విదేశీ విశ్వవిద్యాలయాలతో నష్టం లేదు
మన సామర్థ్యాలు పెరుగుతాయి
ఐఎస్‌బీ 'గ్రాడ్యుయేట్స్ డే'లో కపిల్ సిబాల్
హైదరాబాద్, న్యూస్‌టుడే: 'విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు దేశంలోకి అడుగు పెడితే.. కలిగే నష్టం ఏమీ లేదు. ఉన్నత విద్య, నిర్వహణ విద్యలో భారత్ సామర్థ్యాలు పెరుగుతాయి. అత్యున్నత ప్రమాణాలు కలిగిన అధ్యాపకులు అందుబాటులోకి వస్తారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం మరింత మంది విద్యార్థులకు లభిస్తుంద'ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. ఐఎస్‌బీ తొమ్మిదో 'గ్రాడ్యుయేషన్ డే'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్నింటికి మించి విదేశాల్లో చదువుకుంటే అయ్యే ఖర్చులో మూడో వంతుతో అదే స్థాయి ప్రమాణాలతో ఇక్కడే చదువుకోవచ్చునని అన్నారు. 'ఐఎస్‌బీలో 40 వేల డాలర్లకే (దాదాపు రూ.18.5 లక్షలు) లభించే విద్యకు విదేశాల్లో లక్ష డాలర్లు ఎందుకు వెచ్చించాలి. ఇక్కడ తిండి, ఇతర అన్ని ఖర్చులతో కలిపి 40 వేల డాలర్లు అవుతుంటే.. విదేశాల్లో వీటికి అదనంగా వెచ్చించాల్సి ఉంది' అని అన్నారు. కాగా పంజాబ్‌లోని మొహాలిలో ఏర్పాటు చేస్తున్న ఐఎస్‌బీ రెండో ప్రాంగణంలో తొలి బ్యాచ్ 2012 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్‌తో ఐఎస్‌బీ ఒప్పందం కుదుర్చుకుంది. సిబాల్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మరో 100 కంపెనీలొస్తాయి
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఐఎస్‌బీ విద్యార్థుల నియామకాలు (ప్లేస్‌మెంట్) చాలా మెరుగ్గా ఉన్నాయని ఐఎస్‌బీ డీన్ అజిత్ రంగ్నేకర్ చెప్పారు. ఇప్పటి వరకు నియామకాల కోసం వచ్చిన కంపెనీల వివరాలు వెల్లడించనప్పటికీ.. మరో 100 కంపెనీలు రానున్నాయని అన్నారు. 2010 బ్యాచ్‌లో మొత్తం 568 విద్యార్థులు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వీరు పట్టాలు తీసుకున్నారు. 2001 నుంచి ఇప్పటి వరకు మొత్తం దాదాపు 3000 మంది మేనేజిమెంట్ విద్యను అభ్యసించారు. ఈ కార్యక్రమానికి ఐఎస్‌బీ ఛైర్మన్ రజత్ గుప్తా తదితరులు హాజరయ్యారు.