరబడి ఆగక తప్పదు. దీంతో అప్పటికే గనులను లీజుకు తీసుకుని, భారీ యంత్రాలను సమకూర్చుకోలేక మైనింగ్ మొదలుపెట్టని వాటిపై జి-కంపెనీ కన్నేసింది. అదే సమయంలో... వివాదాల్లో చిక్కుకున్న గనుల గురించి కూడా ఆరా తీయడం మొదలుపెట్టింది. యంత్రాలు, యంత్రాంగం లేక మైనింగ్ చేయలేని వారిని డబ్బుతో కొన్నారు.
వివాదాలను పరిష్కరించేందుకు 'పంచాయతీ'లు మొదలుపెట్టారు. (వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లినా... రెండేళ్లలో తీర్పు వస్తుందనే నమ్మకంలేదు. రెండేళ్లు దాటితే లీజుకే మోసం వస్తుంది. అందుకే.. ఇలాంటి గనుల యజమానులు పంచాయతీలను నమ్ముకున్నట్లు వినికిడి.) ఇలా మైనింగ్‌లో జి-కంపెనీ రింగ్ మాస్టర్‌గా మారింది. రైజింగ్ కాంట్రాక్ట్‌లు (ఖనిజం తవ్విపెట్టి డబ్బులు తీసుకోవడం) మొదలుపెట్టింది.
బళ్లారిలోని 65 మంది గనుల యజమానులు ఉండగా... 48 మంది జి-కంపెనీతో ఇలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. మొత్తానికి... దాదాపు అన్ని కంపెనీల్లో జి-కంపెనీకి వాటా సాధించినట్లు సమాచారం. కొన్ని గనులను ఈ కంపెనీ అంగబలంతోనో, అర్థబలంతోనో పూర్తిగా సొంతం చేసుకుంది. తపాల్ గణేశ్ వంటి అతికొద్ది మంది మాత్రమే జి-కంపెనీని ఎదుర్కొంటున్నారు.
బలం.. బలగం
బళ్లారిలో కొందరు యువకులు చదువులు మానేసి 'గాలి' తిరుగుడు తిరుగుతున్నారు. వాళ్లకు జి-కంపెనీ బైక్‌లు, ఫోన్‌లు సమకూర్చింది. ఊరంతా తిరుగుతూ 'సమాచారం' సేకరించడమే వారి పని. ఒక్కముక్కలో చెప్పాలంటే... వీరు జి-కంపెనీ తరఫు గూఢచారులు. జి-కంపెనీ గనుల్లో ప్రైవేటు గార్డులు ఎస్ఎల్ఆర్‌లతో (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్) కాపలా కాస్తుంటారు. అక్కడ అడుగుపెట్టాలంటే అధికారులకూ గుండె అదురుతుంది.
బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి 60 గదులతో ఒక భారీ బంగళా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక కాటేజ్‌లాగా ఉన్న నిర్మాణానికి అనుసంధానంగా మరో భవనం కడుతున్నారు. అది కూడా ఒక ఎకరా విస్తీర్ణంలో! ఆ ఇంటికి సుమారు 20 మంది దృఢకాయులు తుపాకులతో కాపలా కాస్తుంటారు.
ఆ ఇంటికి ప్రధాన రహదారితో అనుసంధానించే 500 మీటర్ల పొడవైన రహదారిపై సీసీటీవీలు నిఘా కన్నేసి ఉంటాయి. బాంబులు వేసినా ఏమీకాని షెల్టర్లు ఈ భవంతి ప్రత్యేకత. ఈ భవనం పక్కనే గాలికి ప్రధాన సహచరుడైన బి.శ్రీరాములు కూడా 60 గదులతో ఓ బంగళా కడుతున్నారు. ఈ రెండు భవంతులను కలుపుతూ ఒక దారి ఉంటుంది. ఇంటిపై భాగాన హెలిప్యాడ్ కూడా ఏర్పాటవుతోంది.
అయ్యో... ఆంజనేయులు
లీజు, యంత్రాలు, కార్మికులు ఉండగానే మైనింగ్... ఇనుప ఖనిజం తవ్వుకోవడానికి ఇవి మాత్రమే సరిపోవు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, గనుల భద్రత డైరెక్టర్ జనరల్ ఇచ్చే 'ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్ సర్టిఫికెట్' కలిగిన అధికారి ఆధ్వర్యంలోనే భారీ స్థాయి మైనింగ్ జరగాలి. జి-కంపెనీ 2006లో ఇలాంటి అధికారిని నియమించుకుంది. ఆయన పేరు ఆంజనేయ.
అంతరగంగమ్మ కొండ (ఏజీకే)లో ఆయన ఆఫీసు. గని ఆవరణలోనే నట్లు, బోల్టులు, రేకులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయమది. జి-కంపెనీపై సీబీఐ దాడులు జరగవచ్చని నాలుగు నెలల క్రితం వార్తలు గుప్పుమన్నాయి. ఆంజనేయ ఎప్పట్లాగానే ఏజీకేలోని తన ఆఫీసుకు వెళ్లారు. ఆశ్చర్యం... అక్కడ తన కార్యాలయం కనిపించలేదు.
నాలుగేళ్లపాటు తాను కూర్చున్న కుర్చీతోపాటు... విలువైన రికార్డులూ అదృశ్యం! అసలేం జరిగిందని ఆరా తీస్తే... రాత్రికి రాత్రి 'కార్యాలయాన్ని' రికార్డులతో తరలించాలని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) ఎండీ శ్రీనివాసరెడ్డి ఆదేశించడం... రికార్డులను తరలించడం జరిగిపోయింది. ఆ తర్వాత కొండపై నుంచి ఓ భారీ ఎక్స్‌కెవేటర్ వచ్చి ఆఫీసును నామరూపాలు లేకుండా చేసింది. దీంతో ఆంజనేయకు షాక్ కొట్టినంత పనైంది.
ఆయన వెంటనే బళ్లారిలోని ఎండీ శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్లారు. అంతకుముందు రోజుదాకా ఆంజనేయ వద్ద పని చేసిన లక్ష్మీప్రసాద్ ఆ సమయంలో శ్రీనివాసరెడ్డి ఆఫీసు ముందు కనిపించాడు. ఆంజనేయ లోపలికి వెళ్లారు.
"సీబీఐ వాళ్లు వచ్చే అవకాశముంది. వాళ్లు నన్ను కూడా ప్రశ్నిస్తారు. రికార్డులు లేకుండా నేనేమీ చెప్పలేను'' అని శ్రీనివాసరెడ్డి ముందు తన ఆందోళన వ్యక్తం చేశారు. "మరేం ఫర్వాలేదు. రికార్డులు నా దగ్గరే ఉన్నాయి. సీబీఐ విచారణ గురించి నా అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటాడు. మీరు ఇంటికి వెళ్లండి'' అని తేలిగ్గా చెప్పారు. ఆంజనేయ బయటికి వచ్చారు. లక్ష్మీప్రసాద్ తనను అదోలా చూడటాన్ని గమనించారు.
"నాకు తెలియకుండానే రికార్డులు తీసుకొచ్చారు. ఆఫీస్‌ను ఎత్తేశారు. నన్ను నేను కాపాడుకోవాలంటే... అక్కడ ఏం జరిగిందో చెప్పాల్సి ఉంటుంది'' అని స్పష్టం చేశారు. అదే ఆయన చేసిన తప్పు! లక్ష్మీ ప్రసాద్ వెంటనే ఈ విషయాన్ని ఎండీ శ్రీనివాస రెడ్డికి చేరవేశారు. బహుశా... ఆంజనేయ దగ్గర రికార్డుల డూప్లికేట్ కాపీలు ఉండొచ్చనే సందేహం వచ్చింది. ఆ తర్వాత... ఆంజనేయ కిడ్నాప్ జరిగింది.
ఆయన కుటుంబం అనేకమార్లు బెదిరింపులు ఎదుర్కొంది. హృద్రోగి అయిన ఆంజనేయ ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నారు. ఆయన అల్లుడిని కూడా బెదిరించారు. ఆయన కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆంజనేయ ఇంటి నుంచి అడుగు బయటపెట్టడంలేదు.
'గాలి' మార్కు ఆక్రమణ
జి-కంపెనీ గనుల ఆక్రమణ గురించి ఆంజనేయ బయటపెట్టారు. '2008లో ఎండీ శ్రీనివాస రెడ్డి కొంతమందిని తీసుకెళ్లి మా పక్కనే ఉన్న తుమటి గనిపై దాడి చేయాలని నాకు సూచించారు. నేను ఆ పనిచేయలేదు. పనులు ఆపాలని మాత్రమే తుంటి మైన్స్ సిబ్బందికి సమాచారం పంపాను. కొద్దిసేపటికి శ్రీనివాసరెడ్డి వచ్చా రు. 'ఈ పని కూడా చేయలేకపోయావా?' అని.. స్కార్పియోలలో కొంతమందితో మైన్స్ వద్దకు వెళ్లారు. అక్కడి ఫోర్‌మ్యాన్‌ను కొట్టారు. అతనికి నేను తప్ప ఇంకెవరూ తెలియదు. దీంతో... నాపైనే కేసు పెట్టారు' అని ఆంజనేయ వాపోయారు.
గాలి మాటలు
జూ గాలి జనార్దనరెడ్డి, కరుణాకర్ రెడ్డి, సోమశేఖర రెడ్డి... ముగ్గురు సోదరులు. మరో మంత్రి బి.శ్రీరాములును 'గాలి' సొంత సోదరుడిలా చూసుకుంటారు. వీరందరిదీ ఒకే మాట, ఒకే బాట!
జూ బళ్లారిలో 30 ఏళ్లకు సరిపడా ఇనుప ఖనిజం నిక్షేపాలున్నట్లు అంచనా. అక్రమ తవ్వకాలతో అదంతా ఆరునెలల్లో ఖాళీ అయ్యే ప్రమాదం నెలకొంది.
జూ రోజుకు రూ.20 కోట్ల సంపాదన! ఎవరైనా ఊహించగలరా? గాలి సోదరులకే ఇది సాధ్యం. టన్ను ఇనుప ఖనిజానికి వారు ప్రభుత్వానికి చెల్లించేది 27 రూపాయలు. విక్రయించేది రూ.ఏడు వేలకు.
జూ అక్కడ గాలి, నీరు, చెట్లు, చేమలు, చివరికి... మనిషి శరీరం కూడా ఎర్రబడుతుంది. విచ్చలవిడిగా రవాణా అయ్యే ఇనుప ఖనిజమే దీనికి కారణం.
జూ గాలికి రెండు సొంత హెలికాప్టర్లు ఉన్నా యి. రాత్రి ఒకటి, పగలు మరోటి వాడతారు. 'పర్యాటక అవసరాల కోసం' మరో పది కొననున్నారట.
జూ కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన ఇం'ధన' వనరు గాలి జనార్దనరెడ్డే అని చెబుతారు. ఆయన తదుపరి లక్ష్యం... ఢిల్లీ పీఠమే! సుష్మాస్వరాజ్‌ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట.
అక్రమ మైనింగ్‌పై టాస్క్‌ఫోర్స్: జైరాం రమేశ్
న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. కర్ణాటకలో అక్రమ మైనింగ్‌పై కేంద్రానికి పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
'వివిధ ఖనిజాలకు సంబంధించి అక్రమ మైనింగ్ అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించాను. ప్రస్తుతం అది కేంద్ర హోంమంత్రి పరిశీలనలో ఉంది' అని పర్యావరణ మంత్రి జైరాంరమేష్ వివరించారు.