రూ.2,200 కోట్ల సమీకరణకు స్టాన్‌చార్ట్ యత్నాలు మన కంపెనీలు విదేశాల్లో నిధులు సమీకరించాలంటే జీడీఆర్ లేదా ఏడీఆర్‌లు జారీ చేయాల్సిందే. అదే విదేశీ కంపెనీలు మన మార్కెట్ నుంచి నిధులు పొందాలంటే ఐడీఆర్‌లు జారీ చేయాలి. ఇంతవరకు ఇలా ఐడీఆర్‌లు జారీ చేయడమన్నది మన దేశంలో జరగలేదు. మొదటిసారిగా బ్రిటన్ బ్యాంకింగ్ దిగ్గజం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఐడీఆర్‌ల జారీకి సిద్ధమవుతోంది. ఇందుకు సెబీ, రిజర్వు బ్యాంకుల నుంచి తగిన అనుమతులు పొందే పనిలో ఉంది. అన్నీ సజావుగా సాగితే వచ్చే జూన్‌లో 500 మిలియన్ డాలర్ల(సుమారు రూ.2,200 కోట్లు)కు పైగా నిధులను సమీకరించడానికి ఈ బ్యాంకు ఐడీఆర్‌లు జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో ఐడీఆర్‌లంటే ఏమిటి? మదుపర్లకు, బ్యాంకుకు కలిగే ప్రయోజనం ఏమిటనే అంశాలపై క్లుప్తంగా..
జూన్‌లో ఐడీఆర్ ఇష్యూ

ఏడీఆర్ అంటే అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ఏడీఆర్). జీడీఆర్ అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్(జీడీఆర్). ఐడీఆర్ అంటే ఇండియన్ డిపాజిటరీ రిసీట్స్. మొదటిదాన్ని అమెరికా మార్కెట్లో జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తాయి. రెండోది ఐరోపా తదితర ప్రపంచ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు ఆయా కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి. మూడోది మన మార్కెట్‌కు సంబంధించినది. వీటిని మన మార్కెట్లో జారీ చేస్తారు. దీనికి అనుసరించే ప్రక్రియ అంతా మామూలుగా షేర్లు జారీ చేసి నిధులు సమీకరించినట్లే ఉంటుంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర కంపెనీలు అమెరికాలో ఏడీఆర్‌లు జారీ చేసి నిధులు సమీకరించిన పద్ధతిలోనే విదేశీ కంపెనీలు మనదేశంలో ఐడీఆర్‌లు జారీ చేసి నిధులు సమీకరిస్తాయన్నమాట. ఐడీఆర్ కొనుగోలు చేసిన వారికి కంపెనీలో ఈక్విటీ వాటాదార్లకు ఉన్నట్లుగానే హక్కులు ఉంటాయి. విదేశీ కంపెనీల్లో భారతీయులు పెట్టుబడి పెట్టడానికి ఇదో అవకాశం. రూపాయల్లోనే ఐడీఆర్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
కేటాయింపు ఇలా..
ఐడీఆర్ ఇష్యూ చేపట్టే విదేశీ కంపెనీ యథావిధిగా సెబీ, కంపెనీల రిజిస్ట్రార్‌లకు పూర్తి సమాచారాన్ని, అవసరమైన పత్రాలను అందించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదార్లకు కేటాయించిన ఐడీఆర్‌లను వారి డీమ్యాట్ ఖాతాల్లో క్రెడిట్ చేస్తారు.
అర్హులు ఎవరంటే..
దేశంలోని ప్రతి ఒక్క మదుపుదారూ అర్హుడే. కాకపోతే విభాగాన్ని బట్టి కోటా ఉంటుంది. విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ)తో సహా సంస్థాగత మదుపుదార్లు, రిటైల్ మదుపుదార్లు, సంస్థాగతేతర మదుపర్లు, ప్రవాస భారతీయులు ఐడీఆర్‌లు కొనుగోలు చేయవచ్చు. రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకొని వాణిజ్య బ్యాంకులు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఐడీఆర్‌కు కనీస బిడ్ రూ.20,000. రిటైల్ మదుపుదార్లకు గరిష్ఠ పరిమితి రూ.1,00,000. ఈక్విటీ షేర్ల జారీకి వర్తించే నిబంధనలే ఇందులోనూ వర్తిస్తాయి.
ఎందుకు ఆకర్షణీయం..
విదేశీ కంపెనీలు షేర్లను భారతీయ కరెన్సీలో కొనుగోలు చేసేందుకు ఇప్పుడు అవకాశం లేదు. కానీ అదే సమయంలో పలు బహుళజాతి కంపెనీలు సాధించే అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఆసక్తి దేశీయమదుపుదార్లకు ఉంటుంది. అటువంటి వారికి ఐడీఆర్‌లు అనుకూలం. వాటాదార్లకు ఉన్నట్లుగానే అన్ని హక్కులూ ఉంటాయి. కానీ వార్షిక సర్వసభ్య సమావేశాలకు మాత్రం హాజరు కావడానికి వీల్లేదు. ఏజీఎం తీర్మానాలపై ఓటింగ్ జరిగే సందర్భాల్లో డిపాజిటరీ రిసీట్ హోల్డర్లు, తమ విదేశీ కస్టోడియన్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.
ట్రేడింగ్ ఎలా..
ఐడీఆర్‌లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ చేస్తారు. డీమ్యాట్ పద్ధతిలో క్రయ విక్రయాలు సాగించవచ్చు. సాధారణంగా మాతృదేశంలో సంబంధిత కంపెనీ షేరు ధర ప్రకారం ఇక్కడి ఐడీఆర్ ధర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. దీన్ని బట్టి మదుపుదార్లు తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదే సమయంలో మన దేశంలో నిధులు సమీకరించే అవకాశం కలగడం సంబంధిత కంపెనీలకు కలిగే ముఖ్యమైన ప్రయోజనం.