గ్రామాల్లో ఇక ఆధునిక సోలార్ ‘మ్యాజిక్ ల్యాంప్‌లు ’
బెంగళూరు : గ్రామాల్లో సహజంగా కనిపించే విద్యుత్ దీపాల ఇబ్బందులను తప్పించేందుకు కొత్తగా ఆధునిక సోలార్ మ్యాజిక్ లైట్లు మార్కెట్లోకి రానున్నాయి. గ్రామాల్లో ఇంధన వినియోగ అవరసరాలను దృష్టిలో పెట్టుకుని, బెంగళూరుకు చెందిన కోటక్ ఉర్జా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఈ మ్యాజిక్ ల్యాంప్‌లను రూపొందిస్తోంది. విభిన్న రకాలుగా ఈ మ్యాజిక్ ల్యాంప్‌ను వాడుకునే సౌకర్యాలు దీనికి జోడించారు. ’ఎగ్ ల్యాంప్’ పేరిట త్వరలో వీటిని విడుదల చేయనున్నట్టు సంస్థ ఇక్కడ ప్రకటించింది. మొబైల్ చార్జింగ్‌తో పాటు యాంటినా స్పీకర్లను జతపరిచిన ఎఫ్‌ఎం రేడియో సదుపాయం కూడా దీనికి ఉంది. ఈ నెలలో సోలార్ మ్యాజిక్ ల్యాంప్లను విడుదల చేసేందుకు సంస్థ సిద్ధం అవుతుంది.
విడుదలకు ముందే తాము రూపోందించిన మ్యాజిక్ లైట్, ఉత్తమ ఎలక్ట్రానిక్ ఉత్పత్తిగా భారత సెమికండక్టర్ అసోసియేషన్ నుంచి గుర్తింపును పొందిందని సంస్థ తెలిపింది. ఈ మ్యాజిక్ ఎగ్ ల్యాంప్ సోలార్ ఎనర్జీ ద్వారా ఆరు గంటల పాటు రీచార్జ్ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కిరోసిన్ లాంప్‌లకు ఇది ప్రత్యామ్నాయం కానుంది. ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్ మోడ్‌ల ద్వారా దీని వాడుకను 16గంటల పాటు కొనసాగించవచ్చని సంస్థ తెలిపింది. అన్ని రకాల టాప్ బ్రాండ మొబైల్ హ్యాండ్‌సెట్లను దీని ద్వారా రీచార్జ్ చేసుకునే సౌకర్యం కల్పించామని సంస్థ సీఈఓ శ్రీనివాస్ కుమార్ ఇక్కడ తెలిపారు.
తేలిక బరువు, ఎన్‌ఐఎంహెచ్ బ్యాటరీతో పాటు పోర్టబుల్‌గా రూపొందించబడిన ఈ మ్యాజిక్ ల్యాంప్ 2.2కేజీల బరువు ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ ల్యాంప్ గ్రామీణ ప్రాంతాల వారికి ఎమర్జన్సెసీ ల్యాంప్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు. 25వోట్ల విద్యుత్ బల్బ్ తరహాలోనే దీని వెలుతురు సామర్థ్యం కూడా ఉంటుందని తెలిపారు. దేశంలోని అన్ని తరగతుల ప్రజలకు దీన్ని చేరవేసే ప్రయత్నంలో సంస్థ పలు ఎన్‌జీఓలు, పారిశ్రామికవేత్తలకై చూస్తోంది. తమ నెట్‌వర్కును విస్తరించి ఈ ఏడాదిలోగా 30వేల యూనిట్ల అమ్మకాలను, మరో రెండేళ్లలో 5-10లక్షల యూనిట్ల అమ్మకాలు జరపాలని యోచిస్తున్నట్టు సంస్థ సీఈఓ పేర్కొన్నారు. చిన్న కొట్టు వ్యాపారులకు, కూరగాయాల విక్రయదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ ల్యాంపు ధర 1500 రూపాయలకు దిగువన ఉంటుందని ఆయన అన్నారు.