Thursday, April 1, 2010

ఏప్రిల్ ౧ ఎఫ్ఫెక్ట్


బీఎస్‌ IVతో పాటే ధరాభారమూ
ఏప్రిల్‌ 1.. ప్రతీ ఏడాదీ వచ్చేదే. ఈ సారి మాత్రం దీనికి మూడు ప్రత్యేకతలున్నాయి. ఒకటి కొత్త కాలుష్య ప్రమాణాల రాక. మరొకటి రోజు వారీ వడ్డీ లెక్కింపు. మూడోది మదిదోచిన ఆరు మోడళ్ల విక్రయాలు నిలిచి పోవడం. మొదటి దాని వల్ల వాహనాలకు మేలు జరుగుతూ ఉండగా. . ప్రజలకు కాలుష్య ఇబ్బందులు కాస్త తగ్గుతాయి. రెండో దాని వల్ల బ్యాంకు ఖాతాదారులకు అదనపు ప్రయోజనం కలగనుంది. మూడోది చరిత్రకు సాక్ష్యంగా నిలిచిపోతూ మారుతీ 800 సహా కొన్ని కంపెనీల మోడళ్లు కొందామన్నా కనిపించవిక.
కాలుష్య కోరల పదునును కాస్త తగ్గించే భారత్‌ స్టేజ్‌ -IV ప్రమాణాలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తున్నాయ్‌. హైదరాబాద్‌ సహా 13 ప్రధాన నగరాల్లో ఈ ప్రమాణాల అమలుకు అటు కార్ల కంపెనీలు.. ప్రభుత్వ యంత్రాంగం.. చమురు సంస్థలు(ప్రమాణాలకు తగ్గట్టు ఇవి ఇంధన సరఫరా చేస్తాయి) అన్నీ సమాయత్తం అయ్యాయి. ఈ ప్రమాణాల వల్ల వాహనాల ఇంజిన్లు మెరుగుపడనున్నాయి. అయితే పెంచిన నాణ్యతకు అనుగుణంగానే ధరలనూ పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. ఇది వినియోగదార్లకు కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఇప్పటికే ఈ ఏడాది రెండు సార్లు కార్ల ధరలు పెరిగాయి. దాదాపు అన్ని వాహన సంస్థలు కార్ల ధరలను 1-3 శాతం పెంచేందుకు సమాయత్తం అవుతున్నాయి. చిన్న కార్లపై పెంపు రూ.2,000 నుంచి విలాసవంతమైన కార్లపై రూ.71,000 వరకు ఉండనున్నట్లు సమాచారం. కొత్త కాలుష్య ప్రమాణాలకు తగ్గట్లు వాహనాలను రూపొందించేందుకు ఇంజినీరింగ్‌ పరంగా మార్పులు అవసరం. అందుకే ధరలు పెంచాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. అన్ని మోడళ్లపై 1-1.5 శాతం ధరలను పెంచుతున్నట్లు జనరల్‌ మోటార్స్‌ బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. మరోవైపు టయోటా కూడా 1-3% వరకు ధరలు పెంచుతామని చెబుతోంది. గరిష్ఠంగా రూ.15,000 పెంపు ఉండొచ్చని పేర్కొంది. డీజిల్‌ వాహనాల ధరలను 3 శాతం వరకు, పెట్రోలుతో వాహనాల ధరలను ఒక శాతం నుంచి 2 శాతం వరకు పెంచనున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. మారుతీ సుజుకీ మాత్రం పెంపుపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. టాటా మోటార్స్‌ కూడా సరైన సమయంలో స్పందిస్తామని అంటోంది.
రోజువారీ వడ్డి లెక్కింపు
బ్యాంకు ఖాతాదారులు ఈ రోజు నుంచి అదనపు ప్రయోజనం పొందనున్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు పొదుపు ఖాతాలోని జమపై రోజువారీ వడ్డీని లెక్కించడం బ్యాంకులు ఇవాల్టి నుంచే మొదలు పెట్టనున్నాయి. దీంతో కనీసం 30-40 బేసిస్‌ పాయింట్ల మేర ఎక్కువ ప్రయోజనం రానుంది. ఇప్పటిదాకా పొదుపు ఖాతాలో ప్రతి నెలా 10 తేదీ నుంచి ఆ నెలాఖరు వరకూ ఉన్న కనిష్ఠ నగదు నిల్వలపైనే లెక్కిస్తూ వచ్చారు. అంటే పదో తేదీలోపు ఎంత పెద్ద మొత్తమున్నా ఖాతాదారులకు వడ్డీ ఏమీ వచ్చేది కాదు. అది కూడా కేవలం 3.5 శాతం వడ్డీని మాత్రమే లెక్కగట్టేవారు. కానీ కొత్త విధానం వల్ల బ్యాంకు ఖాతాదారులు పూర్తి ప్రయోజనం పొందనున్నారు. ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకూ ఉన్న నిల్వలపై రోజువారీగా కూడా 3.5 శాతం వడ్డీ ప్రకారమే లెక్కగడతారు. దీని వల్ల మొత్తం మీద 3.5 శాతం కంటే ఎక్కువే వడ్డీ వచ్చే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉండడం విశేషం. అయితే ఖాతాలో నగదు నిల్వ, జమ, ఖర్చుల లావాదేవీలను బట్టి వడ్డీ ఆదాయం మారుతూ ఉంటుంది. అంతక్రితం, తాజా విధానాల్లో ఉన్న సారూప్యం ఏమిటంటే వడ్డీ ఆదాయం ఆరు నెలలకోమారు జమ చేయడం. మొత్తం మీద ఈ ఏప్రిల్‌ 1 పొదుపు ఖాతాదార్లకు తీపి కబురును మోసికొచ్చిందనే చెప్పాలి.
ఇక మారుతీ 800 విక్రయాలు ఉండవ్‌
మరో 5 మోడళ్లు సైతం
న్యూఢిల్లీ: వ్యాపార నీతికి సెంటిమెంటు తలొగ్గింది. 26 ఏళ్ల విప్లవానికి నేటితో చరమ గీతం పాడాల్సి వచ్చింది. మారుతీ సుజుకీకి ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చిన 'ఎమ్‌800' మోడల్‌ ఈ రోజు నుంచి 13 నగరాల్లో ఇక కనిపించదు. కొత్త కాలుష్య ప్రమాణాలు అమల్లోకి వస్తుండడమే ఇందుకు కారణం. మారుతీ 800ను బీఎస్‌IVప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం వల్ల వ్యాపారానికి అంత అనుకూలం కాదని.. అందుకే సెంటిమెంటును పక్కనపెట్టాల్సి వచ్చిందని కంపెనీ ఛైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ పేర్కొన్నారు.ఈ 26 ఏళ్లలో 28 లక్షల మారుతీ800 కార్లను విక్రయించామని.. ఇదులో దేశయంగానే 25 లక్షలున్నాయని ఆయన తెలిపారు.

ఈ ఒక్క మోడలే కాదు.. ఇంకా ఫోర్డ్‌ ఐకాన్‌(1.3 పెట్రోల్‌), ఫియట్‌ పాలియో, స్కోడా ఫాబియా(1.2 పెట్రోల్‌), ఆక్టివా(1.9 టీడీఐ ఇంజిన్‌), జీఎంకు చెందిన షేవర్లే టవేరా(2.5 డీఐ)ల విక్రయాలు ఇక ఉండవ్‌. ఇవన్నీ కూడా మొత్తం దేశ వ్యాప్తంగా జరిగే కార్ల విక్రయాల్లో 40-50 శాతం వీటిదే భాగం కావడం గమనార్హం.