1000 రూపాయలు ఒకటోసారి..2000.. రెండోసారి..
ఆ.. 5000.. మూడోసారి..
ఇలాంటి వేలంపాటలు వినే ఉంటారుగా..! అంతెందుకు మొన్నటికి మొన్న జరిగిన ఐపీఎల్ వేలంపాటలు గుర్తున్నాయి కదూ! దీనికి కొంచెం భిన్నంగా ఉంటాయి ఆన్‌లైన్ వేలం పాటలు. అరుదైన వస్తువులు, దుస్తులు, అమూల్యమైన కళాఖండాలు, హస్తకళా వస్తువులు, ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలూ ఈ వేలంలో కొలువు తీరుతాయి. ఇలాంటిదే ప్రముఖ పాప్ చిత్రకారుడు రాబర్ట్ ఇండియానా 'లక్కీ 8' వేలం కూడా. ఈరోజు హాంకాంగ్‌లో జరగబోయే ఈ వేలాన్ని దక్షిణ కొరియాకు చెందిన సియోల్ ఆక్షన్ సంస్థ నిర్వహిస్తోంది.
అందరి చూపూ అటువైపే..
ఎరుపు, వయొలెట్ రంగుల్లో 1.8 మీటర్ల పరిమాణంలో రూపుదిద్దిన లక్కీ '8' శిల్పానికి ఎందుకంత ప్రాధాన్యం అనుకుంటున్నారా? చైనీయులు 8 అంకెను తమ లక్కీ నంబరుగా భావిస్తుంటారు.. అందుకే ఈ వేలంలో ప్రముఖ పాప్ కళాకారుడు రాబర్ట్ ఇండియానా వేసిన ఈ '8' అంకె రూ.2.25 కోట్ల నుంచి రూ.2.60 కోట్ల మేర (4.90 లక్షల డాలర్లు- 5.80 లక్షల డాలర్ల) ధర పలకొచ్చని అంచనా. దీన్ని సొంతం చేసుకునేందుకు చైనా సహా పలు ఆసియా దేశాలకు చెందిన ధనికులు ప్రయత్నించొచ్చని తెలుస్తోంది. అంకెల్లో కళారూపాలను వేలానికి పెట్టడం చాలా అరుదని, ఫలితంగా 'లక్కీ 8'కి మంచి డిమాండ్ ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనీయుల '8.. మేనియా'?
చైనీయులు '8' అంకెను ఎంతో అదృష్టంగా భావిస్తారు. అందుకో ఉదాహరణ ఇటీవలి బీజింగ్ ఒలింపిక్సే. 2008వ సంవత్సరం 8వ నెల, 8వ తేదీ, 8 గంటల 8 నిమిషాల 8 సెకన్లకు ప్రారంభించారు. చైనా భాషలో 8ని 'బా' అని పిలుస్తారు. ప్రగతి అనే అర్థంతో కూడిన పదాలను 'ఫా' అనే ఉచ్ఛరణతో పలుకుతారు. అందుకే ప్రగతి, ముందడుగు వంటి అర్థాలను ప్రతిబింబించే ఉచ్ఛరణ, అర్థాన్నిస్తున్న '8' అంకెకు చైనీయులు అంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు.