Friday, April 9, 2010

కొరవడిన పరిశోధనలు


హైదరాబాద్‌: డిగ్రీ కాలేజీలు తక్కువ.. పీజీ కాలేజీలు ఎక్కువ అనే స్థాయిలో రాష్ట్రంలోని పలు సంప్రదాయక, కొన్ని ప్రత్యేక యూనివర్సిటీలు కొనసాగుతున్నాయి. అంటే యూనివర్సిటీల పరిస్థితి.. కాలేజీల కంటే అధ్వా న్నంగా మారాయి. భవిష్యత్తులో మరింత దయనీయమైన పరిస్థితుల్లో కూరు కుపోయే విధంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల స్వరూప స్వభావాలు మారబో తున్నాయి. ఈ ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం గుర్తించడం లేదు. ప్రభుత్వం తీరు ఈ విషయంలో ఇలానే ఉంటే.. రాష్ట్రంలోని ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర వంటి పలు సంప్రదాయక యూనివర్సిటీల అభివృద్ధికి అవకాశాలు మృగ్యమని ఆయా వర్సిటీల సీనియర్‌ ప్రొఫెసర్లు కుండబద్దలు కొట్టినట్టు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా పరిశోధనలు జరగడం లేదు. కేవలం విద్యా బోధనకే వర్సిటీలు పరిమితమయ్యాయని చెప్పుకొంటున్నప్పటికీ ఆ బోధ నలో కూడా నాణ్యత ప్రమాణాలు అడుగంటడం అందరిని విస్మయానికి గురి చేసే విషయం.

కొరవడిన పరిశోధనలు...
పరిశోధనలు విస్తృతంగా జరిపి.. వాటి ఫలాలను సమాజానికి ఉపయోగ పడే విధంగా చేయడం యూనివర్సిటీల విధి. అందుకోసమే యూనివర్సిటీలు ఏర్పాటవుతాయి. పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అందుకు తగిన ఆర్థిక సహాయం ప్రభుత్వాలు అందించడం లేదు. యూనివర్సిటీలలో పరిశోధన లకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం కేవలం కేంద్ర ప్రభుత్వ సహాయంపైనే ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడింది. పరిశోధనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాని కి ఏమీ పట్టదన్నమాట. అంటే పరిశోధనలకోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయదు. వర్సిటీలలో పని చేసే టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకుండా పోయాయి. అయితే నానా తిప్పులు పడి జీతాల కోసం కేవలం 50 శాతం మాత్రమే నిధులు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలపై దృషి పెట్టడం సాధ్యం కాదని తెలిసి పోయింది. జీతాలకే డబ్బులు లేని స్థితిలో ఉన్న తాము ఇక పరిశోధనలు ఏ విధంగా జరపాలనే ప్రశ్నలు వర్సిటీలు సంధిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చెవులకు ఎక్కడం లేదు. గతం వరకు ఉస్మానియా, ఆంధ్రా వంటి పలు వర్సిటీలలో కొంత మేర పరిశోధనలు జరిగేవి.. గత ఆరు సంవత్సరాల నుంచి పరిశోధనలు అనేవి ఆయా వర్సిటీలలో జరగడం లేదన్నది అందరికీ తెలిసిందే.

యూనివర్సిటీల ఏర్పాటు ఎందుకు ?
సమాజానికి ఉపయోగ పడే.. పరిశోధనలు లేకుండా యూనివర్సిటీలను నడ పడం ఎందుకనే విమర్శలు ఇప్పుడు మేధావి వర్గం నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఉన్న యూనివర్సిటీలలోనే పరిశోధనలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వ సహాకరిం చని నేపథ్యంలో ఇక కొత్త యూనివర్సిటీలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని కొన్ని యూనివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ రేకుల షెడ్లలో యూనివర్సిటీలలో బోధన జరుగు తున్నప్పడు ఇక అక్కడ పరిశోధనలకు మాత్రం అవకాశం ఎలా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి. జేఏన్‌టీయూ హైదరాబాద్‌, అగ్రకల్చర్‌ వంటి ఒకటి రెండు ప్రత్యేక యూనివర్సిటీలలో కూడా పరిశోధనలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.

వాస్తవానికి యూజీసీ, సీఎస్‌ఐఆర్‌, డీపీటీ వంటి సంస్థల నుంచి పరిశోధనల నిమిత్తం నిధులు మంజురు కావాలి. దాని కోసం యూనివర్సిటీలు, విద్యార్థులు చేసిన దరఖాస్తులను బట్టి నిధులు మంజురవు తాయి. రాష్ట్రంలోని పలు వర్సిటీలు గాని, విద్యార్థులు కూడా పరిశోధనలు జర పడానికి ముందుకు రావడం లేదు. కొత్త యూనివర్సిటీల ఏర్పాటు .. కేవలం ఉపాధి అవకాశాల కోసమే తప్ప.. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచి, పరిశోధనలపై దృష్టి పెట్టాలన్న ఆలోచన ఏ మాత్రం చేయకపోవడం ఇక్కడ ప్రభుత్వం వంతైంది.

పట్టించుకోని ఉన్నత విద్యా మండలి...
రాష్ట్రంలోని ఉన్నత విద్య అభివృద్ధి కోసం ఏర్పాటైన ఉన్నత విద్యా మండలి.. ఆ విషయంపై కనీస దృష్టి కూడా పెట్టడం లేదు. విషయం ఉన్న వ్యవహారాలపైనే దృష్టి కేంద్రీకరించడం తప్ప వర్సిటీల అభివృద్ధికి సంబంధించిన ఇతర అంశాలను పట్టించుకోవడం లేదు. ఈ ప్రభావం గత ఆరు సంవత్సరాల నుంచి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2004 సంవత్సరంలో ఉన్నత విద్యా మండలికి ఛైర్మన్‌గా వచ్చిన ప్రాఫెసర్‌ కేసీరెడ్డి కూడా పరిశోధనలపై దృష్టి పెట్టలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరిశోధనలకు కావాల్సిన సలహాలు ఇవ్వడం, వాటికి కావాల్సిన నిధులను మంజురు చేయడం వంటీ పనులను ఉన్నత విద్యా మండలి చక్కబెట్టాల్సిన ఉందని ప్రొఫెసర్లు చెబుతున్నారు.